పూతలపట్టు టిడిపి ఇంచార్జి మీద వరస కేసులు
నెల రోజులుగా అజ్ఞాతంలో మురళీ మోహన్
బెయిలు కోసం ముమ్మర ప్రయత్నాలు
నియోజకవర్గంలో ఊపు తగ్గిన దేశం
పూతలపట్టు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కలికిరి మురళీ మోహన్ మీద పోలీసు వరుసగా కేసులు నమోదు చేశారు. జర్నలిజం వదలి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన దళిత నేత మురళీ మోహన్ మీద నెల రోజుల వ్యవధిలోనే 11 కేసులను నమోదు చేశారు. 5 కేసులలో అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించగా మెజిస్ట్రేట్ రిమాండ్ ను తిరస్కరించారు. అయినా చెట్టును ద్విచక్ర వాహనం ఢీకొని, వ్యక్తి మరణించిన కేసును హత్యాయత్నం కేసు కింద నమోదు చేశారు. దీంతో గత నెల రోజులుగా పూతలపట్టు నియోజకవర్గ ఇంచార్జి మురళీమోహన్ అజ్ఞాతంలో ఉంటున్నారు. ఫలితంగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కొంతవరకు కుంటుపడ్డాయి.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో తవణంపల్లి మండలంలో ఎవరో చెట్టును కొట్టి రోడ్డుకు అడ్డంగా వేశారు. స్కూటర్ పైన వచ్చిన ఒక వ్యక్తి చెట్టును డికొని తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కావున ఈ మృతికి తెలుగుదేశం పార్టీ పూతలపట్టు నియోజకవర్గం ఇంచార్జ్ మురళీమోహన్ బాధ్యుడంటూ అతని మీద అత్యాయత్నం కేసును తవణంపల్లి పోలీసులు నమోదు చేశారు. ఒకరోజు రాత్రి ఉన్నఫలంగా మురళీమోహన్ ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయతించగా, జిల్లాస్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు చాకచక్యంగా తప్పించారు.
నెల రోజులుగా పూతలపట్టు నియోజకవర్గానికి మురళీమోహన్ దూరంగా ఉండటంతో, ఇక తెలుగుదేశం పని అయిపోయిందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం ప్రారంభించారు. ఇక మురళి మోహన్ రారని నియోజకవర్గానికి ఇంచార్జి ఉండరని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయమై మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నానిలు చిత్తూరు న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ పూతలపట్టులో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైసిపి నాయకులు మురళీమోహన్ మీద తప్పుడు కేసులు బనాయించాలని వివరించారు. మురళీమోహన్ చాలా ధైర్యవంతుడని, వైసీపీ నాయకులకు భయపడే వ్యక్తిత్వం కాదన్నారు. తొందరలోనే బెయిల్ వస్తుందని, తిరిగి నియోజకవర్గ మొత్తం తిరిగి పార్టీని పటిష్టం చేస్తారన్నారు. మురళీమోహన్ ఆధ్వర్యంలో పూతలపట్టులో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందని ధీమాను వ్యక్తం చేశారు.