23, నవంబర్ 2023, గురువారం

టిడిపికి కంచుకోట పలమనేరు

 



తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పలమనేరు ఆ పార్టీకి కంచుకోటగా ఉండింది. టిడిపి ఆవిర్భవించిన తర్వాత తొమ్మిది పర్యాయాలు సాధారణ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఐదు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, రెండు పర్యాయాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత పలమనేరులో తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం తగ్గుతూ వస్తుంది. మళ్లీ ఆ ప్రభావాన్ని సాధించడానికి  తెలుగుదేశం పార్టీ చాయశక్తుల ప్రయత్నం చేస్తోంది. రానున్న ఎన్నికల్లో మాజీ మంత్రి అమర్నాథరెడ్డిని టిడిపి అభ్యర్థిగా రంగంలోకి దించనున్నారు. పలమనేరులో తెలుగుదేశం టికెట్టును ఆశించే మరో నాయకుడు కనిపించడం లేదు. కావున పలమనేరు నుంచి నూతన కాల్వ అమరనాధ రెడ్డి పోటి అనివార్యం.  పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఓడించాలంటే, అక్కడి నుంచి  అమరనాధ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. అలా జరిగితే అయన సతీమణి రేణుకా రెడ్డి లేక  గతంలో పుంగనూరు నుండి పోటి చేసిన ఆయన మరదలు అనీషారెడ్డి పలమనేరు నుంచి పోటీ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. 




పలమనేరు రిజర్వుడు నియోజకవర్గం నుంచి 1983లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆంజనేయులు విజయం నమోదు చేశారు.అనంతరం 1985, 1989, 1994 సంవత్సరాలలో పట్నం సుబ్బయ్య హ్యేట్రిక్ విజయాలను నమోదు చేశారు. ఆయన నందమూరి తారక రామారావు, చంద్రబాబు మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశారు. తర్వాత 2004లో పలమనేరు నియోజకవర్గం నుంచి లలిత కుమారి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 1999 లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏం తిప్పేస్వామి విజయం సాధించారు. పలమనేరు తొలినుంచి ఎస్సీ రిజర్వుడు  నియోజకవర్గంగా ఉండగా 2009 ఎన్నికలలో రిజర్వేషన్ తీసి, జనరల్ చేశారు. దీంతో 2009 ఎన్నికలలో నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2014, 2019 ఎన్నికలలో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా అమర్నాథ్ రెడ్డి, వెంకట గౌడ విజయం సాధించారు. 2014లో అమర్నాథరెడ్డి  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందినా, అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.



పెద్దపంజాణి  మండలం కెలవాతి గ్రామానికి చెందిన అమర్నాథరెడ్డి డబుల్ హ్యాట్రిక్ వీరుడు, ఓటమి ఎరుగని ధీరుడు నూతన కాలువ రామకృష్ణారెడ్డి (Nuthanakalva Ramakrishna Reddy) తనయుడు. నూతన కాలువ రామకృష్ణారెడ్డి 1985 నుంచి వరుసగా మూడు పర్యాయాలు పుంగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే మూడు పర్యాయాలు చిత్తూరు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై, ఓటమి ఎరుగని ధీరుడిగా రికార్డు నెలకొల్పారు. 1996లో రామకృష్ణారెడ్డి చిత్తూరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడంతో అమర్నాథ్ రెడ్డి ఉప ఎన్నికల్లో పుంగనూరు నుండి టిడిపి అభ్యర్థిగా  గెలుపొందారు. ఆనాటి నుండి ఈ నాటి వరకు జిల్లా రాష్ట్ర స్తాయిలో తిరుగులేని ప్రజా నాయకుడిగా రాణిస్తున్నారు. రెండు సంవత్సరాలు పార్టీని వీడినా తిరిగి పార్టీలో చేరి మంత్రి స్తాయికి ఎదిగారు.


నూతనకాల్వ అమర్నాథరెడ్డి, అయన కుటుంబం తెలుగుదేశం పార్టీకి అంకితం అయ్యారు. అమర్నాథ్ రెడ్డి 1985 నుండి  తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. 1985లో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం రెండు పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986లో అమర్నాథరెడ్డి గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు సర్పంచ్ గా పనిచేసిన మర్నాథరెడ్డి మరో రెండు పర్యాయాలు పెద్దపంజాణి మండల తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 1995లో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1996 లో జరిగిన పుంగనూరు ఉప ఎన్నికలలో టిడిపి తరఫున శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి చేతిలో  ఓటమిపాలైనా,  2004లో తిరిగి అదే పుంగనూరు నియోజకవర్గం నుండి TDP MLAగా విజయం సాధించారు.



2000 నుండి 2007 వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 2007 నుంచి 2012 వరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అమర్నాథరెడ్డికి ప్రజల మనిషిగా మంచి పేరు ఉంది. ఆయన అభిమానులు ఆయనను 'అమరన్న' అని గౌరవంగా పిలుచుకుంటారు. అమర్నాథ్ రెడ్డి నిత్యం ప్రజలతో మమేకమవుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటారు. సామాన్య కార్యకర్తను సైతం పలకరిస్తూ పార్టీలో ఉత్సాహం నింపుతున్నారు. ప్రజలకు చేరువుగా ఉంటూనే, రాష్ట్ర పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ పర్యాయం తిరిగి పలమనేరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి,  విజయం సాధించడానికి సిద్ధమవుతున్నారు. అయన విజయం సాధించి మళ్ళి మంత్రి పదవి చేపట్టాలని పలమనేరు ప్రజలు కోరుకుంటున్నారు.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *