చంద్రగిరిలో పట్టుకోసం ఆరాటం !
తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన చంద్రగిరి నియోజక వర్గంలో ఈ సారి ఎలాగైనా గెలవాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు. తన స్వంత నియోజక వర్గంలో పట్టు కోల్పోవడం చిన్నతనంగా భావిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో చంద్రబాబుకు పట్టులేదు. ఇక్కడ గెలువలేక కుప్పం పోయాడు అని ప్రతిపక్ష పార్టీలు చంద్రబాబు మీద విమర్శలు ఎక్కుపెడుతుంటారు. ఈ విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. తను పుట్టి, పెరిగిన నియోజకవర్గం మీద పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నారు.
1978లో చంద్రబాబు ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. రెండేళ్లు తిరక్కుండానే మంత్రి అయ్యారు. తరువాత ఎన్టీఆర్ అల్లుడు అయ్యారు. అయితే 1983 లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి మేడసాని వెంకటరామ నాయుడు చేతిలో ఓటమి చవిచూశారు. తరువాత టిడిపిలో చేరినా 1985 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో ఎన్ ఆర్ జయదేవ నాయుడు టిడిపి అభ్యర్థిగా పోటీచేసి చంద్రగిరి ఎమ్మెల్యే అయ్యారు. చంద్రబాబు 1989 నుంచి కుప్పంలో వరుసగా విజయం సాధిస్తున్నారు. అయితే చంద్రగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణ కుమారి విజయం సాధించారు. 1994లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన నారా రామమూర్తి నాయుడు గల్లా అరుణ కుమారిహ్ విజయం సాధించారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు.
2009కి ముందు నియోజక వర్గంలో చంద్రగిరి, పాకాల, ఐరాల, పులిచెర్ల ఉండేవి. దీనితో ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండేవి. అయితే పునర్ నిర్మాణం సమయంలో ఐరాల, పులిచెర్ల మండలాలను తొలగించి తిరుపతి రూరల్, చిన్న గొట్టిగల్లు, ఏర్రావారి పాల్యం, రామచంద్రా పురం మండలాలను కలిపారు. దీనితో కమ్మ సామాజిక వర్గం ఓట్ల కంటే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు రెట్టింపు అయ్యాయి. ఇది గమనించిన చంద్రబాబు 2009లో ఆర్ కె రోజా రెడ్డిని టిడిపి అభ్యర్థిగా బరిలో దింపారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సైకం సాయిరమణిని పోటీలోకి దింపింది. దీనితో రెడ్ల ఓట్లు చీలి పోయి కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమారి 10,980 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆ ఎన్నికల్లో గల్లా అరుణ కుమారికి 71,942 ఓట్లు, రోజాకు 60,972 ఓట్లు, సాయిరమణికి 29,833 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టిడిపి అభ్యర్థి గల్లా అరుణ కుమారి మీద 4518 ఓట్ల ఆధిక్యత సాధించారు. గతంలో నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా అరుణ కుమారి టిడిపి అభ్యర్థిగా ఓడి పోవడానికి కులం ఓట్లే కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే 2019లో ఆమెను కాదని పులివర్తి నానీని టిడిపి అభ్యర్థిగా పోటీ పెట్టారు. ఆయన వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో 41,755 ఓట్ల భారీ తేడాతో ఓడి పోయారు. అయినా ఆయనకే నియోజక వర్గ ఇంచార్జి బాధ్యతలు ఇచ్చారు. ఆయన తిరిగి పోటీ చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. అయితే అక్కడ రెడ్డి అభ్యర్థి అయితేనే గెలుపు సాధించడం వీలు అవుతుందని సర్వే నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి పేరు తెర పైకి వచ్చింది. ఆయన తండ్రి మబ్బు రామిరెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా రెండు సార్లు, మునిసిపల్ చైర్మన్ గా ఒక సారి పనిచేశారు. అత్యధకంగా ఓట్లు ఉన్న తిరుపతి రూరల్ మండలంలో ఆయనకు బంధువర్గం, మంచి పట్టు ఉంది.
కాగా గతంలో పోటీ ఇక్కడ పోటీ చేయాలని భావించిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి నగరిలో రోజాపై పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ టిడిపి టిక్కెట్ ఆశిస్తున్న పారిశ్రామిక వేత్త డాలర్ దివాకర్ రెడ్డి ఇప్పటి వరకు పార్టీలో చేరలేదు. దీంతో ప్రస్తుతం పులివర్తి నాని, మబ్బు దేవ నారాయణ రెడ్డి మధ్య టిక్కెట్టు కోసం పోటీ నెలకొన్నట్లు తెలుస్తుంది. అయితే చంద్రగిరి నుండి చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరైనా పోటి చేయాలని సన్నిహితులు ఆయనకు సూచించినట్లు సమాచారం.