30, అక్టోబర్ 2023, సోమవారం

పాలసముద్రం టిడిపి అధ్యక్షుడి తొలగింపు యత్నం !

 



రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాల మీద, చంద్రబాబు అక్రమ అరెస్టు మీద తెలుగుదేశం పార్టీ తిరుగులేని పోరాటాలు చేస్తుంటే, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మాత్రం ఆదిపత్య పోరు కొనసాగుతోంది. నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉండగా మండల పార్టీ అధ్యక్షులను కలుపుకొని పార్టీ విజయానికి కృషి చేయాల్సిన సీనియర్ నాయకులు తమకు అడ్డుగా ఉన్న వారిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ బలహీన పడినా తమ ఆధిపత్యం ఉండాలని పట్టుపడుతున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా పాలసముద్రం మండలం పార్టీ అధ్యక్షుడు రాజేంద్రను పార్టీ పదవి నుంచి తొలగించడానికి కొంతమంది విఫల ప్రయత్నం చేశారు.


దళిత సామాజిక వర్గానికి చెందిన రాజేంద్ర ఉన్నత విద్యావంతుడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదలి రాజకీయాలలో ఉంటున్నారు. ఆయన పాలసముద్రం మండల జడ్పిటిసిగా, ఎంపీపీగా పనిచేశారు. ప్రస్తుతం మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రాజకీయ అనుభవం ఉన్న కారణంగా నియోజకవర్గ ఇన్చార్జ్ పదవిని రాజేంద్ర ఆశించారు. అయితే కొంతకాలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన చిట్టిబాబు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం థామస్ ని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమిస్తూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే తొలినుంచి పార్టీకి కష్టపడుతున్న తమను కాదని థామస్ కు నియోజకవర్గ ఇన్చార్జి ఇవ్వడం పట్ల నియోజకవర్గంలోని పలువురు దళిత నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. వారిలో పాలసముద్రం మండల పార్టీ అధ్యక్షుడు రాజేంద్రన్ కూడా ఒకరు. మిగిలిన దళిత నాయకులు కూడా పార్టీకి ఆంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో ఇన్చార్జిగా ఉన్న థామస్ కు పూర్తి సహకారం అందించడం లేదని చెప్పాలి. ఇదివరకు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న చిట్టిబాబు మీదనే థామస్ పూర్తిగా ఆధారపడ్డారు. ఆయనను ముందుపెట్టుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో మండలంలో పలువురు థామస్సుతో కలిసి రావడం లేదు. చిట్టిబాబు గతంలో నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నప్పుడు పలువురు ఆయన నియామకం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. దళిత నియోజకవర్గంలో అగ్రకులాల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ఆనాటి నుంచి మండల పార్టీ అధ్యక్షులు చిట్టిబాబుకు సహకరించడం అంతంత మాత్రమే. ఏదో మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ మనుగడ చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో ఈనెల 17వ తేదీన ఇదివరకు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న చిట్టిబాబు ఆధ్వర్యంలో పాలసముద్రం మండల పార్టీ సమావేశం జరిగింది. దీనిలో పలువురు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్ర మీద ఫిర్యాదు  చేసినట్లు ఒకటి రెండు పత్రికలలో వార్తలు రాపించారు. మండల పార్టీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండా, ఆయన లేకుండా మండల పార్టీ సమావేశాన్ని ఏ ఉద్దేశంతో నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. సమావేశం అనంతరం చిట్టిబాబు మాట్లాడుతూ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్ర మీద పలువురు నాయకులు ఫిర్యాదు చేశారని, రాజేంద్రను ఆ పదవిలో కొనసాగిస్తే పార్టీకి తీరని నష్టం కలుగుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు.  మండల పార్టీ నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలను జిల్లా, రాష్ట్ర పార్టీ నాయకులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చిట్టి బాబు హామీ ఇచ్చారు.


పాలసముద్రం మండల పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జిల్లా, రాష్ట్ర పార్టీలకు చేరవేశారు. ఈ విషయాన్ని జిల్లా పార్టీ నేతలు పట్టించుకోలేదు. అయితే ఇటివల విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ విసృత స్థాయి సమావేశంలో ఈ సమస్యను రాష్ట్ర పార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒక దళిత నాయకుడిని, ఎంపీపీగా, జడ్పిటిసిగా పనిచేసిన వ్యక్తిని ఎలా తొలగిస్తారని రాష్ట్ర నాయకులు ప్రశ్నించినట్లు సమాచారం. చిట్టిబాబు కూడా అదే మండలానికి చెందిన వారు కావడంతో సమన్వయం చేసుకొని పార్టీ కార్యక్రమాలను నడిపించాల్సిందిగా కోరినట్లు తెలిసింది. అధ్యక్షుల తొలగింపు, మార్పులు వంటివి చేపట్టవద్దని సూచించినట్లు తెలిసింది. దీంతో పాలసముద్రం మండల పార్టీ అధ్యక్షుడి తొలగింపు కార్యక్రమానికి తెరపడింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *