చిత్తూరు పార్లమెంట్ నుండి కేంద్ర మాజీమంత్రి పోటీ ?
రానున్న పార్లమెంట్ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి చిత్తూరు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆమె రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో రెండు పర్యాయాలు ఆమె తెలుగు ఆమె తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ పర్యాయం తిరుపతి లోక్ సభ స్థానాన్ని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో పనపాక లక్ష్మి చిత్తూరు పార్లమెంటరీ స్థానం నుండి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. జనసేన, తెలుగుదేశం, బిజెపి పొత్తు ఉంటే ఆమె కేంద్రంలో మరో మారు మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం కింద చంద్రగిరి, నగిరి, గంగాధర్ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన అనంతరం మూడు సార్లు మాత్రమే ఇతర పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిన అన్ని పర్యాయాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయ డంకా మోగించారు. 1984 ఎన్నికలలో NP ఝాన్సీ లక్ష్మి చిత్తూరు నియోజకవర్గంలో నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారు. అనంతరం 1989, 1991 ఎన్నికలలో మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు, అనంతరం 1996, 1998, 1999 ఎన్నికలలో వరుసగా మూడు పర్యాయాలు నూతనకాల్వ రామకృష్ణారెడ్డి చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గెలుపొంది హాట్రిక్ సాధించారు.
2004 ఎన్నికలలో డీకే ఆదికేశవులు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు. 2009, 2014 ఎన్నికలలో నారమల్లి శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెండుసార్లు గెలుపొందారు. 2019 ఎన్నికలలో ఎన్ రెడ్డెప్ప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికై కొనసాగుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నందున ఎవరు నిలబడినా గెలుపు సునాయాసం అవుతుంది. మిగిలిన నియోజకవర్గాలలో ఓట్లు తగ్గినా, కుప్పంలో వచ్చే మెజార్టీ కారణంగా టిడిపి అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకే అవుతుంది. తిరుపతి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన పనబాక లక్ష్మి ఈ పర్యాయం చిత్తూరు పార్లమెంటు నుంచి పోటీ చేయనున్నారు.
నెల్లూరు జిల్లా కావలిలో జన్మించిన పనపాక భాగ్యలక్ష్మి ఎంఏ పూర్తి చేశారు. మొట్టమొదటిసారిగా 1996 పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టారు. అతి చిన్న వయసులో పార్లమెంటేరియన్ గా ఎన్నికై రికార్డు సృష్టించారు. తిరిగి 1998, 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2009 ఎన్నికలలో బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె మరో మారు ఎంపీగా ఎన్నికయ్యారు. మొత్తం నాలుగు సార్లు ఆమె ఎంపీగా గెలుపొంది రికార్డ్ సృష్టించారు. రెండు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2004-2009 సంవత్సరాల మధ్య కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2009-2014 సంవత్సరాల మధ్య కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్, టెక్స్టైల్స్ మంత్రిగా పనిచేశారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బల్లి దుర్గాప్రసాద్ మీద పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 2021 జరిగిన తిరుపతి పార్లమెంటు ఎన్నికలలో గురుమూర్తి మీద టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రెండు సార్లు ఓడిపోయిన ఆమె ఈ పర్యాయం ఎలాగైనా, గెలువాలని పట్టుదలతో ఉన్నారు. తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని ఉండవల్లి శ్రీదేవికి కేటాయించనుండడంతో పనపాక లక్షి చిత్తూరు పార్లమెంట్ నుండి పోటీ చేయనున్నారు.