అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
ఎఫ్ ఆర్ ఎస్ యాప్ ను రద్దు చేయాలి. .
.
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లబ్ధిదారులకు ఇబ్బంది కలిగించే ఎఫ్ ఆర్ ఎస్ యాపను రద్దు చేయాలని సోమవారం చిత్తూరు కొంగారెడ్డిపల్లి లో ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సిఐటియు -ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు,ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ) జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్.నాగరాజు, అంగన్వాడి యూనియన్ల జిల్లా కార్యదర్శులు షకీలా, ప్రేమలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడంలేదని ద్వజమెత్తారు.
అదేవిధంగా లక్షలాదిమంది లబ్ధిదారులకు బాలింతలకు నష్టం చేకూర్చే ఎఫ్ ఆర్ ఎస్ యాప్ ను తీసుకురావడం దుర్మార్గమన్నారు. దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యిటి అమలు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ఈఎస్ఐ,పిఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు- ఏఐటీయూసీ -ఐఎఫ్టియు ల ఆధ్వర్యంలో అంగన్వాడీలు మరో పోరాటానికి సిద్ధమయ్యారని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 23న జిల్లా కేంద్రాలు, రెవిన్యూ డివిజన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, 25 నుంచి 28 వరకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు, డిసెంబర్ ఒకటి నుంచి లబ్ధిదారులలో విస్తృతమైన ప్రచారం అనంతరం డిసెంబర్ 8 నుంచి నిరవధిక సమ్మెకు వెళుతున్నామని ఈ కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేసి అంగన్వాడీల సత్తా ఏంటో చూపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు సుజని, కార్మిక నాయకులు రమాదేవి మనీ లతోపాటు అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.