చంద్రబాబుకు తిరుపతిలో అపూర్వ స్వాగతం
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురువారం రేణిగుంట విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీగా విమానాశ్రయానికి తరలివచ్చారు. అడుగడుగునా స్వాగత తోరణాలు, బ్యానర్లు, కటవుట్లు కట్టారు. చంద్రబాబు నేరుగా తిరుమలకు బయల్దేరారు. ఈ రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. తరువాత అమరావతి చేరుకుంటారు. డిసెంబర్ 2న విజయవాడ కనకదుర్గ అమ్మవారిని, డిసెంబర్ 3న సింహాచలం వెళ్లి అప్పన్న స్వామిని దర్శనం చేసుకుంటారు. డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్నను చంద్రబాబు దర్శించుకోనున్నారు. ఆ తరువాత వరుసగా రాజకీయ సభలకు ప్లాన్ చేస్తున్నారు.
12 వరకు చంద్రబాబుపై చర్యలు వద్దు
ఫైబర్ నెట్ కేసులో డిసెంబర్ 12 వరకూ చంద్రబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం గురువారం AP CIDని ఆదేశించింది. గతంలో జారీచేసిన ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీం స్పష్టం చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై తీర్పు రాస్తున్నామని న్యాయమూర్తి అనిరుద్ద బోస్ వెల్లడించారు. సుప్రీంలో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పైన గురువారం విచారణ జరిగింది. డిసెంబర్ 12కు ఈ కేసుపై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఇదే సమయంలో సీఐడీకి కీలక ఆదేశాలు ఇచ్చింది.
చంద్రబాబు తన పైన నమోదైన ఫైబర్ నెట్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణకు వచ్చింది. ఈ కేసలన్నింటికీ క్వాష్ పిటీషన్ తీర్పు కీలకంగా మారుతోంది. దీనికి సంబంధించి కోర్టు స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12లోపు స్కిల్ కేసులో తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్వాష్ పిటీషన్ లో 17ఏ కేంద్రంగా సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇప్పుడు ఈ తీర్పు మిగిలిన కేసులకు కీలకంగా మారనుంది.
స్కిల్ డెవల్‌పమెంట్ కేసును సీబీఐకి అప్పగించాలి
స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో దర్యాప్తును సీఐడీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన పిల్‌పై విచారణను హైకోర్టు డిసెంబరు 13కు వాయిదా వేసింది. సరైన చిరునామాలు లేకపోవడంతో కోర్టు జారీచేసిన నోటీసులు ప్రతివాదుల్లో కొందరికి అందలేదని గుర్తుచేసింది. వ్యక్తిగతంగా నోటీసులు అందజేసేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛనిచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఉండవల్లి అరుణ్‌కుమార్ వేసిన పిల్‌ను విచారించిన కోర్టు, ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.
కొందరికి నోటిసులు చేరకపోవడంతో పిటిషనరే వ్యక్తిగతంగా నోటీసులు అందజేసేందుకు అనుమతివ్వాలని ఉండవల్లి తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ, నోటీసులు అందని ప్రతివాదులకు నోటీసులు అందజేసే బాధ్యతను పిటిషనర్‌కు అప్పజెప్పింది. ప్రభుత్వం నోటీసులు తీసుకున్న నేపథ్యంలో ఈలోపు కౌంటర్ దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చునని ధర్మాసనం తెలిపింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందించారు. స్కిల్ కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలియజేస్తూ అఫిడవిట్ వేస్తున్నామన్నారు. సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ..తాము ఎలాంటి కౌంటర్ దాఖలు చేయడంలేదని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున వకాల్తా దాఖలు చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.