12, అక్టోబర్ 2023, గురువారం

టిడిపి, బిజెపి పొత్తు ఫిక్స్ ?




తెలుగు దేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ  పొత్తు కూడా ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి పొత్తు ఉంటుందని సేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ పొత్తుకు భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో గుంభనంగా ఉన్న భారతీయ జనతా పార్టీ బుధవారం రాత్రి సస్పెన్స్ కు తెర దించే ప్రయత్నాలు చేసింది. అలాగే చంద్రబాబు అరెస్టు విషయంలో సాగుతున్న ప్రచారానికి కూడా తెర దించే ప్రయత్నం జరిగింది.


తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టయి 33 రోజులవుతుంది. ఆయన రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత AP బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు మొక్కుబడిగా ఖండించారు. తరువాత చంద్రబాబు విషయంలో వారు జోక్యం చేసుకోలేదు. చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక భారతీయ జనతా పార్టీ పెద్దల హస్తం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా ఈ అభిప్రాయం విస్తృతంగా ఉంది. ఒకరిద్దరు నాయకులు పత్రికా ముఖంగా కూడా బిజెపి పెద్దల హస్తాన్ని సందేహించారు. అయితే అధిష్టానం బిజెపికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని ఆదేశించడంతో, టిడిపి నాయకులు మిన్నకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును కేంద్ర పెద్దలు ఖండించకపోవడమే ఇక దీనికి కారణం. 


చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు వెల్లువెత్తాయి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు ధర్నాలు, రాస్తారోకాలు, నిరాహార దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలు ఇలా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల గ్రామాలకు కూడా విస్తరించాయి. అలాగే పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో కూడా చంద్రబాబుకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాదులో ఆంధ్ర సెటిలర్స్, ఐటీ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. IT ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి ధర్నాలు చేశారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి కార్లతో ఊరేగింపుగా వచ్చి తమ మద్దతును తెలియజేశారు. అయితే రాష్ట్ర సమితి ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఆంధ్రా సెటిలర్లు, ఐటీ ఉద్యోగులకు తీవ్ర మనస్థాపాన్ని కలిగించాయి. 


చంద్రబాబు అరెస్టుకు  సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి KCR ఇప్పటికీ స్పందించలేదు. KTR మాట్లాడుతూ ఇది ఆంధ్రాకు సంభందించిన అంశం అని, హైదరాబాదులో ఎటువంటి ఆందోళనలు, ధర్నాలకు తావు లేదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా ఆంధ్ర సెటిలర్స్, IT ఉద్యోగులలో కోపోద్రేహాలు కట్టలు తెంచుకున్నాయి. వీటిని అర్థం చేసుకున్న KTR, హరీష్ రావులు చంద్రబాబు అరెస్టును ఖండించారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్టును మొదటినుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఖండించారు.  73 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని, ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని ఖండించారు. దీంతో తెలంగాణాలో  స్థిరపడిన ఆంధ్ర సెటిలర్స్, IT ఉద్యోగులు కాంగ్రెస్ వైపు రానున్న ఎన్నికల్లో ముగ్గు చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి.


కర్ణాటక ఎన్నికలలో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతుగా ప్రచారం చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే,  కేంద్ర పెద్దలు పొత్తుల విషయంలో తేల్చకపోవడంతో అప్పట్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతుగా కర్ణాటకలో ప్రచారం చేయలేదు. అయితే పరిస్థితిని గమనించిన ప్రధాని మోడీ ఒక రోజు పర్యటనకు వచ్చి రెండు రోజులపాటు అక్కడే ఉండి ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. అయినా కర్ణాటకలోని ఆంధ్రులు బిజెపి వ్యతిరేకంగా ఓటు వేయడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలిపి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడును ఇబ్బంది పెడుతున్నారని భావించిన ఆంధ్ర ఓటర్లు కాంగ్రెస్ పట్ల ముగ్గు చూపినట్లు తెలుస్తోంది.


కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓటమిపాలకవ్వడంతో దాని ప్రభావం తెలంగాణ ఎన్నికల మీద పడింది. తెలంగాణలో అధికార భారతీయ రాష్ట్ర సమితి బిజెపిని ప్రత్యర్థిగా కూడా భావించడం లేదు. బిజెపి అనుకున్న విధంగా ఆ పార్టీలోకి వలసలు కూడా లేవు. కర్ణాటక ఎన్నికల ప్రభావంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ జోరు అందుకుంది. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బిజెపిని గట్టెక్కించడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన మద్దతు అవసరమని డిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం రాత్రి నారా లోకేష్, పురందేశ్వరి, కిషన్ రెడ్డి లతో కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తుంది. తెలంగాణాలో  32 స్థానాల్లో పోటీ చేస్తామని  ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఒక దశలో బిజెపితో తేగతెంపులు చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు.


కర్ణాటకలో ప్రభుత్వాన్ని కోల్పోయిన జనతా పార్టీ తెలంగాణలో గెలవాలంటే తెలుగుదేశం, జనసేన మద్దతు అవసరమని భావిస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధం కాకుంటే పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ నుంచి వెలుపలికి రావడానికి సిద్ధమయ్యారు. కావున ఉభయ తారకంగా బిజెపి పెద్దలు నారా లోకేష్ కు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యమైన నిర్ణయాలు ఉన్నందువల్ల తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఎవరు సమావేశంలో పాల్గొనలేదు. అలాగే ఉన్న ఫళంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులను సమావేశానికి రప్పించారు. ఈ విషయాలను పరిశీలిస్తే రానున్న ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికల బరిలోకి దిగనున్నాయని స్పష్టమౌతోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *