3, నవంబర్ 2023, శుక్రవారం

వైసీపీలో భగ్గుమంటున్న విభేదాలు




చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, పూతలపట్టు నియోజక వర్గాలలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఒక రోజు వ్యవధిలోనే రెండు నియోజక వర్గాల్లో నాయకుల మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చాయి. గురువారం చిత్తూరులో జరిగిన బస్ యాత్రలో తనకు అవమానం జరిగిందని RTC ఉపాధ్యక్షుడు విజయనంద రెడ్డి స్టేజి మీదికి వెళ్ళినట్లే వెళ్లి వెంటనే దిగి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు వేలాదిమంది సభకు వచ్చిన వాళ్ళు  వెళ్ళిపోయారు. దీంతో సభాప్రాంగణం వెలవెలపోయింది. అదే రోజు విజయనంద రెడ్డి యూత్ పేస్ బుక్ లో "ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర మంత్రుల సమక్షంలో జరిగె బీసీ, ఎస్సీ, మైనార్టీల లను గౌరవించాల్సిన కార్య క్రమాన్ని స్టేజ్ మీద కూడా ఓ తెలుగు దేశం, జన సేన కార్య కర్తలు నడిపించడం ఎంత వరకు సమంజసం ...అది మా ఆవెవేదన, బాద. ఇధి మన అందరి బాద. బాద పడుతూ ఇంట్లొ కూర్చొంటె పార్టీకి ఆదినాయకుడుకి యెలా తెలుస్తుంధి ...పై పొటొలొ ఉన్న వ్యక్తి నిన్న మీటింగ్ ఆర్గ నైసింగ్ ,,,సిగ్గు ఉండాలి" ఇలా పోస్ట్ చేశారు. శుక్రవారం పుతలపట్టుకు చెందిన YCP నాయకులు చిత్తూరులో సమావేశమై పూతలపట్టు MLA MS బాబు మీద తిరుగుబాటు భావుటా ఎగురవేశారు. మళ్ళి MS బాబుకు టిక్కెట్టు ఇస్తే అయన విజయానికి పనిచేసేదిలేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే ఐదు మండలాల్లో వర్గాలు పెట్టి, కాణిపాకం టెండర్లను టిడిపికి అమ్ముకున్నారని విమర్శలు గుప్పించారు. 


 చిత్తూరు వైసీపీ నేతల్లో కొన్ని రోజులుగా వర్గ విభేదాలు, వైషమ్యాలు తలెత్తుతున్నాయి. ఈ విభేదాలు తాజాగా కూడా బయటపడ్డాయి. చిత్తూరులో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిక యాత్రలో నాయకుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. జిల్లా పెద్దగా పేరుందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బస్ యాత్రలో స్టేజి మీదకు కూడా పోలేదు. ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరో మంత్రి రోజా వచ్చినా, వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోయారు. వేదిక మీద కూర్చోవడానికి నాయకులకు కుర్చీలు ఏర్పాటు చేయలేదు. దీంతో సభ జరిగినంత సేపు అందరూ నిలబడే ఉన్నారు. నేతల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే మంత్రి పెద్దిరెడ్డి ఎక్కడ మాట్లాడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి మాట ఓ నేత పెడచెవిన పెట్టినట్లు సమాచారం. దీనికి తోడు రెండు రోజులుగా చిత్తూరులో బస్సు యాత్రకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఇతర నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్ల స్థలాల విషయంలో సైతం వర్గ విభేదాలు, మనస్పర్ధలు వచ్చినట్లు తెలిసింది. 


తొలుత చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ కొందరి నేతలకు చెప్పకుండా పలమనేరు రోడ్డు‌లో ఏర్పాటు చేయడంపై సైతం నేతల మధ్య సఖ్యత లేదనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సాధికార సామాజిక బస్సుయాత్ర కార్యక్రమం చిత్తూరు నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో విజయవంతం కాలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు సాక్షాత్తు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి సభా వేదిక వద్ద వరకు ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడక పోవడంపై పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. కేవలం నేతల మధ్య వర్గ విభేదాల వల్లే మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడకుండా వెళ్లిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఇదిలా ఉండగా మంత్రి రోజా చివర్లో వచ్చి అప్పుడే వెళ్లిపోవడంతో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు మధ్యలోనే వెళ్లిపోయారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి సైతం ఎంఎస్ఆర్ సర్కిల్ దగ్గర జరుగుతున్న బహిరంగ సభ నుంచి అనుచరులతో అలిగి వెళ్లిపోవడం చర్చనీయాంగా మారింది.



