జనసేన, టిడిపికి పీటముడిగా తిరుపతి సీటు
రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పొత్తు ఖరాలైన విషయం తెలిసిందే. పొత్తుల్లో భాగంగా జనసేన తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, గంగాధర్ నెల్లూరు, మదనపల్లి అసెంబ్లీ స్థానాలను అడుగుతోంది. అయితే రెండు లేక మూడు అసెంబ్లీ స్థానాలు జనసేనకు కేటాయించాల్సిన పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో మూడు సీట్లు అంటే ప్రస్తుతం ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క స్థానాన్ని జనసేన కేటాయించే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లి స్థానాన్ని ఆశిస్తున్నారు. అక్కడ గంగారపు రాందాస్ చౌదరి ఎన్నికల కోసం సిద్దం అవుతున్నారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు, గంగాధర్ నెల్లూరు అసెంబ్లీ స్థానాలను ఆశిస్తున్నారు. చిత్తూరు అభ్యర్థి ఇప్పటివరకు ఎవరన్నది ఇది తేలలేదు. గంగాధర నెల్లూరులో మాత్రం పొన్న యుగంధర్ ఎన్నికల రంగంలో ముందుకు పోతున్నారు. ఇక తిరుపతి జిల్లా విషయానికి వస్తే తిరుపతి, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేన పార్టీ ఆశించే అవకాశం ఉంది.
ప్రజారాజ్యం పార్టీ ప్రారంభ సమయంలో 2009లో మెగాస్టార్ చిరంజీవి తిరుపతి నుండి పోటీ చేసి 16 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం 2012లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి 18 వేల మెజారిటీతో గెలుపొందారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వెంకటరమణ YCP అభ్యర్థి కరుణాకర్ రెడ్డి మీద 41 వేల మెజార్టీ సాధించారు. 2015లో జరిగినఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగుణమ్మ 16 వేల ఓట్ల మెజార్టీతో విజయం నమోదు చేశారు. 2019 ఎన్నికలలో తిరిగి YCP అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి 708 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం. సుగుణమ్మ కేవలం 708 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అప్పట్లో జనసేన పార్టీ తరఫున చదలవాడ కృష్ణమూర్తి బరిలో ఉన్నారు. ఆయనకు 12,315 ఓట్లు వచ్చాయి. కావున రానున్న ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి గెలుపు తిరుపతిలో నల్లేరు మీద నడకలాగా ఉంటుందని భావిస్తున్నారు.
తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు తిరుపతి తెదేపా జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్, టిడిపి సీనియర్ నాయకుడు సూరా సుధాకర్ రెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మబ్బురాం రెడ్డి కుమారుడు మబ్బు దేవ నారాయణ రెడ్డి ఆశిస్తున్నారు. తమలో ఎవరికైనా ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఈ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ సోదరుడు నాగబాబు గానీ పోటీ చేస్తే తిరుపతి సీటును త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ హరి ప్రసాద్, ఆ పార్టీ ప్రతినిధి కిరణ్ రాయల్ తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. వారికి ఇచ్చేదే లేదని టిడిపి నాయకులు తెగేసి చెబుతున్నారు.
అలాగే, శ్రీకాళహస్తి సైటును తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కుమారుడు సుదీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి నాయుడు పోటీపడుతున్నారు. అక్కడ జనసేన నియోజకవర్గ ఇంచార్జి కోటా వినుత అసెంబ్లీ టికెట్ ని ఆశిస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో జనసేనకు అసెంబ్లీ టికెట్లు కేటాయింపు వ్యవహారం కత్తి మీద సాములా మారే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా కాలంగా అసెంబ్లీ ఎన్నికలపైన ఆశలు పెట్టుకొని పని చేస్తున్నారు. డబ్బును, సమయమును ఖర్చు చేస్తున్నారు. తమను కాదని వేరే పార్టీకి టికెట్ ఇస్తే అంగీకరించే పరిస్థితులు కనిపించడం లేదు.