5, నవంబర్ 2023, ఆదివారం

రోజాపై పోటీకి టిడిపిలో నేనంటే నేను !


మహానేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం తరువాత నగరి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి బలమైన నేత  లభించలేదు.  ముద్దుకృష్ణమ నాయుడు రద్దయిన పుత్తూరు నియోజకవర్గం నుండి అయిదు పర్యాయాలు, నగరి నుండి ఒక సారి విజయం సాధించారు. రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ,  ప్రజల మనిషిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రతిపక్షాలను విమర్శలతో ఇరుకున పెట్టడంలో సిద్దహస్తుడు. ముద్దుకృష్ణమ నాయుడు మీద ఒకసారి, అయన కుమారుడు గాలి భానుప్రకాష్ మీద మరోసారి నగరి నుండి YCP అభ్యర్థిగా రోజా వరుసగా రెండు సార్లు విజయం సాధించారు.  వైసిపి ఫైర్ బ్రాండ్, పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజాకు క్రమంగా నియోజకవర్గంలో వ్యతిరేకత పెరుగుతున్న నేపధ్యంలోపై ఆమెపై పోటీ చేయడానికి టిడిపి నేతలు పోటీ పడుతున్నారు. నిత్యం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే రోజాకు ప్రజల్లో  క్రేజీ ఉంది. నియోజక వర్గంలో కూడా మంచి పట్టు ఉంది. అలాగే ఆమెకు స్వంత పార్టీలో బలమైన వ్యతిరేక వర్గం ఉంది. శ్రీశైలం దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, నగరి మునిసిపల్ మాజీ చైర్ పర్సన్ కె జె శాంతి, ఆమె భర్త కె జె కుమార్ రోజాను తొలినుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ సారి టిక్కెట్టు రాకుండా అడ్డు పడతారని ప్రచారం కూడా జరుగుతున్నది.

సినీనటి అయిన రోజా అనూహ్యంగా రాజకీయ నాయకురాలు అయ్యారు. ఉద్దండ నేతలకు నిలయమైన నగరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఆమెలో ఉన్న స్పార్క్, బహుముఖ ప్రజ్ఞ  నచ్చడంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు 1998 లో ఆమెను పార్టీలో చేర్చుకుని ఏకంగా రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు బాధ్యత అప్పగించారు. ఆమె 2004 లో నగరి నుంచి, 2009 లో చంద్రగిరి నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓడి పోయారు. 
తరువాత  ఆమె డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గరయ్యారు. ఆయన మరణానంతరం జగన్ ఏర్పాటు చేసిన వైసీపీలో కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా నగరి నుంచి పోటీ చేసి మాజీ మంత్రి టిడిపి అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమ నాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలిచారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ పై 2708 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామన్న  విశ్వాసంతో ఉన్నారు. కీడెంచి మెలెంచాలన్న ఉద్దేశంతో టిడిపిలో ఒక వర్గాన్ని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. ఇటీవల పాలసముద్రం వద్ద ఉన్న ఒక టిడిపి నేత రిసార్ట్స్ లో రెండు రోజులు ఉండి టిడిపి నేతలతో మంతనాలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. తనకు ఒక వేళ పార్టీలో నష్టం జరిగితే దానిని టిడిపి నేతల ద్వారా భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సారి ఎలాగైనా నగరిలో రోజాను ఓడించాలని చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. దీని కోసం అనేక కోణాలలో పరిశీలనలు సాగిస్తున్నారు. రాబిన్ శర్మ బృందం కూడా వివిధ రకాల సర్వేలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో తిరిగి పోటీ చేయాలని ఇంచార్జి గాలి భాను ప్రకాష్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తాను తక్కువ తేడాతో ఓడి పోయానని, ఈ సారి తప్పకుండా విజయం సాధిస్తానని అంటున్నారు. ఆయనకు నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నాయి. అయితే భాను ప్రకాష్ ను సొంత తల్లి సరస్వతమ్మ, తమ్ముడు జగదీష్ వ్యతిరేకిస్తున్నారు.

భానుప్రకాష్ ను వ్యతిరేకిస్తున్న  ఆయన తమ్ముడు జగదీష్ కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. ఆయనకు తన తల్లి మాజీ ఎమ్మెల్సీ సరస్వతమ్మ ఆశీస్సులు ఉన్నాయి. అలాగే కర్ణాటక మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు అండదండలు ఉన్నాయి. వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతూ ఎప్పుడూ ప్రజల్లో ఉంటున్నారు. ప్రజల మనిషిగా జగదీష్ కు ప్రజల అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

కాగా పుత్తూరుకు చెందిన పోతుగుంట విజయబాబు కూడా టిక్కెట్టు కోసం చాపకింద నీరులా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గతంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు బాధ్యత నిర్వహించారు. 2014 ఎన్నికల్లో నగరి నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా గాలి ముద్దుకృష్ణమ నాయుడు మీద  పోటీ చేశారు. ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. 

కాగా సిద్దార్థ విద్యా సంస్థల అధిపతి కొండూరు అశోక రాజును బరిలో దింపితే మంచిదని ఒక వర్గం భావిస్తోంది. ఇక్కడ రాజుల సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయని అంటున్నారు. గతంలో దొరస్వామిరాజు నగరి నుండి తెదేపా తరపున పోటీచేసి విజయం సాధించారు.  అశోక రాజు గతంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.  అశోక రాజు సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలను చైర్మన్ గా నడుపుతున్నారు. 

అయితే టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి తాను లేదా తన కుమారుడు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరారు. సుధాకర్ రెడ్డి 1983లో పుత్తూరు నుంచి జనతా అభ్యర్ధిగా పోటీ చేశారు. మాజీ మంత్రి రెడ్డివారి చెంగా రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో రెడ్డివారి చెంగా రెడ్డి నగరి నుండి అయిదు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 

హర్షవర్ధన్ రెండు నెలల క్రితం లోకేష్ ను కలసి మాట్లాడారు. తరువాత ఆయన  తిరుపతి ఐఐటిలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా కూడా చేశారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ సంస్థ జాతీయ డైరెక్టర్ గా ఉన్నారు. రోజాపై పోటీకి ఇంత మంది పోటీ పడటం ఆసక్తి రేకెత్తిస్తోంది. 


ఇదిలా ఉండగా మాజీ మంత్రి ఇ వి గోపాల రాజు ద్వితీయ కుమారుడు ఇ.వి. జయ రామరాజు కూడా టీడీపీ తరుపున టికెట్ ఇస్తే రోజా పై పోటీకి సై అంటున్నారు. గోపాల రాజు గతంలో కాంగ్రెస్ టిక్కెట్టుపై  పుత్తూరు నుంచి టిడిపి అభ్యర్ధిగా నగరి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. జయ రామరాజు తిరుపతి ఎస్ వి ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షునిగా పనిచేశారు. కార్వేటినగరం మండలానికి చెందిన ఆయన బెంగుళూరులో వ్యాపారాలు చేస్తున్నారు. నగరి నియోజక వర్గంలో రానున్న ఎన్నికలలో తెదేపా విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *