16, నవంబర్ 2023, గురువారం

సర్వేల మాయలో చంద్రబాబు !



టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అపర చాణక్యుడు అన్న పేరు ఉంది. ఆయన  సమాచారం సేకరణ, ప్రచారం  వ్యాప్తిని ఆయుధాలుగా మార్చుకున్నారు. పటిష్టమైన సమాచార సేకరణ కోసం సర్వేలు చేయించడం ఆయనకు తొలి నుంచి అలవాటు. అలాగే కులాల లెక్కలు, వర్గ సమీకరణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వ్యూహా  రచన కార్యకర్తల నిర్మాణం పట్ల శ్రద్ధ వహిస్తారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన తెలుగు రాజకీయాలలో తిరుగులేని నాయకుడుగా ఎదగడానికి ఈ అంశాలు ఉపయోగ పడ్డాయి. అయితే 2019 ఎన్నికల్లో తప్పుడు సర్వేలు, ప్రచార ఆర్భాటం, స్వంత కుల పెత్తనం ఆయన కొంప ముంచాయి. రాజకీయాలలో  ఓటమి సహజమే అయినప్పటికీ ఆయన సారథ్యంలోని టిడిపి ఘోర పరాభవం మూట కట్టుకున్నది. రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలలో కేవలం 23 స్థానాలకు పరిమిత మయ్యింది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపికి 50 శాతం ఓట్లు, 151 ఒక్క సీట్లు వచ్చాయి.


అమ్ముడు పోయిన సర్వేలు 

గత ఎన్నికల్లో ఆయన తన స్వంత మనుషులతో సర్వేలు చేయించుకున్నారు. అలాగే లగడపాటి రాజగోపాల్ టిడిపి కోసం ప్రత్యేకంగా సర్వేలు చేశారు. వీరితో పాటు కొన్ని సర్వే సంస్థలు, రెండు ప్రముఖ పత్రికల ద్వారా సర్వేలు చేయించు కన్నారు. పార్టీ పరిస్తితి, మంచి గెలిచే అభ్యర్థులను గూర్చి ఈ సర్వేలు నిర్వహించారు. దీనికోసం కోట్లు ఖర్చు చేశారు. అయితే అన్ని సంస్థల్లో తమ సామాజిక వర్గీయులు ప్రధాన పాత్ర పోషించారు. పార్టీలో తమకు అనుకూలమైన వారి వద్ద భారీ మొత్తంలో డబ్బు తీసుకుని తప్పుడు నివేదికలు ఇచ్చారు. చంద్రబాబుకు తిరుగులేని ప్రజాదరణ ఉందంటూ బాకాలు ఊదారు. చంద్రబాబు గుడ్డిగా వారి మాయలో పడి ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు తన స్వంత జిల్లాలో కూడా  సర్వేల మాయను పసికట్టలేక పోయారు. దీనితో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 స్థానాలలో 13 చోట్ల ఓడి పోయారు. తాను ఒక్కరూ కుప్పంలో  30,722 మెజారిటీతో గెలిచారు. గతంతో పోలిస్తే ఈ మెజారిటీ సగానికి పడిపోయింది. తాను పుట్టి పెరిగిన, తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన చంద్రగిరిలో టిడిపి అభ్యర్ధి పులివర్తి నాని 41,755 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తిరుగులేని ఓటు బ్యాంకు ఉన్న తిరుపతిలో 708 ఓట్ల తేడాతో ఓడి పోవలసి వచ్చింది.


తీరుమారని సర్వేలు 

చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల నుంచి గుణపాఠం నేర్చుకో లేదు అనిపిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా రాబిన్ శర్మ బృందం మీద ఆధార పడుతున్నారు. చాలా నియోజక వర్గాలలో వారు ఇంచార్జి వద్ద డబ్బు తీసుకుని నివేదికలు ఇస్తున్నారని తెలిసింది. అలాగే జిల్లాకు చెందిన  ఒక టివి ఛానల్ అధిపతిని కూడా విశ్వాసంలోకి తీసుకుని ఆయన మాట వింటున్నారు. ఆయన తన సామాజిక వర్గం వారి మాట నమ్మి చంద్రబాబుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని పలువురు అంటున్నారు. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, జి డి నెల్లూరు, పూతలపట్టు నియోజక వర్గాల ఇంచార్జుల నియామకంలో స్వంత సామాజిక వర్గం నేతల,  ఛానల్ అధిపతి మాటలు విని  తప్పులు చేశారని సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయానికి చంద్రబాబు ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని అంటున్నారు. రాష్ట్రంలో సగం మంది ఇంచార్జులను మార్చకపోతే దెబ్బ తినక తప్పదు అంటున్నారు.


సర్వేల పట్ల జాగ్రత్త అవసరం

ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు సర్వేలు, వ్యూహ కర్తల మీద ఆధార పడుతున్నది. పార్టీ పర్టిస్తితులు, ఆశావహుల గుణగణాలు, ప్రత్యర్థి పార్టీలు, సామాజిక వర్గాల బలాబలాల మీద దృష్టి సారించాయి. కొన్ని  పార్టీలు ప్రతి నియోజకవర్గంలో రెండు, మూడు సార్లు సర్వేలు చేశాకే అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నాయి. అలాగే చంద్రబాబు కూడా వివిధ రకాల సర్వేలు చేయిస్తున్నారు.  కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే విధంగా సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో పార్టీ బలమెంత, ఇంచార్జి పనితీరు ఎలా ఉంది , అతనికి ప్రజల మద్దతు ఉంటుందా , మిగిలిన పార్టీల బలాబలాలెలా ఉన్నాయి? ఆశావహుల పరిస్తితి ఎలా ఉంది, సామాజిక వర్గ సమీకరణాలు ఎలా ఉన్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. అలాగే కార్యకర్తల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. అయితే సర్వే చేస్తున్న వారిని క్రాస్ చెక్ చేయడంలో పార్టీ విఫలం అవుతున్నదని అంటున్నారు. సర్వేలను పార్టీ కార్యాలయంలో  విశ్లేషించే వారిలో కొందరు అమ్ముడు పోతున్నారని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. గతంలో సర్వేలు చేసి తప్పుడు నివేదికలు ఇచ్చిన వారిని పక్కన పెట్టారు. అయినప్పటికీ పార్టీ కార్యాలయంలో ఉన్న అనుకూల శత్రువులను నెత్తిన పెట్టుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వరుసగా మూడు సార్లు ఓడిపోయిన నియోజక వర్గాలు 50 ఉన్నాయి. చంద్రబాబు స్వంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆరు ఉన్నాయి. ఇప్పటి వరకు  అక్కడ పార్టీ పటిష్టతకు తగిన ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలని సీనియర్లు కోరుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *