శ్రీకాకుళం టిడిపి కార్యకర్తలకు పుంగనూరులో ఘోర అవమానం
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీ ఉందా అన్న చర్చ కూడా కార్యకర్తల్లో వినిపిస్తోంది. శుక్రవారం సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తలను పుంగనూరు వైకాపా నాయకులు కొందరు అడ్డుకొని, వారి చేతిలోని టిడిపి జండాలు, వారు ధరించిన పసుపు చొక్కాలను విప్పించి పంపించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామకృష్ణ, రామసూరి,ఆదినారాయణ,సుందర రావు, రమేష్ అక్టోబర్ రెండున సైకిల్ యాత్ర ప్రారంభించారు. శుక్రవారం నాలుగు గంటలకు పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద టీ తాగడానికి ఆగారు. ఈ విషయం తెలుసుకున్న వైకాపా కార్యకర్త సూరి మరి కొందరితో కలిసి వచ్చి సైకిల్ యాత్ర వచ్చిన వారిని దబాయించారు. అసభ్యకరంగా దూషించారు. పుంగనూరు పెద్దిరెడ్డి అడ్డా, ఇక్కడకి చంద్రబాబునే రానివ్వలేదు, మీరెలా వస్తారు? అంటూ గట్టిగా మందలించారు. సైకిళ్లకు కట్టిన జండాలు పీకించి, వేసుకున్న చొక్కాలు విప్పించి వెనక్కు పంపారు. రాత్రికి వారు పలమనేరులో బసచేసి శనివారం కుప్పం చేరుకుని యాత్ర ముగిస్తారు.
గతంలో లోకేష్ కుప్పం నుంచి ప్రారంభించిన పాదయాత్ర కూడా పుంగనూరు మీదుగా సాగలేదు. అయితే పుంగనూరు నియోజక వర్గం పులిచర్ల మండలం మీదుగా పీలేరు చేరుకున్నది. ఇటీవల చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన కోసం పుంగనూరు వచ్చిన సందర్భంగా అల్లర్లు జరగడం అందరికీ తెలిసిందే. అందులో చంద్రబాబు సహా పలువురి కేసులు పెట్టారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి అమరనాద రెడ్డి మరికొందరు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. పుంగనూరు ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి, మరి కొందరు కొన్నాళ్ళు జైలులో గడిపి బెయిలుపై బయటికి వచ్చారు. చంద్రబాబు కూడా ఆఖరికి ముందస్తు బెయిల్ పొందారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీ నేతలు కార్యకర్తలు పూర్తిగా చేతులు ఎత్తేశారని కొందరు అంటున్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అడ్డా అయిన పుంగనూరు నియోజకవర్గంలో తొలినుంచి టిడిపి బలహీనంగా ఉంది. 2009లో నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పటి నుంచి రామచంద్రా రెడ్డి వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. మళ్ళి అయన గెలుపు నల్లేరు మిద నడకే. తెదేపాలో పెద్దిరెడ్డిని ఎదుర్కొనే నేత కూడా లేరు.అంత క్రితం ఆయన మూడు సార్లు పీలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి తన నియోజకవర్గాన్ని కంచుకోటగా తయారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ టిడిపి ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి, మండలాల అధ్యక్షులు వైసిపికి ధీటుగా ఎదుర్కోలేక పోతున్నారు. పార్టీ పరిశీలకుడు దంపూరి భాస్కర్ యాదవ్ కూడా నియోజక వర్గంలో తిరగడం లేదని అంటున్నారు.