13, నవంబర్ 2023, సోమవారం

స్వామికి టిక్కెట్టు దక్కేనా ?

టిక్కెట్ రేసులో  నూకతోటి రాజేష్, నారమల్లి పద్మజ 
పరిశీలనలో ఒక టిడిపి నేత పేరు !



వర్గపోరుతో సతమతమవుతున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రానున్న ఎన్నికలలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి టిక్కెట్టు దక్కడం అనుమానంగా కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో నారాయణ స్వామికి టిక్కెట్టు రాకుండా చేయడానికి మాజీ పార్లమెంటు సభ్యుడు, ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో  జ్ఞానేంద్ర రెడ్డికి, నారాయణ స్వామికి పడటం లేదు. నియోజకవర్గంలోని వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. నియోజకవర్గంలో నారాయణ స్వామి ఎక్కడికి వెళ్లినా, జ్ఞానేంద్ర రెడ్డి వర్గీయులు నిలదీస్తున్నారు. నారాయణ స్వామి కూడా రెడ్డి వర్గీయుల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. దానిని మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి అపాదిస్తూ పత్రికలలో వార్తలు వస్తున్నాయి. దీనితో నారాయణ స్వామి రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకం అనే ముద్రను వేశారు. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువ. ఆ వర్గం ఎటు మొగ్గుచూపితే అటు విజయం వరిస్తుంది అనడంలో అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో నారాయణ స్వామికి మళ్ళీ టిక్కెట్టు ఇస్తే ఓటమి తప్పదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంలో జ్ఞానేంద్ర రెడ్డి వర్గీయులు సఫలం అయినట్లు సమాచారం.


దీంతో వైసిపికి కంచు కోట అయిన జి డి నెల్లూరు నియోజక వర్గంలో ఈ సారి కొత్త రక్తం నింపేందుకు జగన్ కసరత్తులు ప్రారంభించారని సమాచారం. ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి స్థానంలో కొత్త వ్యక్తికి అవకాశం కల్పిస్తారని తెలిసింది. టిడిపి ఎన్ని కుప్పిగంతులు వేసినా ఇక్కడ వైసిపికి ఢోకా ఉండదని అంటున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇక్కడ కొత్త వారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం.

నియోజక వర్గం ఏర్పడిన తరువాత 2009 లో ఇక్క కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ టిడిపి అభ్యర్థి ఆర్ గాంధీపై 10,826 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఆమె టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కుతూహలమ్మపై  వైసిపి అభ్యర్థి నారాయణ స్వామి 20,565 ఓట్ల ఆధిక్యంతో సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్థి, కుతూహలమ్మ కుమారుడు డాక్టర్ హరికృష్ణపై 45,594 ఓట్ల మెజారిటీ సాధించారు. జగన్ ఆశీస్సులతో ఉప ముఖ్య మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

గతంలో గుమ్మడి కుతూహలమ్మ  వేపంజేరి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు, జి డి నెల్లూరు ఎమ్మెల్యేగా ఒకసారి కాంగ్రెస్ టిక్కెట్ గెలుపొందారు. అయితే ఆమె, ఆమె కుమారుడు టిడిపి టిక్కెట్టుపై పోటీ చేసి ఓడి పోవడానికి కారణం ఇక్కడ వైసిపికి తిరుగులేని బలమే కారణం. అయితే నారాయణ స్వామి పట్ల ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి  వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే కొందరు రెడ్డి సామాజిక వర్గీయులు ఆయన పట్ల అసమ్మతి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని జగన్ భాయిస్తున్నారని తెలిసింది. 

కుతూహలమ్మ అక్క  కుమారుడు రాజేష్ తొలి నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. అలాగే మాజీ ఎంపి ఎన్ శివప్రసాద్ చెల్లెలు పద్మజ కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. వీరిద్దరితో పాటు ఒక టిడిపి నేత పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన  పేరు చిత్తూరు లోక్ సభ స్థానం కోసం కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది.అయితే నారాయణ స్వామికి తిరుపతి లోక్ సభ లేదా సత్యవేడు టిక్కెట్ ఇస్తారని అంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *