పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి: CPI, CPM
విద్యుత్ చార్జీలు తగ్గించకుంటే ప్రభుత్వ పతనమే
స్మార్ట్ మీటర్లు పెడితే ఉచిత విద్యుత్తుకు మంగళమే
సిపిఐ, సిపిఎం, రైతు సంఘం నేతల ధ్వజం
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను మునుపెన్నడూ లేని విధంగా విపరీతంగా పెంచి ప్రజలపై భారం వేసిందని వచ్చే ఎన్నికల్లో ప్రజానీకం ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం తథ్యమని వామపక్ష నేతలు, రైతు సంఘం నాయకులు స్పష్టం చేశారు. సోమవారం వామపక్ష పార్టీల పిలుపుమేరకు విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం ,రైతు సంఘం నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం, జిల్లా కార్యదర్శులు ఎస్ .నాగరాజన్ ,వి.గంగరాజు, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి. జనార్దన్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వద్ద 0.5% అదనపు అప్పు కోసమే విద్యుత్ సంస్కరణలను అమలుపరుస్తూ ట్రాన్స్ఫార్మర్స్, సబ్ స్టేషన్లను ప్రవేట్ పరం చేయడం వలనే విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచడం జరుగుతుందోదని తెలిపారు. గృహ విద్యుత్తు ప్రతి నెలా బిల్లులు అమాంతంగా పెరిగిపోతున్నాయని దానితో ప్రజానీకం చెల్లించలేక లబోదిబో మనే పరిస్థితి నెలకొనిందని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులలో సర్దుబాటు చార్జీలు, ట్రూ అప్ చార్జీలు, ఇంధన సుంకం, సర్చార్జిల పేరుతో నెల నెల ప్రజలపై భారాలు మోపుతున్నారని తెలిపారు.
రైతాంగం కు ఇచ్చే ఉచిత విద్యుత్ కు మంగళం పాడేందుకే వ్యవసాయం మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. వాటిలో కూడా కమీషన్లు కొట్టేందుకే ₹3500 మీటర్ ను ₹25 వేలకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు విద్యుత్ చార్జీల పెంపు వలనే ప్రజాగ్రహానికి గురై అధికారం కోల్పోవాల్సి వచ్చిందని ఈ ప్రభుత్వానికి కూడా ఇక నూకలు చెల్లినట్లేనని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం వారం పాటు నిర్వహించ నున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి సి గోపీనాథ్, సిపిఎం జిల్లా నాయకులు పి. చైతన్య, సిపిఐ నేతలు దాసరి చంద్ర, రఘు, విజయ గౌరీ, రమాదేవి, జమీలబి, కుమారి, లతా, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.