నగరిలో రెడ్లదే ఆధిపత్యం
నగరిలో ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాను ఓడించేందుకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. తన వల్ల రాజకీయ నాయకురాలిగా ఎదిగిన రోజా ఇప్పుడు తనను తీవ్ర స్థాయిలో విమర్శించడం చంద్రబాబుకు బాధ కలిగిస్తున్నది. దీంతో ధీటైన అభ్యర్థిని రంగంలోకి దించడానికి పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో రోజాకు సమఉజ్జీనీ బరిలోకి దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దీనికోసం రాబిన్ శర్మ బృందం, ఇతర సంస్థలతో సర్వేలు చేసి మూడు పేర్లతో జాబితా సిద్దం చేసుకున్నారని అంటున్నారు. ఇంచార్జి గాలి భానుప్రకాష్, అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, సిద్దార్థ విద్యా సంస్థల అధిపతి కొండూరు అశోక్ రాజు పేర్లు పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం.
తెలుగు దేశం ఏర్పడిన తరువాత తొమ్మిది సార్లు జరిగిన ఎన్నికల్లో 1983లో ఇ వి గోపాల రాజు, 1994లో వి దొరస్వామి రాజు 2009 లో గాలి ముద్దు కృష్ణమ నాయుడు టిడిపి అభ్యర్దులుగా పోటీ చేసి గెలిచారు. 1985, 1989,1999, 2004 లో రెడ్డివారి చంగా రెడ్డి కాంగ్రెస్ టిక్కెట్టుపై విజయం సాధించారు. 2014, 20019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి రోజా గెలుపొందారు. దీని ప్రకారం చూస్తే కాంగ్రెస్ నాలుగు సార్లు, వైసిపి రెండు సార్లు గెలవడం జరిగింది. టిడిపి మూడు సార్లు విజయం సాధించింది. కులాల వారిగా చూస్తే రెడ్లు ఆరు సార్లు, రాజులు రెండు సార్లు, కమ్మ నేత ఒక సారి గెలిచారు.
1998 లో సినిమాలలో నటిస్తున్న రోజాను చంద్రబాబు పార్టీలో చేర్చుకుని ఏకంగా రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు చేశారు. ఆమెలో ఉన్న నాయకత్వ లక్షణాలను చూసి ఒకే సారి రాష్ట్ర నాయకురాలిగా చేశారు. 2004లో నగరి ఆమె నగరి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత ఐదు సంవత్సరాలు ఆమె అక్కడ పార్టీని పటిష్ట పరిచారు. అయితే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన గాలి ముద్దు కృష్ణమ నాయుడు టిడిపిలో చేర్చుకుని నగరి టిక్కెట్టు ఇచ్చారు. దీనితో రోజా చంద్రగిరి నుంచి పోటీ చేయవలసి వచ్చింది. ముద్దు కృష్ణమ నాయుడు స్వంత మండలం అయిన రామచంద్రపురం చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నప్పటికి నగరి టిక్కెట్టు ఇచ్చి తన గొంతు కోశారని రోజా భావించారు. దీనికి తోడు కమ్మ సామాజిక వర్గం నేతలు కొందరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గల్లా అరుణ కుమారి గెలుపు కోసం పని చేసి తన ఓటమికి కారణం అయ్యారని ఆమె అప్పటిలో ఆరోపించారు.
