రాయల ఖిల్లా తిరుపతి
టిడిపికి కంచుకోట లాంటి తిరుపతి నియోజక వర్గం అభ్యర్థి విషయంలో ఆ పార్టీ అధినేత ఆచి తూచి అడుగు వేస్తున్నారు. కులం, డబ్బు, పేరు, పోరాట పటిమ ఉన్న వ్యక్తి కోసం సర్వే చేస్తున్నారు. ఈ సారి ఇక్కడ గెలుపు ఖాయం అన్న నమ్మకం ఉండటంతో పలువురు ఆశావహులు టిక్కెట్టు కోసం పోటీ పడుతున్నారు. అయితే మూడు పేర్లు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. తెదేపా ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు జరిగిన సాధారణ, మూడు ఉప ఎన్నికల్లో మొత్తం ఏడుసార్లు బలిజ సామాజిక వర్గం అభ్యర్థులు గెలిచారు. నాలుగు సార్లు రెడ్లు, ఒక సారి కమ్మ సామాజిక వర్గం వారు విజేతలుగా నిలిచారు. పార్టీల పరంగా చూస్తే ఏడు సార్లు టిడిపి, మూడు సార్లు కాంగ్రెస్ రెండు సార్లు వైసిపి అభ్యర్దులు విజయం సాధించారు.
1983 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్ టి రామారావు గుడివాడ, తిరుపతి రెండుచోట్ల విజయం సాధించారు. తరువాత ఆయన తిరుపతి స్థానానికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కత్తుల శ్యామల విజయం సాధించారు. అయితే 1985,1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మబ్బురామి రెడ్డి విజయం సాధించారు. 1994లో ఎ మోహన్, 1999లో చదలవాడ కృష్ణమూర్తి టిడిపి టిక్కెట్టుపై గెలిచారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం వెంకట్రమణ విజయం సాధించారు. 2009 లో పి ఆర్ పి అధినేత కె చిరంజీవి త్రిముఖ పోటీలో విజేతగా నిలిచారు. అయితే ఆయన రాజీనామా చేయడం వల్ల జరిగిన ఊప ఎన్నికలో వైసిపి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి గెలిచారు. 2014 ఎన్నికల్లో ఎం వెంకట్రమణ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన అకాల మరణం వల్ల 2015 లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య ఎం సుగుణమ్మ కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీదేవి మీద లక్ష 16 వేల మెజారిటీ సాధించారు. ఆ ఎన్నికల్లో మానవతా దృష్టితో వైసిపి పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి సుగుణమ్మపై వైసిపి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి 708 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపు స్వంతం చేసుకున్నారు.
తరువాత జరిగిన నగర కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి డాక్టర్ బి ఆర్ శిరీష యాదవ్ మేయర్ అయ్యారు. మొత్తం 50 కార్పొరేట్ స్థానాలలో 49 వైసిపి కైవసం చేసుకోగా టిడిపి ఒక స్థానం దక్కించుకున్నది.
ఈ నేపథ్యం పరిశీలిస్తే ఇక్కడ పార్టీల పరంగా టిడిపి, కులాల పరంగా బలిజ సామాజిక వర్గానికి అనుకూలంగా ఉంటుంది. అయితే టిడిపికి బలమైన ఓటు బ్యాంకు అయిన యాదవ సామాజిక వర్గానికి చెందిన శిరీష వైసిపి మేయర్ గా ఉన్నారు. కరుణాకర్ రెడ్డి టిటిడి పాలకమండలి అధ్యక్షునిగా ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయరుగా ఉన్నారు. దీనితో చంద్రబాబు అభర్ధి ఎంపిక విషయంలో ఆలోచనలో పడ్డారు. బలిజ అభ్యర్థిని ఎంపిక చేస్తే యాదవులు దూరమవుతారని అనుమానిస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి టిక్కెట్టు ఇస్తే బలిజ ఓటర్లలో చీలిక రావచ్చని భావిస్తున్నారు. రెడ్డి మీద రెడ్డిని పెడితే ఎలా ఉంటుందన్న అంశం పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు వర్గాల నుంచి ముగ్గురి పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
ఇందులో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు మొదటి వరుసలో ఉంది. ఆమె భర్త వెంకట్రమణ రెండు సార్లు, ఆమె ఒక సారి ఎమ్మెల్యే గా గెలిచారు. ఎన్నికల అనంతరం నియోజక వర్గం ఇంచార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇక పార్లమెంటు అధ్యక్షుడు గొల్ల నరసింహ యాదవ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి నమ్మిన బంటులా పనిచేస్తున్నారు. గతంలో తుడా అధ్యక్షునిగా పనిచేశారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
రెడ్డి సామాజిక వర్గం నుంచి రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. ఆయన పార్టీ ప్రారంభం నుంచి ఉన్నారు. జిల్లా కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, పరిశీలకుడు, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు.
ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే మోహన్, మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ ఊకా విజయకుమార్, డాక్టర్ కోడూరు బాల సుబ్రమణ్యం, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణా రెడ్డి, JB శ్రీనివాస్ తదితరులు టిక్కెట్టు ఆశిస్తున్నారు. తిరుపతికి చెందిన రాష్ట్ర కార్యదర్శి మబ్బు దేవ నారాయణ రెడ్డి పేరు చంద్రగిరి, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పేరు నగరి అభ్యర్థుల జాబితాలో ఉన్నట్టు తెలిసింది.