'గాలి'కి ఎదురు గాలి
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున గాలి భాను ప్రకాష్ తో పాటు కొత్త అభ్యర్థులు తెర మీదకి వస్తున్నారు. నగిరి నియోజకవర్గంలో ఫైర్ బ్రాండ్ రోజాను ఎదుర్కొనే దీటైన అభ్యర్థి కోసం అన్వేషణ కొనసాగుతోంది. రోజాను కట్టడి చేయడంలో ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న గాలి భాను ప్రకాష్ చేస్తున్న ప్రయత్నాల విషయంలో అధిష్టానం సంతృప్తిగా లేదని తెలుస్తోంది. పాత కాపులను కలుపుకొని పోవడం లేదని కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళింది. పైగా రోజా గుప్పిస్తున్న విమర్శలకు ధీటుగా స్పందించడం లేదు. రోజా నిత్యం చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణిల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలో నుంచి అందుకు దీటుగా సమాధానం రావడం లేదు. రోజాను పన్నెత్తు మాట అనే నాయకుడు నియోజకవర్గంలో కనిపించడం లేదు. జగన్ మీదున్న వ్యతిరేకత నియోజకవర్గంలో కూడా తమను గెలిపిస్తుందని తెలుగుదేశం నాయకులు నమ్ముకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా కార్యక్రమాలు కూడా జరగడంలేదని అధిష్టానం భావిస్తోంది. రోజా వ్యతిరేక వర్గమే తమను గెలిపిస్తుందన్న ధీమాతో ప్రస్తుతం ఉన్న నాయకత్వం పనిచేస్తున్నట్లు, నియోజకవర్గంలో స్వతహాగా బలం పెంచుకోవడానికి తగిన చర్యలు చేపట్టలేదని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో నియోజకవర్గంలో ఉంటూ, అందర్నీ కలుపుకొని, రానున్న ఎన్నికల్లో రోజాపై విజయం సాధించే దీటైన అభ్యర్థి కోసం అన్వేషణ కొనసాగుతున్నట్లు సమాచారం.
చిత్తూరు జిల్లాలో దివంగత గాలి ముద్దు కృష్ణమ నాయుడుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ప్రత్యర్థులపై సవ్యసాచిలా విమర్శనాస్త్రాలు సంధించే వారు. అయన దాటికి ముఖ్యమంత్రులు కూడా భయపడేవారు. జిల్లా అధికారులు, మంత్రులు ముద్దు ప్రెస్ మీట్ అంటే వణికేవారు. విమర్శలు సందిమ్చడమే కాదు, జిల్లాలో చాలా అభివృద్ది పనులు చేశారు. తిరుమల కొండలపై హెలికాప్టర్ ద్వారా విత్తనాలు చెల్లించారు. తిరుపతిలోని జంతు ప్రదర్శన శాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పుత్తూరు ఎమ్మెల్యేగా ఐదు సార్లు, నగరి నుంచి ఒక సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎన్టీఆర్ మంత్రి వర్గంలో పనిచేశారు. లక్ష్మి పార్వతితో కలిసి చంద్రబాబుతోనే తల పడ్డారు. మాజీ మంత్రి రెడ్డి వారి చెంగా రెడ్డికి పక్కలో బల్లెంలా ఉండేవారు.
1999 లో కాంగ్రెస్ పార్టీలో పుత్తూరు నుంచి పోటీ చేసి ఓడి పోయారు. 2004 లో కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పటికీ తగిన గుర్తింపు ఇవ్వక పోవడంతో తిరిగి టిడిపిలో చేరారు. నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ తరువాత నగరి నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చెంగా రెడ్డిపై 1308 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఆర్ కె రోజా చేతిలో కేవలం 858 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తరువాత చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినా మంత్రి పదవి ఇవ్వలేదు.
ఆయన 2018లో అకాల మృత్యువు చెందిన తరువాత కుటుంబ సభ్యుల మధ్య వారసత్వ పోరు మొదలయ్యింది. ఆయన శ్రీమతి సరస్వతమ్మకు ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. 2019 ఎన్నికల్లో ఆమె తన చిన్న కుమారుడు జగదీష్ కు నగరి టిక్కెట్టు ఇవ్వాలని పట్టుపట్టారు. అయినా చంద్రబాబు ఆమె పెద్దకుమారుడు గాలి భాను ప్రకాష్ కు అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో తల్లి, తమ్ముడు ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. దీనితో ఆయన 2708 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన నియోజక వర్గం ఇంచార్జిగా ఉన్నారు. అయితే మంత్రి రోజాను సమర్థవంతంగా ఎదుర్కోలేక పోతున్నారని ఒక వర్గం నాయకులు అంటున్నారు.
ఈసారి ఆయన తమ్ముడు జగదీశ్ కు టిక్కెట్టు ఇవ్వాలని ఆమె తల్లి, కర్ణాటక మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు పట్టు పడుతున్నారు. అలాగే మాజీ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు పోతుగుంట విజయబాబు టిక్కెట్టు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. నారా లోకేష్ కూడా సానుకూలంగా ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు. నిత్యం తమపై విమర్శలు చేస్తున్న రోజాను ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఇంచార్జి గాలి భాను ప్రకాష్ కంటే మెరుగైన అభ్యర్థిని అన్వేషిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నియోజక వర్గంలో గట్టి పట్టు ఉన్న మాజీ జిల్లా అధ్యక్షుడు గంధమనేని రమేష్ చంద్ర ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి పాకా రాజా, రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎ ఎం రాధాకృష్ణ భాను ప్రకాష్ కు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. సీనియర్ నాయకులు రవి నాయుడు, రామానుజం చలపతి తదితరులు వ్యతిరేకిస్తున్నారు. దీనితో కొత్త అభ్యర్థి కోసం చంద్రబాబు సర్వేలు ప్రారంభించారు.
ఇక్కడ రాజు లేదా రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థి అయితే మంచిదని రాబిన్ శర్మ బృందం చెప్పినట్టు తెలిసింది. నగరి నియోజకవర్గం ఏర్పడి నప్పటి నుంచి 12 సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు రెడ్లు, రాజులు, కమ్మ సామాజిక వర్గం నాయకులు మూడు సార్లు చొప్పున విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సిద్దార్థ విద్యా సంస్థల అధినేత గతంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన అశోక్ రాజు, మాజీ మంత్రి ఇ వి గోపాల రాజు కుమారుడు జయ రామరాజు పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ జాతీయ డైరెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో ఒకరికి ఇస్తే రోజా వ్యతిరేక వర్గం మద్దతు ఉంటుందని భావిస్తున్నారు. తాజా పరిస్థితులను పరిశీలిస్తే గాలి భాను ప్రకాష్ కు టిడిపిలో ఎదురు గాలి వీస్తున్నదని పరిశీలకులు భావిస్తున్నారు.