జిల్లాలో 5 సీట్లు ఆశిస్తున్న జనసేన
తిరుపతి, చిత్తూరు అభ్యర్థులు సస్పెన్సు
మదనపల్లి నుండి గంగారపు రాందాస్ చౌదరి
గంగాధర నెల్లూరు నుండి పొన్న యుగంధర్
శ్రీకాళహస్తి నుండి కోటా వినుత
తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ భారీగానే ఆశలు పెట్టుకుంది. చిత్తూరు జిల్లాలో బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో జిల్లాలో ఉన్న 14 స్థానాలకు గాను, ఐదు స్థానాలను జనసేన పార్టీ ఆశిస్తోంది. జిల్లాలో ఇప్పటికే జనసేన అభ్యర్థులు ఎన్నికల రణరంగంలోకి దూకారు. తెలుగుదేశం పార్టీతో కలిసి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ కార్యరంగంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటివరకు జనసేన అభ్యర్థులు ఎక్కడ అధికారికంగా ఖరారు కాలేదు. అయితే మదనపల్లి నుంచి గంగారపు రామదాసు చౌదరి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పొన్న యుగంధర్, శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి కోటా వినుత రంగంలో ఉన్నారు. ప్రజలతో మమేకమై ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. తిరుపతి,చిత్తూరు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు తేలాల్సి ఉంది. వీటి పైన సస్పెన్స్ కొనసాగుతోంది.
ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పుడు చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అక్కడ బలిజ సామాజిక వర్గం బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా, అక్కడ బలిజ కులస్తులకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. గత ఎన్నికల్లో తిరుపతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగుణమ్మ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా ఆమె పోటీకి సమాయత్తమవుతున్నారు. ఈ ఎన్నికలలో జనసేన తరఫున పొత్తు ఉంటే మొదట ప్రస్తావనకు వచ్చే నియోజకవర్గం తిరుపతి. తిరుపతి నుండి పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు గానీ పోటీ చేస్తే తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ తిరుపతి టికెట్ కోసం పోటీలో ఉన్నారు. అయితే స్థానిక అభ్యర్థులకు టికెట్లు ఇస్తే సహకరించేది లేదని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా రంగంలో ఉన్న నాయకులు అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లాలో జనసేన తెలుగుదేశం సీట్ల విషయంలో తిరుపతి ఓ పీటముడి కానుంది అనడంలో సందేహం లేదు.
మదనపల్లి నియోజకవర్గం నుంచి ఈ పర్యాయం గంగారపు రాందాస్ చౌదరి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. జనసేన తెలుగుదేశం పొత్తు ఖరారు అయినా నాటి నుంచి తెలుగుదేశం పార్టీతో కలిపి గంగారపు రాందాస్ చౌదరి చురుగ్గా ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అంతకుముందు కూడా జనసేన కార్యక్రమాలు మదనపల్లిలో చాలా సురుగ్గా జరిగాయి. గంగారపు రాందాస్ చౌదరి 2004 ఎన్నికలలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సుమారు 48 వేల ఓట్లు సాధించారు. తర్వాత ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు గత ఎన్నికల్లో రాందాస్ చౌదరి సతీమణి గంగారపు స్వాతి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ పర్యాయం తిరిగి పోటీ చేయడానికి రాందాస్ చౌదరి సిద్ధమవుతున్నారు.
జనసేన పార్టీ నాయకులు చిత్తూరు స్థానాన్ని కూడా ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ అభ్యర్థి ఎవరు అనేది తేలలేదు. గత ఎన్నికలలో దయారాం ఇక్కడ నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం నియోజకవర్గంలో బలమైన నాయకుడు లేదు. అయితే డీకే ఆదికేశవులు కుమారుడు డి ఎ శ్రీనివాసులు వైపు జనసేన చూపు ఉన్నట్లు తెలుస్తుంది. డి ఎ శ్రీనివాసులును తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమ పార్టీ నుండి పోటీ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు డి ఏ శ్రీనివాసులు ఏ విషయం తేల్చలేదు. ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న విషయం కూడా సస్పెన్స్ గానే ఉంది. పోటీ చేస్తే ఏ పార్టీ నుండి పోటీ చేస్తారన్న విషయం కూడా తేలలేదు.
రిజర్వుడు నియోజకవర్గమైన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జనసేన కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. నియోజకవర్గ ఇన్చార్జ్ పొన్న యుగంధర్ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి నాయకులు అందరూ పాల్గొన్నారు. మొదటినుంచి గంగాధర నెల్లూరులో జనసేన కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారు అయిన తర్వాత తెలుగుదేశాన్ని కలుపుకొని ఉదృతంగా పొన్న యుగంధర్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన థామస్ కు నియోజకవర్గంలోని కొందరు నాయకులు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నుంచి పొన్న యుగంధర్ సరైన అభ్యర్థిని పలువురు భావిస్తున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ కోటా వినుత తనదైన శైలిలలో కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ జనసేన పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి దేశం పార్టీ తరఫున బొజ్జల సుధీర్ రెడ్డి, SCV నాయుడు పోటీపడుతున్నారు. టిక్కెట్ రేసులో నువ్వా నేనా అన్నట్లు పోరాటం కొనసాగుతుంది. నేపథ్యంలో శ్రీకాళహస్తి స్థానాన్ని జనసేనకు కేటాయించాలని ప్రతిపాదన కూడా ఉంది. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వినుతకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులు మెండుగా ఉన్నాయని సమాచారం. ఒక మహిళగా ఆమెను ప్రోత్సహించే అవకాశం ఉందని అంటున్నారు.