పుంగనూరు టిడిపికి దిక్కెవరు ?
నియోజకవర్గంలో కనిపించని ఇంచార్జి
పరారవుతున్న పరిశీలకులు
ఆఫీసును తెరసే దిక్కెవరు?
జాడలేని ఇంటింటికి తెదేపా
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి దిక్కు ముక్కు లేకుండా పోయింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద పుంగునూరు సమీపంలో జరిగిన దాడి తర్వాత నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా పట్టుకునే నాయకుడు, కార్యకర్త కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగిన సంఘటనలో పోలీసులు తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీద కేసులు పెట్టారు. సుమారు వెయ్యి మంది మీద కేసులు పెట్టడంతో కార్యకర్తలు, నాయకులు చెట్టుకొకరు, పుట్టకొకరుగా చల్లాచదరయ్యారు. కేసుల్లో బెయిలు పొంది వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ జండా పట్టుకోవడానికి కార్యకర్తలు ఎవరు సాహసం చేయడం లేదు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పుంగనూరులో దౌర్జన్యం జరిగినా, ఖండించే నాయకుడు కనపడలేదు. జైలు నుంచి వచ్చిన తర్వాత అనారోగ్య కారణాలతో ప్రస్తుత ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఇంటికే పరిమితమయ్యారు. నియోజకవర్గంలో కార్యాలయం నామమాత్రంగా ఉన్నా, దానిని తెలిసే దిక్కు కూడా లేకుండా పోయింది. నియోజకవర్గానికి పరిశీలకులుగా నియమితులైన వాళ్ళు పట్టుమని మూడు నెలలు కూడా పనిచేయకుండానే పలాయనం చిత్తిగిస్తున్నారు. ఇతర నియోజక వర్గాలలో ఇంటింటికి తెలుగుదేశం పేరుతో ముమ్మరంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత వచ్చిన సానుభూతిని, తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడంతో పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని ఓట్ల రూపంలో మార్చుకునే పరిస్థితి నియోజకవర్గంలో కనిపించడం లేదు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు శూన్యం. ఒకరకంగా చెప్పాలంటే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉందా అన్న అనుమానం ప్రజలలో వ్యక్తం అవుతోంది.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం అంటే టిడిపి నాయకులు వణికిపోతున్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తన స్వంత జిల్లాలోని చిరకాల ప్రత్యర్థి మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఎదుర్కోవడంలో సఫలం కాలేక పోతున్నారు. పుంగనూరు నియోజక వర్గంలో హ్యాట్రిక్ విజయాలు స్వంతం చేసుకున్న పెద్దిరెడ్డిని సమర్థ్వంతంగా ఎదుర్కొనే దీటైన అభ్యర్థిని పోటీ పెట్టలేక పోతున్నారు.
నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ తరువాత 2009 నుంచి రామచంద్రా రెడ్డి వరుస విజయాలు సాధించారు. అంత క్రితం ఆయన పీలేరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వెంకట్రామ రాజు పెద్దిరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019లో ఎన్ అనీషా రెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసినా పెద్దిరెడ్డిని ఓడించలేక పోయారు. ఆమె మామ రామకృష్ణా రెడ్డి మూడు సార్లు పుంగనూరు నియోజక వర్గంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆయన ఒకసారి సమితి అధ్యక్షుడుగా, మూడు సార్లు చిత్తూరు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె భావ ఎన్ అమరనాధ రెడ్డి రెండు సార్లు పుంగనూరులో టిడిపి టిక్కెట్టుపై పోటీ చేసి గెలుపొందారు. 2014లో పలమనేరు వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. తరువాత టిడిపిలో చేరి మంత్రిగా పని చేశారు. అంత కుటుంబ చరిత్ర ఉన్న అనీషా రెడ్డి ఎన్నికల అనంతరం పుంగనూరు ఇంఛార్జి బాధ్యత నిర్వహిస్తున్నారు.
అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సలహాతో చంద్రబాబు ఆమెను తొలగించి రెండేళ్ల క్రితంచల్లా రామచంద్రా రెడ్డికి ఇంచార్జి బాధ్యత అప్పగించారు. అప్పటి నుంచి నియోజక వర్గంలో పార్టీ పడకేసిందని అంటున్నారు. ఆయన తీరు నచ్చక పార్టీ పరిశీలకులు కూడా పారి పోతున్నారు. శ్రీకాళహస్తికి చెందిన రాష్ట్ర కార్యదర్శి చలపతి నాయుడు కొన్నాళ్ళు పరిశీలకుడుగా పనిచేసి తప్పుకున్నారు. తరువాత ఫైర్ బ్రాండ్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డిని పరిశీలకునిగా పంపారు. ఆయన పెద్దిరెడ్డిని ఓడిస్తామని సవాళ్లు విసిరారు. మూడు నెలలకే అక్కడ పనిచేయలేనని బాధ్యత నుంచి వైతొలగారు. తరువాత తిరుపతికి చెందిన రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ పరిశీలకుడు బాధ్యత స్వీకరించి మూడు నెలలు కాక ముందే చేతులు ఎత్తేశారు.
ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి(చల్లా బాబు) పని తీరు అంతంత మాత్రంగా ఉంది. చంద్రబాబు పర్యటనలో తలెత్తిన గొడవల వల్ల చల్లా బాబుతో పాటు పలువురు పోలీసు కేసుల్లో ఇరుక్కున్నారు. కొన్నాళ్ళు జైలులో ఉండి బెయిలుపై విడుదల అయ్యారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు బయటికి రావడానికి భయపడుతున్నారు. పార్టీ వ్యవహారాలు చూసే పరిశీలకుడు లేదు. కొన్ని మండలాలకు కమిటీలు లేవు. పుంగనూరు కార్యాలయం తెరిచే దిక్కు లేదు. చల్లా బాబు నియోజక వర్గంలో తిరగడం లేదు. పార్టీ కార్యకర్తలకు దిక్కు లేదు. చల్లా రామచంద్రా రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి వర్గం కావడంతో అమరనాద రెడ్డి జోక్యం చేసుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో నియోజక వర్గంలో టీడీపీ పరిస్తితి తాడు లేని బొంగరంలా తయారయ్యింది. ఈ నేపథ్యంలో పార్టీకి పునర్ వైభవం రావాలంటే, తిరిగి అనీషా రెడ్డికి ఇంచార్జి బాధ్యత అప్పగించాలని పలువురు కార్యకర్తలు కోరుతున్నారు. అధిష్టానం ఎంత తొందరగా ఒక నిర్ణయం తీసుకుంటే, పార్టీ పరిస్థితి అంత తొందరగా మెరుగుపడుతుందని అంటున్నారు. లేకుంటే, పార్టీ ఇలాగే చతికిలపడి, మంత్రి రామచంద్రా రెడ్డికి నామమాత్రం పోటి కూడా ఇవ్వలేని పరిస్థితికి దిగజారుతుందని ఆవేదన చెందుతున్నారు.