రోజాకు ఇంటి పోరు !
వైసిపి ఫైర్ బ్రాండ్, మంత్రి అర్ కె రోజాకు నగరి నియోజకవర్గంలో సొంత పార్టీలోనే ఎదురు గాలి విస్తోంది. వచ్చే ఎన్నికల్లో రెడ్డి వర్గం నుండి గండం ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు పర్యాయాలు నగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా చక్రం తిప్పుతున్న రోజాకు చెక్ పెట్టాలని ఒక వర్గం ప్రయత్నం చేస్తోంది. రానున్న ఎన్నికలలో ఆమెకు టికెట్ రాకుండా గట్టిగా అడ్డుపడుతోంది. ఒకవేళ ముఖ్యమంత్రి జగన్ టికెట్ ఇచ్చిన తామే రోజాను ఓడిస్తామని కూడా సంకేతాలను పార్టీ పెద్దలకు పంపుతోంది. దీంతో ఈసారి నగరిలో రోజా అభ్యర్థిత్వం డైలమాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రోజా వర్గీయులు మాత్రం చాలా ధీమాగా ఉంటున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని దీటుగా పదునైన వ్యాఖ్యలతో రోజా ఇరుకున పెడుతున్నారు. రాష్ట్రంలోనే ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో ఒక ముఖ్యమైన, తిరుగులేని నేతగా చలామణి అవుతున్నారు. అటువంటి రోజాను పక్కన పెడితే పార్టీకే నష్టమని ఆమె వర్గీయులు భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో రోజాకు టికెట్ రాకుండా ఆపడం ఎవరి తరం కాదని, ఆమె విజయన్ని కూడా ఆపలేరని అంటున్నారు.
మంత్రి రోజాకు నియోజకవర్గంలో తొలినుంచి పార్టీలో వ్యతిరేకవర్గం ఉంది. అయినా ఆమెను కట్టడి చేయడంలో విఫలం అవుతున్నారు. రోజా మంత్రి అయిన తర్వాత రాజకీయంగా దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో ఏ మంత్రికి రానంత ప్రచారం రోజాకు వస్తోంది. రోజా ఒక సంచలనంగా YCP పార్టీలో పేరుపొందారు. అయితే సొంత నియోజకవర్గంలో మాత్రం అందరిని కలుపుకొని పోలేకపోతున్నారు. నియోజకవర్గానికి చెందిన శ్రీశైల దేవస్థానం పాలకమండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ వర్గం రోజాను కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆమెకు నియోజకవర్గంలో అడుగడుగున అడ్డు తగులుతున్నారు. రోజాను బాహాటంగానే విమర్శిస్తున్నారు. సవాల్ చేస్తున్నారు.
రెండు నెలల కిందట ముఖ్యమంత్రి జగన్ నగరికి వచ్చినప్పుడు రోజా ఫోటో లేకుండానే నియోజకవర్గంలో కటౌట్లు, బ్యానర్లు వెలశాయి. మాజీ చైర్పర్సన్ శాంతిని, రోజాని జగన్ సర్దుబాటు చేయాలని ప్రయత్నం చేసినా, కుదరలేదు. ఉప్పు నిప్పులాగా ఇరు వర్గాలు ఒకే పార్టీలోనే కొనసాగుతున్నాయి. నగరి నియోజకవర్గంలో ఆమెను వ్యతిరేకిస్తున్న వర్గం కూడా బలమైనదే. ఆమెకు టిక్కెట్టు ఇస్తే, ఆ వర్గం మనస్ఫూర్తిగా పని చేయక పోతే ఆమెకు ఓటమి తప్పదని నాయకులు భావిస్తున్నారు. నగరి మునిసిపాలిటీ మాజీ చైర్మన్ కె జె కుమార్, శ్రీశైలం దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి రోజాను తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు.
రోజా 2014లో కేవలం 858 ఓట్ల తేడాతో టిడిపి అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమ నాయుడు పైన విజయం సాధించారు. 2019లో గాలి భాను ప్రకాష్ పై 2,708 ఓట్ల స్వల్ప ఆధిక్యం సాధించారు. ఈ సారి కనీసం 1500 వైసిపి ఓట్లు చీలినా ఆమె ఓడిపోక తప్పదని అంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రెడ్డివారి చెంగా రెడ్డి కూతురు ఇందిరా ప్రియదర్శిని లేదా రెడ్డివారి చక్రపాణి రెడ్డికి టిక్కెట్టు ఇవ్వాలని జగన్ మీద వత్తిడి పెరుగుతోంది. చెంగా రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టు ఉంది. చక్రపాణి రెడ్డి ఆయన అన్న కుమారుడే. కాబట్టి రెడ్డివారి కుటుంబంలో ఒకరికి టిక్కెట్టు ఇస్తే మంచిదని సర్వేల్లో కూడా తెలిసిందని అంటున్నారు.
ఇదిలా ఉండగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా రోజాను ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. అయితే ఇంచార్జి గాలి భాను ప్రకాష్ కంటే మెరుగైన అభ్యర్థిని అన్వేషిస్తున్నారు. ఆయనకు తన తల్లి మాజీ ఏమ్మెల్సీ సరస్వతమ్మ, తమ్ముడు జగదీష్ వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే నియోజక వర్గంలో పట్టు ఉన్న మాజీ జిల్లా అధ్యక్షుడు గంధమనేని రమేష్ చంద్ర ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి పాకా రాజా, రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎ ఎం రాధాకృష్ణ, సీనియర్ నాయకులు రవి నాయుడు, రామానుజం చలపతి తదితరులు భాను ప్రకాష్ ను వ్యతిరేకిస్తున్నారు. దీనితో ధీటైన కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఇటు సొంత పార్టీ, అటు వైరి పక్షం కూడా జిల్లాలో రోజా లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇరు పక్షాలను ఎదుర్కొని రోజా రాజకీయంగా ఎలా నిలతోక్కుకుంటుందో వేచి చూడాల్చిందే.