చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందా?
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం ప్రమాదంలో పడిందా? ఆయన ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తుందా?? అవుననే అంటున్నారు చంద్రబాబు కుటుంబ సభ్యులు. ఆయనకు కారాగారంలో సరైన సదుపాయాలు లేవని, వైద్యం అందడం లేదని, రోజు రోజుకు చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మీద పగ తీర్చుకోవడానికి ఆయన్ను అరెస్టు చేసి జైలులో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన తనయుడు నారా లోకేష్ ఒక అడుగు ముందుకు వేసి జైలులో చంద్రబాబు నాయుడుకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయనకు ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ ఎక్కించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడును వెంటనే కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో తన భర్తకు సరైన వైద్య చికిత్స అందించడం లేదని ఆరోపించారు. చంద్రబాబుకు అత్యవసరంగా వైద్యాన్ని అందించడంలో ఏపీ ప్రభుత్వ వివిఫలమైందని ఆరోపించారు. ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని, ఇంకా బరువు తగ్గితే ఆ ప్రభావం కిడ్నీల పైన పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లోని వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండటంతో చంద్రబాబు ఆరోగ్యానికి ముప్పు ఏర్పడిందని వివరించారు. జైలులోని భయంకరమైన పరిస్థితులు కారణంగా తన భర్తకు ముప్పు కలిగేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఆరోగ్యం పై ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ జైల్లో తన తండ్రి ఆరోగ్యం ప్రమాదంలో ఉందన్నారు. ఇప్పటికే తన తండ్రి బరువు తగ్గాలని, కలుషిత నీటితో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జైలులో చంద్రబాబుకు సరైన చికిత్స అందడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తుందని పేర్కొన్నారు. అధికారులు చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్ పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు.
చంద్రబాబు ఆరోగ్య గురించి సినీ నటుడు, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్యంతో జగన్ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిలో చంద్రబాబును ఎదుర్కొనలేక అక్రమ కేసులతో జైలు పాలు చేసి పగ తీర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 73 ఏళ్ల వయసులో పెద్దాయన్ని ఇబ్బంది పెడతారని నిలదీశారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి నకలీ నివేదికలను విడుదల చేసి ఏం దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు సరైన వైద్యం అందించడానికి వ్యక్తిగత వైద్యులను అనుమతించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్ రెడ్డి బాధ్యత వహించాలని బాలకృష్ణ స్పష్టం చేశారు.
రాజమహేంద్రవరం గేర్ లో ఉన్న చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబును అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించడం బాధాకరమన్నారు. అపరిశుభ్ర వాతావరణం చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. తక్షణం కార్పొరేటర్ స్థాయి వైద్యం అందించాలన్నారు. చంద్రబాబుకు సకాలంలో వైద్యం వైద్యం అందక 5 కేజీల బరువు తగ్గాలని వివరించారు. ఇలా బరువు తగ్గడం కారణంగా ఆ ప్రభావం కిడ్నీలపై పడే అవకాశం ఉందని ఆందోళన చెందారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆవేదనతో ఉన్నామని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు.
కుప్పం ఎన్టీఆర్ విగ్రహం వద్దనిరసన
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కార్పొరేటర్ ఆసుపత్రికి తరలించాలని ఎమ్మెల్సీ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ శ్రేణులు శుక్రవారం కుప్పంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్రమ కేసులో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి, జైలులో ఆయనకు ఎటువంటి సౌకర్యాలు ఇవ్వక ఆయనను హింసిస్తున్నారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి క్షీణించిన కారణంగా ఆయన ఆరోగ్య బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వెంటనే మెరుగైన వైద్య సేవ నిమిత్తం ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బైఠాయించి టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
చిత్తూరులో రోగులకు పండ్ల పంపిణీ
జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా, ఆయన ఆరోగ్య పరిస్థితులు మెరుగు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ శుక్రవారం చిత్తూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ లో చిల్డ్రన్స్ వార్డు, వెటర్నరీ వార్డ్ లలో పేషెంట్లకు కటారి హేమలత ఆధ్వర్యంలో పండ్లు పంచిపెట్టి నిరసన తెలియజేశారు. హాస్పిటల్ ఎదుట నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర నాయకులు సురేంద్ర కుమార్, చిత్తూరు పార్లమెంటు పార్టీ యూత్ ప్రెసిడెంట్ కాజూరు రాజేష్, వెంకటేష్, యాదవ్ రాజశేఖర్ నాయుడు, 44 వ డివిజన్ నాయకులు అత్తుబై కళ, హేమాద్రి, జిలాని, నవాజ్, జాఫర్, క్లస్టర్ ఇంచార్ దుర్గ కిషోర్ మహిళా నాయకులు వరలక్ష్మీ, నాగలక్ష్మి, సీఎం విజయ పాల్గొన్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై డీఐజీ రవికిరణ్ వివరణ
చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉన్నాం. ఎప్పటికప్పుడుఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాం. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు. చంద్రబాబు జైలుకు వచ్చినప్పుడు 66కిలోల బరువుఉన్నారు. నిన్న చెక్ చేసినప్పుడు 67కిలోల బరువు ఉన్నారు. చంద్రబాబు బరువు తగ్గారన్న ప్రచారం అవాస్తవం. జైలులో ఖైదీలెవరూ చంద్రబాబును కలిసే పరిస్థితి లేదు. చంద్రబాబు ప్రతి కదలిక సీసీ కెమెరాలో రికార్డవుతోంది. ప్రతిరోజూ చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తాం. చంద్రబాబుకు ఇంటి నుంచి వస్తున్న భోజనాన్ని చెక్ చేసి పంపిస్తున్నాం.