కమ్మలకు కలిసిరాని చిత్తూరు
చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిని కూడా నియమించలేదు. దీంతో తెలుగుదేశం పార్టీలోని నాయకులు వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి పోటీ పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వంపైన వ్యతిరేకత ఉండడం, చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం, జనసేన తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడంతో ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి పలువురు ఉత్సాహం చూపుతున్నారు.అయితే, ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా, వేరే కులం వారు పనిచేసే పరిస్థితి లేదు. పార్టీ ఓడినా ఫర్యలేదు, ఎదుటి వాళ్ళు గెలువకూడదు అన్న భావనలో ఉన్నారు. అందరినీ సమన్వయం చేసి ఏక తాటి మీద నడిపించడం అంత సులభం కాదు.
తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత చిత్తూరు నియోజకవర్గానికి తొమ్మిది పర్యాయాలు ఎన్నికల జరిగాయి. ఈ తొమ్మిది పర్యాయాలలో మూడుసార్లు 1983, 2004, 2014 మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. సీకే బాబు నాలుగు సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఆయన 1989, 1994, 1999, 2009 సంవత్సరాలలో చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కమ్మ సామాజిక వర్గం నుంచి ఝాన్సీ లక్ష్మీ మాత్రం 1983 లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత రెండు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ దొరబాబు, బాలాజీ నాయుడు కమ్మ అభ్యర్థులను బరిలోకి దించినా ఓటమిపాలయ్యారు. ఒకసారి 1985లో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆర్ గోపీనాథన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడు పర్యాయాలు బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఏఎస్ మనోహర్, 2014లో డీకే సత్యప్రభ, 2019లో జంగాలపల్లి శ్రీనివాసులు బలిజ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గత 30 సంవత్సరాల ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే చిత్తూరు నియోజకవర్గం కమ్మ సామాజిక వర్గానికి అచ్చి రాలేదు. చిత్తూరు నియోజకవర్గంలో నాలుగు సార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీకే బాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు బలిజ సామాజిక వర్గం తమ విజయకేతనాన్ని ఎగురవేసింది.
చిత్తూరు శాసనసభ్యుడుగా నాలుగు సార్లు గెలుపొందిన CK బాబు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన రానున్న ఎన్నికలలో టికెట్లను ఆశిస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. ప్రస్తుతం ఆయన అనుచరులు వివిధ పార్టీలలో ఉన్న ఎన్నికల సమయం నాటికి ఏకమయ్యే పరిస్థితులు రావచ్చు. సీకే బాబు నియోజకవర్గ ఇన్చార్జిగా తనను నియమించి, ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్టాన్ని కోరిన అధిష్టాన వర్గాన్ని కోరినట్లు తెలుస్తోంది. అయితే సీకే బాబుకు టికెట్ రాకుండా చిత్తూరు పట్టణంలోని ఒక సామాజిక వర్గం అడ్డుపడుతుందని తెలుస్తోంది. దీంతో సీకే బాబా అభ్యర్థిత్వాన్ని ఎటుటు తేల్చకుండా తెలుగుదేశం పార్టీ పెండింగ్ లో పెట్టింది.
చిత్తూరు నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం మూడు సార్లు విజయం సాధించడంతో బలిజ సామాజిక వర్గం నుంచి పార్టీ ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ, మేయర్ గా పనిచేసిన కటారి హేమలతలు పోటీ పడుతున్నారు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలందరికీ ఆనందయ్య కరోనా మందును సరఫరా చేశారు. ముఖ్యమైన కూడళ్ళలో అన్నదానం చేశారు. చిత్తూరు పట్టణంలో వరదల సంభవించినప్పుడు వారిని ఆదుకున్నారు. వ్యాపారవేత్తగా రాణిస్తున్న కాజూరు బాలాజీ బాలాజీకి బలమైన వర్గం ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు. పార్టీ కోసం వ్యయం చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలలో పాలుపంచుకొని, పార్టీ జెండాను మోస్తున్నారు. కటారి హేమలత ప్రస్తుతం నగర పార్టీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త దివంగత ప్రవీణ్ నగర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆమె అత్త అనురాధ మున్సిపల్ మేయర్ గా, మామ కటారి మోహన్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. హేమలత పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు.
రానున్న ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం కూడా టికెట్టును ఆశిస్తోంది. చిత్తూరుమండల పరిషత్ అధ్యక్షుడిగా, మార్కెట్ కమిటే చైర్మన్ గా పనిచేసిన చంద్ర ప్రకాష్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన భార్య గీర్వాణి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. భాస్కర హోటల్ అధినేత జయ ప్రకాష్ కూడా టికెట్ ని ఆశిస్తున్నారు. ఆయన బంగారుపాలెం మండలానికి చెందిన రాజకీయ నేపద్యం ఉన్న నాయకుడు. అలాగే యాదమరి మండలానికి చెందిన వ్యాపారి గురజాల ధనంజయ నాయుడు కూడా ఇటీవల పార్టీలో క్రియాశీలకమయ్యారు. తాను కూడా టికెట్ రేసులో ఉన్నారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన తిరుచానూరు మాజీ సర్పంచ్ CR రాజన్ పేరు కూడా చిత్తూరు నియోజక వర్గానికి వినిపిస్తోంది. వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఈయన తన అనుచరులతో ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. జిల్లాలో గణనయంగా వన్నెకుల క్షత్రియ ఓట్లు ఉన్నాయి. కావున జిల్లాలో ఆ కులానికి ఒక సీటును కేటాయించాల్సిందిగా కోరారు. చిత్తూరు స్థానాన్ని కేటాయించవచ్చని భావిస్తున్నారు. చిత్తూరులో ఇటీవల జరిగిన బీసీ సదస్సుకు ఆయనే ఖర్చు పెట్టుకున్నారు. చిత్తూరు నియోజకవర్గం నుండి 1985లొ గాండ్ల సామాజిక వర్గానికి చెందిన గోపీనాథ్ ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కావున బీసీల ప్రతినిధిగా ఉత్తర అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సి ఆర్ రాజన్ సిద్ధమవుతున్నారు.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న తవణంపల్లిని కొత్తగా ఏర్పాటు చేసిన పూతలపట్టు నియోజకవర్గంలో కలిపారు. ప్రస్తుతం చిత్తూరు మున్సిపాలిటీ, రూరల్ మండలం, గుడిపాల మండలాలు మాత్రం చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నాయి. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఒకసారి CK బాబు చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఆయనకు రాలేదు. రెండు పర్యాయాలు బలిజ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఈ చరిత్రను పరిశీలిస్తే చిత్తూరు నియోజకవర్గంలో రెడ్డి లేక బలిజ సామాజిక వర్గం మాత్రం ఎన్నికలలో విజయం సాధించగలరని అర్థమవుతోంది.

