5, అక్టోబర్ 2023, గురువారం

రెడ్ల అడ్డా నగరిలో......!?


రోజపై పోటీకి ఎన్ బి సుధాకర్ రెడ్డి  సై


  రెడ్లకు అడ్డాగా ఉన్న నగరి నియోజకవర్గం నుండి వైసిపి ఫైర్ బ్రాండ్ మంత్రి ఆర్ కె రోజాపై 
పోటీకి టిడిపి ఫైర్ బ్రాండ్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి  సిద్దం అవుతున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా ఉన్న రోజా మూడవసారి విజయం సాధించి హ్యాట్రిక్ స్వంతం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే తనకు పార్టీ అవకాశం కల్పిస్తే ఆమెను ఓడించి తీరుతానని సుధాకర్ రెడ్డి ఇటీవల ఒక ఛానల్ లో చెప్పారు. తాను లేదా తన కుమారుడు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నామని సుధాకర్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఇదివరకే చెప్పారు. అలాగే హర్షవర్ధన్ కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలసి ముఖాముఖి చర్చించారు. తమలో ఒకరికి నగరి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజక వర్గాలలో ఒక స్థానం కేటాయించాలని వారు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.

సుధాకర్ రెడ్డి 1983 లో పుత్తూరు నుంచి జనతా అభ్యర్థిగా పోటీ చేశారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా రాష్ట్ర స్థాయి బాధ్యతలు నిర్వహించారు. 1999 లో తమ వర్గాన్ని విస్మరించి టిడిపి నుంచి వచ్చిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు టిక్కెట్టు ఇవ్వడంతో సుధాకర్ రెడ్డి వ్యతిరేకంగా పని చేసి ఓడించారు. దీంతో అప్పటి పిసిసి అధ్యక్షుడు డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సుధాకర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి ఆయన వ్యక్తిత్వ వికాస శిక్షకుడు, సైకాలజిస్టుగా వృత్తి సాగిస్తున్నారు. 2011లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 


కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఆయన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర మంత్రులపై వీడియోల యుద్ధం చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు సుధాకర్ రెడ్డిని పిలిచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నగరి ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న రెడ్డివారి చెంగా రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అలాగే రోజా వ్యతిరేక వర్గం నాయకులతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇక ఆయన కుమారుడు ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డికి  విద్యావంతుడు, శిక్షకుడు సమాజ సేవకుడుగా మంచి  పేరు ఉంది. ఆయన టెన్నిస్, బ్యాడ్మింటన్ సహా ఐదు క్రీడల్లో జాతీయ క్రీడా కారుడు. ఐఐఎంలో చదివి, విఐటిలో  పి హెచ్ డి చేస్తూ తిరుపతి ఐఐటిలో డెవలప్ మెంట్ అధికారిగా ఉద్యోగం చేసి ఇటీవల రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న సంకల్పంతో ఉద్యోగం వదిలేశారు. 


ప్రస్తుతం జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ జాతీయ డైరక్టర్ గా సేవలు అందిస్తున్నారు. ఇప్పటికి విద్య, సేవా కార్యక్రమాలలో భాగంగా 13 దేశాలలో పర్యటించారు.  ఈ నేపథ్యంలో రోజాపై పోటీ చేసే అవకాశం వారిలో ఒకరికి కల్పిస్తారా, కల్పిస్తే విజయం సాధిస్తారా అన్న చర్చ కొనసాగు తున్నది. నియోజక వర్గం ఇంచార్జి గాలి భాను ప్రకాష్ తిరిగి పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడి పరిస్థితులను బేరీజు వేస్తే రెడ్లకు అడ్డాగా ఉన్న నగరిలో రెడ్డి అభ్యర్దిని రంగంలోకి దింపితే రోజాను ఓడించ వచ్చని అంచనా వేస్తున్నారు.


 నగరి నియోజకర్గ వర్గం 1962 లో ఏర్పడింది. 2009 లో పునర్విభజన సంతరించుకున్నది. ఇప్పటి వరకు 12 సార్లు జరిగిన ఎన్నికల్లో ఆరు సార్లు రెడ్లు, రాజులు, కమ్మ సామాజిక వర్గం వారు చెరి మూడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్ ఆరు సార్లు, వైసిపి రెండు సార్లు గెలవగా టిడిపి మూడుసార్లు, స్వతంత్ర పార్టీ అభ్యర్ధి ఒకసారి గెలిచారు.  రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఆర్ కె రోజా, టిడిపి అభ్యర్ధి గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆమె ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ పై 2708 ఓట్ల మెజారిటీ సాధించారు. 

ప్రస్తుతం మంత్రిగా ఉన్న రోజాను, భాను ప్రకాష్ సమర్థవంతంగా ఎదుర్కోలేక పోతున్నారని అంటున్నారు. ఆయన హైదరాబాదులో కాపురం ఉంటున్నారు. తండ్రీ, కుమారుడు కలసి వరుసగా రెండు సార్లు ఓడిపోయారు. భాను ప్రకాష్ ను ఆయన తల్లి మాజీ ఎమ్మెల్సీ గాలి సరస్వతి, తమ్ముడు జగదీష్ వ్యతిరేకిస్తున్నారు. సుధాకర్ రెడ్డి అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో రోజాతో  పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కె నారాయణ స్వామిపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అయనకు కులంతో పాటు రోజా వ్యతిరేకుల మద్దతు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజాపై పోటీ చేసే అవకాశం సుధాకర రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డిలో  ఒకరికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *