బెంగళూరులో తెలుగుదేశం సమర శంఖారావం
చంద్రబాబు అరెస్టయి 30 రోజులు పూర్తి
చంద్రబాబు కేసుల్లో సోమవారం కీలకం
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదివారం బెంగళూరు తెలుగుదేశం ఫోరం సమర శంఖారావాన్ని పూరించింది. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు ఆదివారంతో 30 రోజులు పూర్తి అయ్యాయి. చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సమర శంఖారావం సభ పిలుపునిచ్చింది. ఈ సమర శంఖారావం ప్రభ ప్రాంగణంలో బాబుతో నేను అంటూ వేలాది మంది బెంగుళూరు ప్రజలు చంద్రబాబుకు అండగా నినాదాలు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి సామూహింగా లేఖల రాశారు. సమర శంఖారావం సభలో వేలాదిగా తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తరఫున 14 మంది అగ్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అన్నయ్య పాత్రుడు, మరో మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ అమర్నాథరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు, కడప జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గురజాల ఇన్చార్జి ఎరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం ఉగ్ర నరసింహారెడ్డి, ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మరో ఎమ్మెల్సీ కలిచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే, దెందులూరు ఇన్చార్జి చింతలేని ప్రభాకర్, గన్నవరం ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, ఐ టి డి పి ఇన్చార్జి చింతకాయల విజయ్, TPW ప్రెసిడెంట్ పి తేజస్విని, జాతీయ ఉపాధ్యక్షుడు మాధవ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
వక్తలు చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడును అన్న వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జైలుకు వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి అందరికీ అవినీతి మరకలు అంటించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసులో ఎలాంటి అవినీతి లేకపోయినా రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలు ఎవరూ ఉండకూడదనే ఆలోచనతో జగన్ ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఎంత తొక్కి పెట్టాలని ప్రయత్నం చేస్తే, అంతకంటే రెట్టింపు వేగంతో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.
చంద్రబాబు కేసుల్లో సోమవారం కీలకం
దిగువ కోర్టు నుంచి 'సుప్రీం' వరకు విచారణలు, తీర్పులు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడికి సంబంధించిన కేసుల్లో సోమవారం కీలకం కానుంది. దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు ఆరోజు వెలువడనున్నాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం విచారణ ఉంది. ఇదే కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు సోమవారమే నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతోపాటు మరోసారి 'పోలీసు కస్టడీ'కి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై సైతం అదేరోజు ఏసీబీ కోర్టు తగిన ఉత్తర్వులు జారీచేయనుంది. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే.
హైకోర్టులోనూ చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిలు పిటిషన్లపై సోమవారం తీర్పులు వెల్లడికానున్నాయి. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి తీర్పులను రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు పిటిషన్లలో న్యాయమూర్తి సోమవారం నిర్ణయం వెల్లడించనున్నారు.