ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ ఇకలేరు
ఒకప్పటి హీరో.. తర్వాత కామెడీ హీరో.. ఆ తర్వాత టాలీవుడ్ ఫాదర్, బ్రదర్, అంకుల్.. ఈ కేరెక్టర్లలో ఒదిగిపోయిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఉదయం 9:45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో జరుగుతాయి. చంద్ర మోహన్ సినీ జీవితంలో చేయని పాత్ర లేదు.. ఒకప్పటి హీరో.. తర్వాత కామెడీ హీరో.. ఆ తర్వాత టాలీవుడ్ ఫాదర్, బ్రదర్, అంకుల్.. కేరెక్టర్లన్నీ ఆయనవే. ‘రంగుల రాట్నం’తో కెరీర్ స్టార్ట్ చేసిన చంద్రమోహన్.. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నటుడిగా చంద్రమోహన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. చంద్ర మోహన్ సరసన హీరోయిన్ గా చేసిన వారి లక్కు తిరిగినట్టే. కట్ చేస్తే ఎక్కడికో వెళ్లేది వారి కెరీర్. అంతటి లక్కీ హ్యాండ్ చంద్రమోహన్ ది.
చంద్ర మోహన్‌తో నటించిన తర్వాతే శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, రాధ, విజయశాంతి వంటి ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా రాణించారు. తెలుగు సినిమాల్లో తనదైన విలక్షణ నటనతో ఆకట్టుకున్న చంద్ర మోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. చంద్రమోహన్ నటుడిగా ఒక మూసకే పరిమితం కాలేదు. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో రాణించారు.
అతనొక్కడే చిత్రానికిగానూ చంద్రమోహన్ బెస్ట్ కేరెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డునందుకున్నారు. అంతేకాదు చిరంజీవి హీరోగా నటించిన ‘ఇద్దరు మిత్రులు’, బాలకృష్ణ హీరోగా నటించిన ‘యువరత్న రాణా’, నాగార్జున హీరోగా నటించిన ‘సీతారామరాజు’, వెంకటేష్ హీరోగా నటించిన ‘గణేష్’ సినిమాల్లో టాలీవుడ్ సీనియర్ హీరోలకు తండ్రిగా నటించి మెప్పించారు. ’రాఖీ’ లో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు.
దూకుడు, యముడికి మొగుడు,చివరగా అల్లు అర్జున్ హీరోగా నటించి ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆరోగ్యం బాగా లేకపోవడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇన్నేళ్ల కెరీర్‌లో తమిళంలో ఐదు, కన్నడ, మలయాళ భాషల్లో ఒక్కో చిత్రంలో నటించారు. ఇక ఈయన సరసన ఎక్కువ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఘనత జయసుధ. అటు రాధిక, విజయశాంతి వంటి హీరోయిన్స్‌తో 15 పైగా చిత్రాల్లో హీరోగా నటించడం విశేషం. మొత్తంగా 55 ఏళ్లకు పైగా కెరీర్‌లో 930 చిత్రాల్లో నటించారు. అందులో 175 చిత్రాల్లో హీరోగా నటించారు.