రాజంపేట పార్లమెంటు నుండి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ !
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టడమే లక్ష్యం
కిరణ్ కు తెదేపా, జనసేన మద్దతు
గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి
రాష్ట్రంలో పట్టుకు భాజపా వ్యూహం
రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ పర్యాయం రాజంపేట పార్లమెంట్ నుండి BJP అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన మద్దతు ఇవ్వనున్నాయి. ఇదే జరిగితే సునాయాసంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించే అవకాశం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలుపొందితే కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం దక్కుతుంది. భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డిని రాజంపేట పార్లమెంటు నుండి పోటీ చేయడం బిజెపి వూహంగా తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయడానికి బిజెపి ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం.
వాయల్పాడు నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డిది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఆయన తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి జిల్లా రాజకీయాలను శాసించారు. అనంతరం ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విప్ గా, శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. రాజశేఖర్ రెడ్డి హఠాత్ మరణంతో అనుహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సి వచ్చింది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్యాంధ్ర నినాదాన్ని గట్టిగా వినిపించారు. కరుడుగట్టిన సమైక్యవాదిగా నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా అసెంబ్లీలో అధిష్టానానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. రాష్ట్ర విభజన అనంతరం సమైక్యాంధ్ర పార్టీ స్థాపించి ఎన్నికలలో పోటీ చేశారు. ప్రజలు సమైక్యాంధ్ర పార్టీని ఆదరించలేదు.
రాజకీయంగా సుదీర్ఘ విరామం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరినా, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ, మళ్లీ భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. కావున రాజంపేట నుంచి పార్లమెంటుకు పోటీ చేయించి, కేంద్ర పదవి ఇవ్వాలన్నది కేంద్ర పెద్దల ఆలోచనగా తెలుస్తోంది.
రాజకీయంగా నల్లారి కుటుంబానికి, పెద్దిరెడ్డి కుటుంబానికి చాలా కాలంగా రాజకీయ వైరం ఉంది. ఇరు కుటుంబాల మధ్య గడ్డి చేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తొలగించారు. సుదీర్ఘ కాలంగా ఇరువురికి రాజకీయ వైరం ఉంది. జిల్లాలో పట్టు సాధించడానికి ఇరు కుటుంబాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో పెద్దిరెడ్డి కుటుంబం ప్రస్తుతం విజయవంతమైందనే చెప్పాలి. పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంటుగా నుండి గెలుపొంది, వైసిపి పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా పెద్దిరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవాలన్నది బిజెపి, తెలుగుదేశం, జనసేన లక్ష్యంగా తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారైంది. రాజంపేట పార్లమెంటు స్థానాన్ని BJP కిరణ్ కుమార్ రెడ్డికి కేటాయిస్తే, పొత్తు ఉంటే ఎలాగో తెలుగుదేశం, జనసేన సహకరిస్తాయి. పొత్తు లేకున్నా రామచంద్రారెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవడానికి తెలుగుదేశం, జనసేన కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కిరణ్ సోదరురు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెదేపా జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. రానున్న ఎన్నికలల్లో పీలేరు నియోజకవర్గం నుండి తెదేపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ రకంగా కిషోర్ కుమార్ రెడ్డి కూడా కిరణ్ కుమార్ విజయానికి సహకరించనున్నారు.