తెదేపా మహిళా రాణులు ఎవరు?
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున తమ అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి నలుగురు మహిళలు సిద్ధం అవుతున్నారు. పార్టీ అధిష్టానం అనుమతిస్తే రాజకీయ ప్రత్యర్ధులతో తలపడడానికి రెడీగా ఉన్నారు. రాజకీయ చదరంగంలో తమ సత్తా నిరూపించుకోవడానికి, ప్రత్యర్ధులను చిత్తు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. తిరుపతికి చెందిన సుగుణమ్మ ఇది వరకే ఎమ్మెల్యేగా ఒకసారి గెలుపొందారు. మరోసారి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తిరుపతి స్థానాన్ని ఎన్నికల పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించకుంటే, సుగుణమ్మ పోటీ అనివార్యం. గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో తలపడిన అనీషా రెడ్డి మరోసారి పోటీకి సై అంటున్నారు. పార్టీ టిక్కెట్టు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబుకా, అనీషా రెడ్డికా అన్న విషయం ఇంకా తేలలేదు. చిత్తూరు మునిసిపల్ మాజీ మేయర్ తొలిసారి ఎమ్మెల్యే బరిలోకి దిగడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ కూడా జనసేన రూపంలో అడ్డంకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సత్యవేడు నుండి హెలెన్ తొలిసారి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి సిద్ధంగా ఉన్నారు. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన JD రాజశేఖర్ గట్టి పోటీ ఇస్తున్నారు.
బలిజ సామాజిక వర్గానికి చెందిన సుగుణమ్మ తన భర్త వెంకటరమణ మరణంతో, ఆయన వారసురాలిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. సినీ నటుడు అయిన వెంకటరమణ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన అకాల మరణంతో 2015 లో జరిగిన ఉప ఎన్నికల్లో సుగుణమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో తిరుపతి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగుణమ్మ 708 ఓట్ల తేడాతో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేతులో ఓడిపోయారు. మళ్లీ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.
రాజకీయ నేపథ్యమున్న నూతనకాల్వ అనీశా రెడ్డి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో అనీశా రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పుంగనూరు నియోజకవర్గాల నుండి మంత్రి పెద్దిరెడ్డి మీద పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మొదటి నుండి పుంగనూరు నియోజకవర్గం నూతనకాల్వ కుటుంబానికి కంచుకోటగా ఉండేది. అయితే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పుంగనూరు నియోజకవర్గం వైసిపి చేతిలోకి వెళ్ళింది. పుంగనూరు నియోజకవర్గం నుంచి అనిషారెడ్డి మామ నూతనకాల్వ రామకృష్ణారెడ్డి 1985 ఎన్నికల నుండి వరసగా మూడు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 1996లో పార్లమెంట్ సభ్యులుగా ఎంపిక కావడంతో పుంగనూరుకు ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో అమర్నాథరెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి చేతిలో అమర్నాథరెడ్డి ఓడిపోయినా, 2004 ఎన్నికల్లో తిరిగి పుంగనూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి YCP ఎమ్మెల్యేగా ఎన్నికైన అమన్నాథరెడ్డి, తెలుగుదేశం పార్టీలో చేరి, ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. రామకృష్ణారెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మరో మూడు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. అయన కుమారుడు అమరనాధ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎన్నికయ్యారు. రాజకీయ నేపథ్యం ఉన్న అనీషారెడ్డి ఆటుపోట్లను తట్టుకొని తిరిగి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు.
బలిజ సామాజిక వర్గానికి చెందిన కటారి హేమలత తన అత్త కటారి అనురాధ హఠాత్ మరణంతో రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ మున్సిపల్ కార్యాలయంలో ఉండగా సమీప బంధువు చింటూ కాల్చే చంపారు. దీంతో కొంత విరామం తర్వాత కట్టాలి హేమలత మున్సిపల్ మేయర్ గా బాధ్యతలను చేపట్టారు. అప్పటినుంచి దేశం పార్టీ రాజకీయాలలో చురుగ్గా కొనసాగుతున్నారు. ఆమె భర్త ప్రవీణ్ ను కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుంది. అయినా ధైర్యం వదలకుండా వైసిపి అరాచకాలను హేమలత ఎదుర్కొంటున్నారు. తన అనుచరులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని తెలిసి నిరసనకు దిగిన కటారి హేమలత మీద పోలీసు వాహనాన్ని ఎక్కించడంతో కాలికి గాయమై చికిత్స కూడా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో హేమలత చురుగ్గా పాల్గొంటున్నారు. తనకు అవకాశం వస్తే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
సత్యవేడు నియోజకవర్గంలో నుంచి తల్లి రాజకీయ వారసురాలుగా హెలన్ రాజకీయరంగ ప్రవేశం చేయడానికి సిద్ధమయ్యారు. ఆమె తల్లి హేమలత 2009 ఎన్నికలలో అభ్యర్థిగా సత్యవేడు నుంచి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజశేఖర్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో జెడి రాజశేఖర్ ను పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి తప్పించి తొలుత హేమలతకు ఇన్చార్జి పదవి ఇచ్చారు. వారం రోజులకే ఆమె తనయ హెలన్ ను ఇన్చార్జిగా నియమించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు తర్వాత ఆందోళన కార్యక్రమాల్లో హెలన్ చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన JD రాజశేఖర్ కూడా వేరుగా ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇరువురూ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. టిక్కెట్టు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే !