జిల్లాలో ప్రక్షాళనకు బాబు కసరత్తు !
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంట గెలవడానికి కసరత్తు ముమ్మరం చేశారు. పార్టీలో కొత్త, యువ, పోరాట పాటిమ ఉన్న రక్తం నింపడానికి కసరత్తు జరుగుతోంది. చంద్రబాబుకు సొంత జిల్లాలో పట్టలేదు, సొంత నియోజకవర్గంలో గెలువలేరు వంటి విమర్శలకు ధీటుగా చేతల్లో సమాధానం చెప్పడానికి సిద్ధం అవుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ ప్రక్షాళనకు కసరత్తులు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లాలో సగం మంది ఇంఛార్జీలు, ముప్పాతిక మంది నియోజకవర్గ పరిశీలకులు కొత్త వారు రానున్నారు. కోవర్టు రాజకీయాలు చేస్తున్న వారికి, క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్టం చేయకుండా, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా, రాష్ట్ర స్థాయి నాయకులను కాకా పట్టే నాయకులకు చెల్లుచీటీ ఇవ్వనున్నారు. బెయిలు మీద ఏకాంతంగా ఉన్న ఆయన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్తితి, వ్యవస్థాగత వ్యవహారాలను విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా తన స్వంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లా దృష్టి పెట్టారు.
1978 లో ఆయన తొలిసారి చంద్రగిరి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కొన్నాళ్ళ తరువాత మంత్రి కూడా అయ్యారు. 1983లో ఆయన తిరిగి చంద్రగిరిలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి టిడిపి అభ్యర్ధి వెంకట్రామా నాయుడు చేతిలో ఓడిపోయారు. తరువాత ఆయన టిడిపిలో చేరినా 1985 మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేయలేదు. 1989 నుంచి కుప్పంలో టిడిపి అభ్యర్ధిగా వరుస విజయాలు నమోదు చేసుకున్నారు.
అయితే జిల్లాలో పార్టీ పరిస్తితి చాలా దారుణంగా ఉంది. 1983, 1994 ఎన్నికల్లో ఎన్టీయార్ నాయకత్వంలో జిల్లాలోని 15 నియోజక వర్గాలలో టిడిపి 14 చోట్ల విజయం సాధించింది. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 1999 జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చినప్పటికీ చిత్తూరు జిల్లాలో 6 స్థానాలు వచ్చాయి. 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా జిల్లాలో టీడీపీకి ఐదు స్థానాలు వచ్చాయి. 2009 ఎన్నికల నాటికి నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల 14 నియోజక వర్గాలు అయ్యాయి. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ జిల్లాలో టిడిపికి ఆరు స్థానాలు వచ్చాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చినప్పటికీ జిల్లాలో ఐదు స్థానాలు మాత్రమే దక్కాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కరే గెలిచారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి హేళన చేసినట్టు చంద్రబాబు టిడిపి అధ్యక్షుడు అయిన తరువాత ఐదు సార్లు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి కూడా జిల్లాలో కనీసం సగం సీట్లు తెచ్చుకోలేదు. రెండు సార్లు ఆరు, రెండు సార్లు ఐదు స్థానాలు రాగా ఈ సారి ఒకే స్థానం వచ్చింది.
తాను పుట్టిపెరిగి రాజకీయ ప్రస్థానం చేసిన చంద్రగిరి నియోజక వర్గంలో 1983,1994 లో మాత్రమే టిడిపి గెలిచింది. ఆ నియోజక వర్గంలో నాలుగు సార్లు కాంగ్రెస్ టిక్కెట్టు పై ఎమ్మెల్యేగా ఎన్నికైన, మంత్రిగా పనిచేసిన గల్లా అరుణ కుమారి 2014లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ జి డి నెల్లూరు నియోజక వర్గంలో పోటీచేసి ఓటమి చవి చూశారు. కొత్త నియోజక వర్గాలు ఏర్పడిన తరువాత 2009 నుంచి జరిగిన మూడు ఎన్నికలను విశ్లేషిస్తే మూడు సార్లు టిడిపి గెలిచిన నియోజక వర్గం కుప్పం ఒకటే. శ్రీకాళహస్తి, తిరుపతి, సత్యవేడు రెండు సార్లు గెలిచారు. నగరి, చిత్తూరు, పలమనేరు, తంబళ్లపల్లె నియోజక వర్గాల్లో కేవలం ఒక్కో సారి గెలిచారు. ఒకసారి కూడా గెలవని నియోజక వర్గాల జాబితాలో చంద్రగిరి, జి డి నెల్లూరు, పూతలపట్టు, పుంగనూరు, మదనపల్లె, పీలేరు స్థానాలు ఉన్నాయి.
ప్రస్తుతం జిల్లాలోని 14 నియోజక వర్గాలలో ఏడుగురు రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గీయులు ముగ్గురు, కమ్మ, బలిజ, బిసి, ముస్లిం సామాజిక వర్గం వారు ఒక్కొక్కరు ఉన్నారు.ఈ నేపథ్యంలో విశ్లేషిస్తే టిడిపిలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. జిల్లాలో ప్రాబల్యం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వక పోవడం, కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షునిగా ఉన్న పులివర్తి నాని పార్టీ పటిష్టతకు తగిన విధంగా కృషి చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆయన నివాసం ఉన్న చిత్తూరులో పార్టీకి కనీసం ఇంచార్జి కూడా లేరు. ఆయన ఇంచార్జిగా ఉన్న చంద్రగిరిలో ఆయన ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు జి నరసింహ యాదవ్ ఏమాత్రం పోరాట పటిమ చూపడం లేదంటున్నారు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిని ఒక రోజు కూడా పేరు పెట్టి విమర్శించలేదు. ఆయనకు తిరుపతి ఇంచార్జి సుగుణమ్మతో పోసగడం లేదు. జిల్లాలో ఒక నియోజక వర్గం ఇంచార్జి కూడా పూర్తి స్థాయిలో స్థానిక ఎమ్మెల్యేని ఎదుర్కోవడం లేదన్న ఆరోపణలు విని పిస్తున్నాయి.
45 ఏళ్ళు రాజకీయ అనుభవం, 14 ఏళ్ళు ముఖ్య మంత్రిగా, 15 ఏళ్ళు ప్రతి పక్ష నాయకుడుగా ఉన్న చంద్ర బాబు స్వంత జిల్లాలో రాజకీయంగా విఫలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పూర్తిగా పార్టీని ప్రక్షాళన చేయాలని ఆలోచిస్తున్నారు. రెండు పార్లమెంటు అధ్యక్షులను మార్చాలని భావిస్తున్నారు. సగం పైగా నియోజక వర్గాలలో ఇంచార్జి లను మార్చక తప్పదని నిర్ణయం తీసుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రోజా రెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి ఉద్దండ నేతలను ఎదుర్కోగల రెడ్డి నేతల కోసం అన్వేషిస్తున్నారు.
బలిజ, బిసి నాయకులలో సమర్థులకు పార్టీ పదవులు ఇవ్వనున్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం ఆరు మంది రెడ్లకు టిక్కెట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. అలాగే బలిజ, బిసి లకు ప్రాధాన్యత కల్పించి కమ్మ సామాజిక వర్గానికి టిక్కెట్లు తగ్గించాలని నిర్ణయానికి వచ్చారు.