MS బాబుకు టిక్కెట్టు ఇస్తే పని చేయం !

 పూతలపట్టు నియోజకవర్గం లో ఎన్నికలకు ముందే ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకు వర్గ పోరు సెగ తగిలింది. నియోజకవర్గంలోని పూతలపట్టు ఐరాల,బంగారు పాల్యం, తవణంపల్లె, యాదమరి మండలాల్లో నాయకుల్ని రెండు వర్గాలుగా చేసి పబ్బం గడుపుతున్నాడని వైసిపి సీనియర్ నాయకులు ధ్వజమెత్తారు. 2024లో ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకి టిక్కెట్ ఇస్తే తాము పనిచేయమని పత్రికా ముఖంగా తేల్చి చెప్పారు. శుక్రవారం చిత్తూరులో ఐదు మండలాల నాయకులు తిరుగుబాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  శిశు సంక్షేమ శాఖ ఐసీడీసీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్  శైలజ చరణ్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ... ఐదు మండలాల్లోని స్థానికులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా పెద్దాయన, మంత్రి రామచంద్ర రెడ్డి దృష్టికి కూడా పలుమార్లు తీసుకెళ్లామని తెలిపారు. పూతలపట్టు నియోజకవర్గంలో ఇప్పటి ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకు టికెట్ ఇస్తే ఐదు మండలాలకు సంబంధించిన వైయస్సార్ పార్టీ నాయకులు పని చేయమని అన్నారు.  

విద్యుత్, ఆరోగ్య శాఖలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. కాణిపాకం ఆలయ టెండర్లు వచ్చేలా చేస్తామని ముడుపులు తీసుకున్నారని చెప్పారు. డబ్బులు తీసుకొని ఉద్యోగాలు, టెండర్లు ఇప్పించకుండా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. వర్గాలు పెట్టి, లక్షల రూపాయలు దోచుకున్న  ఎమ్మెస్ బాబుకు ప్రజలు కూడా ఓట్లు వేయరని చెప్పారు. ఎంపీపీ పదవిని అమ్ముకున్న వ్యక్తి ఎమ్మెల్యే అని ఘాటుగా విమర్శించారు. లోకేష్ కు రెండున్నర సంవత్సరం ఎంపీపీ చేస్తామని వాగ్దానం చేసి ఇంతవరకు అతని గురించి పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. కాణిపాకం ఆలయ చైర్మన్ గా రెండవసారి  మోహన్ రెడ్డికి అవకాశం కల్పించడం మరింత దారుణమన్నారు. వైయస్సార్ పార్టీ నాయకుడు సుబ్బారెడ్డి మృతి చెందితే అతని కుటుంబాన్ని ఇంత వరకు పరామర్శించకపోవడం దారుణం అన్నారు. 

పూతలపట్టు మండలంలో సుబ్బారెడ్డి భార్య గౌహతిని ఒక వర్గంగా, నాయకుల్ని ఒక వర్గంగా ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు చేశారన్నారు. బంగారుపాలెం మండలం తుంబకుప్పం గ్రామంలో అటవీ ప్రాంతంలో దాదాపు 74 ఎకరాల భూమిని దళితులకు ఇవ్వకుండ అడ్డుకున్నారని ఆరోపించారు. స్థానిక వ్యక్తులలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అభ్యర్థిని అఖండవిజయంతో గెలిపిస్తామన్నారు. కనీసం పదవ తరగతి కూడా పాసవ్వని ఎమ్మెస్ బాబును గెలిపించి పెద్ద తప్పు చేశామన్నారు. బంగారుపాలెం మండలంలో కన్వీనర్ ను  మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుగుణాకర్ రెడ్డి, ఎంపిటిసి లోకేష్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కృపా సాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ల సంఘం  అధ్యక్షుడు దయాసాగర్ రెడ్డి, నాయకులు మునిరత్నం, వెంకటములి శెట్టి, ప్రభాకర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, చిట్టి రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *