వివో ఏలకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 వేలమంది వివోఏలకు హెచ్ఆర్ పాలసీ, కనీస వేతనాలు అమలు చేయాలని ఏపీ ఐకెపి వెలుగు యానిమేటర్ ఉద్యోగుల సంఘం(సిఐటియు) మూడు జిల్లాల సమావేశం కాణిపాకంలో జీను రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వివోఏలకు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణి తో వ్యవహరిస్తూ ఉన్న వాళ్ళని తొలగించడానికి సర్కిలర్ 64 ను తీసుకొచ్చి మూడు సంవత్సరాల కాలం పరిమితి పెట్టడం దారుణం అన్నారు.
రాష్ట్రంలో కోటి మంది మహిళలకు పొదుపు పై అవగాహన కల్పించి వారిని ఆర్థికంగా నిలదక్కుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి వివోఏలను రాష్ట్ర ప్రభుత్వం రకరకాల అడ్డదారుల్లో తొలగించే ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ చిత్తూరు జిల్లాలో వివోఏలపై రాజకీయ వేదింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘ సభ్యులు తీర్మానం లేకుండా ఇష్టారాజ్యంగా తొలగించే హక్కు ఎవరికీ లేదు అన్నారు. కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం ఇష్టారాజ్యంగా తొలగిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివోఏలపై 64 సర్కార్లో భాగంగా జెండర్ విధానాన్ని తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. సర్కులర్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో చేసిన పోరాటాల ఫలితంగా వేతనాలు కొద్దిగా పెరిగిన కనీస వేతనాలు అమలు కావడం లేదని వాటిని అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని, సంఘాల మెర్జింగ్ విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై మరో పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమవుతున్నామని తెలిపారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డిసెంబర్ 1 నుంచి కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ కార్యక్రమాల్లో వివోఏలందరు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
యూనియన్ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో సోమల, ఎస్ఆర్ పురం, ఇతర మండలాల్లో సంఘాల సభ్యులు తీర్మానం లేకుండా ఇష్టారాజ్యంగా తొలగిస్తున్న ఏపిఎంలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిఆర్డిఏ పిడి విఓఏల సమస్యలపై జిల్లా సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు రెడ్డప్ప, కృష్ణమ్మ ,పరంజ్యోతి చిత్తూరు జిల్లా కార్యదర్శి పి నాగరాజు, అన్నమయ్య జిల్లా అధ్యక్షురాలు రాణి, తిరుపతి జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు మరియు నాయకులు శ్రీధర్ సుబ్రమణ్యం లతోపాటు అధిక సంఖ్యలో వివోఏలు పాల్గొన్నారు.