చిత్తూరు టిక్కెట్టు మళ్ళి JMCకే ?
రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున చిత్తూరు ఎమ్మెల్యే టికెట్టును తిరిగి జంగాలపల్లి శ్రీనివాసులకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల జరిగిన బస్సు యాత్రలో మంత్రులు ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా జంగాలపల్లి శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థిగా రెడ్దేప్పను గెలిపించాల్సిందిగా సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉండడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో ఏ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థుని ప్రకటించాలన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆమోదం తప్పనిసరని తెలుస్తోంది. ఈ సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నా, ఈ విషయమై మాట్లాడకపోవడంతో జంగాలపల్లి శ్రీనివాసులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని తెలుస్తోంది. దీంతో జంగాలపల్లి శ్రీనివాసులు అనుచరులు పండగ చేసుకుంటున్నారు. రానున్న ఎన్నికలలో పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నారు.
చిత్తూరు అసెంబ్లీ స్థానాన్ని ఆర్టీసీ ఉపాధ్యక్షులుగానున్న విజయానంద రెడ్డి కూడా ఆశించారు. ఆయన చాలా నిధులు కూడా వ్యయం చేశారు. జిల్లా, రాష్ట్రస్థాయి నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆయనకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి రామచంద్రా రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అయితే జంగాలపల్లి శ్రీనివాసులకు రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మరి కొంతమంది బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు జంగాలపల్లి అభ్యర్థత్వాన్ని బలపరుస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఇటీవల తనను కలిసిన చిత్తూరు నాయకులతో ముఖ్యమంత్రి జగన్ వెల్లడించినట్లు తెలిసింది. జిల్లాలో ఎక్కడో ఒకచోట బలిజ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాల్సి ఉందని, ఈసారి చిత్తూరును ఇస్తున్నామని అన్నట్లు సమాచారం. అయితే చివరివరకు ఎన్నికల బరిలో నిలబడి టికెట్టు కోసం పోరాడాలని ఆర్టీసీ ఉపాధ్యక్షుడు విజయానంద రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలతో కూడా ముందుకు పోతున్నారు.
ఆరణి శ్రీనివాసులు 15 మే 1952లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, యాదమరి మండలం జంగాలపల్లిలో జన్మించారు. ఆయన బీఏ వరకు చదువుకున్నారు. ఆరణి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి సుదీర్ఘకాలం పార్టీలో పని చేశారు. యాదమరి నుండి ZPTC సభ్యుడిగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ విప్ గా పనిచేశారు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి చిత్తూరు నియోజకవర్గం నుండి పి.ఆర్.పి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీకే బాబు చేతిలో 1500 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వడంతో ఆయన తిరిగి టీడీపీలో చేరి తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు.
ఆరణి శ్రీనివాసులు 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించినా దక్కలేదు. దీనితో ఆయన పార్టీకి రాజీనామా చేసి, 8 ఏప్రిల్ 2014న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయన 2014లో జరిగిన ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి డిఏ సత్యప్రభ చేతిలో 6799 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయన తిరిగి 2019లో జరిగిన ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఏఎస్ మనోహర్ పై 39968 ఓట్ల మెజారిటీతో గెలిచి, తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. YCP నుండి రెండవ సారి కూడా విజయం సాధించాలని జంగాలపల్లి శ్రీనివాసులు గట్టి పట్టుదలతో ఉన్నారు.