8, అక్టోబర్ 2023, ఆదివారం

YCPలో ఈ ముగ్గరికే టిక్కెట్ల ఖరారు !?

ఇద్దరి మంత్రులకూ తప్పని వెయిటింగ్ 
ప్రజలకు అందుబాటులో ఉన్నవారికే ప్రాధాన్యత 
అవినీతి ఆరోపణలు ఉంటే, ఇంటికే 
జిల్లాలో  సగం మందికి నిరాశే 
MLAల పనితీరుపై డేగ కన్ను 


రానున్న ఎన్నికలలో జిల్లాలో YSR కాంగ్రెస్ పార్టీ తరపున ముగ్గరికి మాత్రమే టిక్కెట్లు ఖరారు అయినట్లు తెలుస్తుంది. మిగిలిన 11 మంది అభ్యర్థుల టిక్కెట్లు డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికలల్లో  పుంగనూరు నుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కుప్పం నుండి YCP జిల్లా అధ్యక్షుడు, MLC భరత్, చంద్రగిరి నుండి ప్రస్తుత MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. స్థానికంగా ఉన్న వ్యతిరేకత కారణంగా మంత్రి రోజా, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అభ్యర్థిత్వాలు కూడా పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు దగ్గర పడే కొద్ది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులలో టెన్షన్ పెరుగుతోంది. రానున్న ఎన్నికల్లో తమకు టిక్కెట్లు వస్తుందో, రాదో అన్న సందేహం మెజారిటీ శాసనసభ్యులలో వ్యక్తం అవుతుంది. రానున్న ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చావో, రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో జరుగుతున్నాయి. కావున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. నాలుగైదు రకాల సర్వేలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడానికి సిద్ధమవుతున్నారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి అధికారమే లక్ష్యంగా పనిచేస్తుంటే, జిల్లాలోని పలువురు శాసనసభ్యులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. ప్రకృతి వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి 20% వరకు కమీషన్లను డిమాండ్ చేస్తున్నారు. కమీషన్లు ఇవ్వనిదే కానీ పనులు మంజూరు, బదిలీలు జరగడం లేదు. నియోజకవర్గంలో ఇసుక, గ్రానైట్, ఎర్రచందనం తదితరాల అక్రమ రవాణా ఎమ్మెల్యేల కనుసనల్లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వ భూములను గుర్తించి ఎక్కడికక్కడ కైవసం చేసుకుంటున్నారు. మళ్లీ టికెట్ వస్తుందో, రాదో వస్తే గెలుస్తామో లేదో అన్న సందేహం వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతుంది. ఇందుకు అనుగుణంగా గత ఎన్నికల్లో ఖర్చుపెట్టిన దానికంటే పది రెట్ల సొమ్మును సంపాదించడానికి నానా ప్రయాసలు పడుతున్నారు. రానున్న ఎన్నికల్లో వ్యయం చేయడానికి నిధులను కూడా పోగేసుకుంటున్నారు.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతినెల ఎమ్మెల్యేల పనితీరును వివిధ వర్గాల ద్వారా నివేదికల రూపంలో తెచ్చుకుంటున్నారు. ఐ ప్యాడ్ సభ్యులు ఒకవైపు నిఘా పెడుతున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ నివేదికలు వెళుతున్నాయి. ఇవి కాకుండా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీంను పార్టీ తరఫున సిద్ధం చేశారు. వీరు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఆమలును పర్యవేక్షిస్తున్నారు. శాసనసభ్యుల అవినీతి, అవకతవకల మీద నిత్యం నివేదికలు సమర్పిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే శాసనసభ్యుల మీద డేగ కళ్ళు పనిచేస్తున్నాయి. శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అన్న విషయాన్ని ఎక్కువ కేంద్రీకరిస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు పర్యటనల గురించి అప్పుడు ఆరాధిస్తున్నారు. సక్రమంగా నియోజకవర్గాల్లో పర్యటించని ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు జగన్ హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు తమ తీరును మార్చుకోవడం లేదు. అందరికీ టికెట్లు ఇవ్వలేమని జగన్ ఒకసారి ప్రకటించడంతో పార్టీలో కలకలం బయలుదేరింది. అప్పటినుండి జగన్ టికెట్ల విషయంలో గుంబనంగా ఉంటున్నారు.


 టిక్కెట్ల విషయంలో జగన్ ఎవరి మాటను వినడం లేదు. మంత్రులు, జిల్లాస్థాయి నాయకులు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి వెనుకాడుతున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం  జిల్లాలో సగం మంది కొత్త ముఖాలు ఎన్నికల బరిలో కనిపించే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలను పక్కనపెట్టి కొత్త వారికి టికెట్లు ఇవ్వడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేలు ఎంత వారైనా వారిని పక్కన పెట్టడానికి జగన్ సిద్ధమయ్యారు. ఈ విషయాలను తెలుసుకున్న శాసనసభ్యులలో వణుకు ప్రారంభమయ్యింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *