ఒంటరి పోరాటం చేస్తున్న డాక్టర్ థామస్
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రాజకీయ చతురుడు నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతోంది. నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన డాక్టర్ వెయ్యం థామస్ నియోజకవర్గంలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆయనకు మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జిలు సహకరించడం లేదు. నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు పట్టించుకోవడం లేదు. థామస్ ను పూర్తిగా వదిలేశారు. దీంతో చేసేది లేక పార్టీలో ఏటికి ఎదురీదునట్లు ప్రచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో తనకు ఎవరు సహకరించకపోవడంతో తన సోదరుడు, భార్యతో కలిసి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి ఓటు వేసి, తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తదుపరి అధిష్టానం ఆదేశించేవరకు చిట్టిబాబును పార్టీ కార్యక్రమాలలో పాల్గొనవద్దని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో నియిజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ థామస్ ఒంటరిగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయనకు తోడుగా తమ్ముడు, సతీమణి ప్రచారం చేస్తున్నారు. అన్ని మండలాల్లో తిరిగి రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా దళితవాడలు, చర్చలపైన దృష్టిని సాధించారు. ప్రతి చోట ఆర్థిక సహాయం చేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు. డాక్టర్ VM థామస్ ఇలా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆయనకు నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు నాయకులు పూర్తిగా సహకరించడం లేదు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పార్టీ పనితీరును పరిశీలించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులలో సమన్వయం లేకపోవడంతో పార్టీ చతికిలబడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం చొరవ తీసుకొని నియోజకవర్గంలో నాయకుల, కార్యకర్తల సమన్వయానికి కృషి చేయాలని కోరుతున్నారు. మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జిల్లా సలహాలు, సూచనలు తీసుకుని నియోజకవర్గ ఇన్చార్జి విషయంలో కూడా పునః పరిశీలన చేయాల్సి ఉందని అంటున్నారు. అందరికి ఆమోదయోగ్యమైన, పార్టీలో అనుభవం ఉన్న, స్థానిక అభ్యర్థిని ఇన్చార్జిగా నియమిస్తే తప్ప పార్టీ పరిస్థితి మెరుగుపడదని భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గంగాధర నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.