దీనికి తోడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు సహా కొందరు కీలక నేతలు తనను అణచివేతకు గురి చేయడంతో ఆమె టిడిపిని వీడి కాంగ్రెస్ ముఖ్య మంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పంచన చేరింది. ఆయన మరణానంతరం జగన్ కు అండగా నిలిచి 2014 లో నగరి నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమ నాయుడుపై విజయం సాధించారు. అలాగే 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు గాలి భానుప్రకాష్ ను కూడా ఓడించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నగరి నియోజకవర్గంలో నగరి, పుత్తూరు మున్సిపాలిటీలు, నిండ్ర, విజయపురం, వడమాలపేట మండలాలు ఉన్నాయి. 2009 కి ముందు ఉన్న నారాయణవనం మండలాన్ని సత్యవేడు, కార్వేటినగరం మండలాన్ని జి డి నెల్లూరు నియోజకవర్గంలో చేర్చారు. అలాగే పుత్తూరు, వడమాలపేట మండలాలను నగరిలో కలిపారు. మొత్తం 1,94,748 మది ఓటర్లు ఉన్నారు. ఇందులో సామాజిక వర్గాల వారీగా మొదలియార్లు 42 వేలు, ఎస్సీలు 40 వేలు, బలిజ 33 వేలు, రెడ్లు 30 వేలు, రాజులు 25 వేలు, కమ్మ 20 వేల మంది ఉన్నారని అంచనా వేస్తున్నారు. మిగిలిన ఓట్లు ఇతర కులాల వారు ఉన్నారని లెక్కలు కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంచార్జి గాలి భాను ప్రకాష్ తో పాటు ఎన్ బి సుధాకర్ రెడ్డి, కె అశోక్ రాజు పేర్లు పరిశీలిస్తున్నారు.
పెనుమూరు మండలానికి చెందిన ఎన్ బి సుధాకర్ రెడ్డి 1983 లో జనతా అభ్యర్థిగా పుత్తూరు నుంచి పోటీ చేశారు.యువజన కాంగ్రెస్ జిల్లా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా , జిల్లా సేవాదళ్ చైర్మన్ గా పనిచేశారు. మాజీ మంత్రి రెడ్డి వారికి సన్నిహితంగా ఉన్నారు. రోజా వ్యతిరేకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నిత్యం రోజాపై విమర్శలు చేసి పాపులర్ అయ్యారు. ఆయన కొన్నాళ్ళు పుత్తూరు ఆంధ్రప్రభ రిపోర్టర్ గా పనిచేశారు. సైకాలజిస్టు, శిక్షకునిగా పలు కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహించారు.
విజయపురం మండలానికి చెందిన కొండూరు అశోక్ రాజు అశోక్ రాజు గతంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. పుత్తూరులో సిద్దార్థ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి సమాజ సేవ చేస్తున్నారు. గతంలో పలు సార్లు టిక్కెట్టు ఆశించి విఫలమయ్యారు. గత ఎన్నికల్లో దాదాపు ఆయనకే టిక్కెట్టు అన్న ప్రచారం జరిగింది. తనకు టిక్కెట్టు ఇస్తే జి డి నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాలలో ఉన్న రాజులు టిడిపికి అనుకూలంగా మారుతారని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా నగరి మండలానికి చెందిన తెలుగు యువత మాజీ జిల్లా అధ్యక్షుడు పోతుగుంట విజయబాబు కూడా టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన 2014 నగరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. ఆయనకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మద్దతు ఉంది. గత రెండేళ్లుగా ఆయన రాష్ట్ర కార్యాలయంలో ఉంటూ పార్టీకి సేవలు అందిస్తున్నారు.
కార్వేటినగరం మండలానికి చెందిన మాజీ మంత్రి ఇ వి గోపాల రాజు కుమారుడు ఇ వి జయ రామరాజు టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆయన తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన తండ్రి గోపాల రాజు పుత్తూరు, నగరి ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ప్రస్తుతం బెంగళూరులో అంటున్నారు.
కాగా ఎన్ బి సుధాకర్ రెడ్డి తన కుమారుడు ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించమని కోరారు. ఐఐఎం పూర్వ విద్యార్థి అయిన ఆయన ఐఐటిలో ఇంటర్ నేషనల్ ఆఫీసర్ గా పనిచేసి రాజీనామా చేశారు. వేలూరు విఐటి లో పి హెచ్ డి చేస్తున్నారు. ఐదు ఆటల్లో జాతీయ క్రీడాకారుడు అయిన ఆయన ప్రస్తుతం జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ జాతీయ డైరెక్టర్ గా ఉన్నారు.