3, నవంబర్ 2023, శుక్రవారం

ఏ సామాజిక వర్గానికి సాధికారిత లభించింది?

బిజెపి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు


ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేకంగా చేసిందేమి లేదని, బిజెపి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లా చిట్టిబాబు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎస్సీలకు 26 సంక్షేమ పథకాలు ఉండేవి, వాటన్నిటిని అమలు చేయనటువంటి పరిస్థితి నేడు నెలకొన్నదన్నారు. విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఉండగా వాటిని కూడా తొలగించారు. గిరిజన తండాలకు ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. కొన్ని గిరిజన ఆవాస ప్రాంతాలకు సరైన రోడ్లు లేవు. అలాగే వెనుకబడిన తరగతులకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి నిధులు ఇవ్వకపోవడం కూడా బిసి కార్పొరేషన్లు నిర్వీర్యం కావడానికి ప్రధాన కారణం. ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనారిటీ హాస్టల్లో విద్యార్థులకు తగిన వసతులు లేకపోవడం, నేటి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు ఇవ్వకపోవడం కడు శోచనీయం. కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే పార్ట్ టైం ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఇందులో పని చేసేవారు అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీలే.


రాష్ట్రంలో అత్యధిక శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు అల్ప ఆదాయ వర్గాలు. నవరత్నాల పేరిట డబ్బులు పంచే కార్యక్రమానికి తెరలేపి, ప్రతిఫలంగా ఆర్టీసీ బస్సు రేట్లు పెంచడం, విద్యుత్ చార్జీలు పెంచడం, చౌకబారు మద్యాన్ని అధిక రేట్లకు అమ్మడం, ఇంటి పన్ను, ఆస్తి పన్ను అనూహ్యంగా పెంచి  వేయడం, నిత్యవసర సరుకుల ధరలు పెంచడం లాంటి పనులు చేస్తూ రాష్ట్ర ఖజానాను నింపుకోవడం ద్వారా అట్టడుగు వర్గాల నడ్డి విరిచేశారు. యువతకు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలయింది. 25000 మంది ఉపాధ్యాయుల నియామకానికి మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పిన, ఈ ప్రభుత్వం డీఎస్సీ అవసరం లేకుండానే పాఠశాలలను విలీనం చేయడం, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని కొన్ని పాఠశాలలో మూతపడడానికి దోహదం చేయడం ద్వారా సుమారు 15 వేల ఎస్సీ, ఎస్టీ బీసీ నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు. ఈరోజు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ భూ సమస్యల పరిష్కారానికి తిరుగుతున్న వారు ఎస్సీ ఎస్టీ బీసీలే.


జిల్లా విభజన తర్వాత ఒక పరిశ్రమ కానీ, నవోదయ లాంటి పాఠశాలలు కానీ, చిత్తూరులో యూనివర్సిటీ గాని, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ స్థాపించకపోవడం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాలు, మూడు అత్యధిక బీసీ జనాభా కలిగిన నియోజకవర్గాలు ఉండగా, ఏమి అభివృద్ధి జరిగిందని సామాజిక సాధికారత పేరుతో ఉత్సవాలు చేసుకుంటున్నారని ప్రభుత్వాన్ని చిట్టిబాబు నిలతీశారు. ప్రజలు ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధికి పాటుపడే ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని కోరారు.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *