తిరుపతి జనసేన అభ్యర్థిగా డా. హరిప్రసాద్?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేన పార్టీ ఆశిస్తుంది. ఈసారి తిరుపతి నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించాలని, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుండి తమ విజయం నమోదు కావాలని జనసేన భావిస్తుంది. ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పటివరకు ఇదిమిద్దంగా లేలలేదు. జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాని ఆయన సోదరుడు నాగబాబుని పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల తిరుపతికి వచ్చిన నాగబాబు దీనిని కొట్టిపారేయలేదు. పరిశీలనలో ఉందని చెప్పారు.
తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ గాని ఆయన సోదరుడు నాగబాబు పోటీ చేయని పక్షంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వ్యవహారాల కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. ఆయనకు పవన్ కళ్యాణ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రముఖ డాక్టర్ గా, నెమ్మదస్తుడిగా హరి ప్రసాద్ కు పేరు ఉంది. అందరిని కలుపుకొని పోయే నాయకుడిగా జనసేనలో పేరుపొందారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నాగబాబు దృష్టిలో మంచిగా హరి ప్రసాద్ చలామణి అవుతున్నారు. వివాదాలకు దూరంగా అందర్నీ కలుపుకొని పోయే మంచి స్వభావం ఉన్న హరిప్రసాద్ ను తిరుపతి నుంచి పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ పార్టీ అధికార ప్రతినిధి, తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ కూడా తిరుపతి స్థానాన్ని ఆశిస్తున్నారు.
YSR కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మళ్ళి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన గతంలోనే ఇదే చివరి ఎన్నికలని ప్రకటించారు. ఆయన కుమారుడు భూమన అభినయ రెడ్డి బరిలో ఉండే అవకాశం ఉంది. ఆయన తిరుపతి నగర ఉపమేయరుగా వ్యవహరిస్తున్నారు. BCలకు ఇవ్వాలనుకుంటే తిరుపతి మేయర్ శిరీష యాదవ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా తిరుపతిలో ఈసారి సీట్ల సర్దుబాటు, ఎన్నిక ఉత్కంఠభరితంగా జరగనుంది.