మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి విజయవాడలో పలు ఆందోళనా కార్యక్రమాలు జరుగుతున్నాయని, తిరుపతి నగరంలో నెలకొని ఉన్న వివిధ రకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో నేతలు మున్సిపల్ కమిషనర్ హరితకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె. వేణుగోపాల్, ఉపాధ్యక్షులు టి. సుబ్రమణ్యం మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి ఇంతవరకూ అమలు చేయలేదని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కోరారు.
తిరుపతిలో పారిశుద్ధ్య కార్మికులందర్నీ పారిశుద్ధ్య పనులకే వినియోగించాలని కార్పొరేటర్లు, అర్హతలేని సిబ్బంది ఇళ్ల వద్ద పనిచేసే కార్మికులను మున్సిపల్ పనులకు వినియోగించాలని, పారిశుద్ధ్య కార్మికులు నివాసమున్న కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్మికులను మోసo చేసి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాత్రుల్లో మహిళా కార్మికులకు డ్యూటీ కేటాయించవద్దని, తెల్లవారుజామున డ్యూటీకి వచ్చే కార్మికులకు టీ, టిఫిన్ సౌకర్యం కల్పించాలని, రాత్రుళ్లు పనిచేసే వారికి టీ తోపాటు స్నాక్స్ కూడా అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు రెండు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వాలని కోరారు.
రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్సులు అమలు చేయాలని కార్మికులందరికీ రెగ్యులర్ గా చెప్పులు, సబ్బులు, కొబ్బరినూనె, యూనిఫార్మ్, గ్లౌజులు ఇవ్వాలన్నారు. కార్మికులకు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి డ్యూటీ లకు పంపేటప్పుడు వాహన సౌకర్యం కల్పించాలని కోరారు. వార్డు సచివాలయం వద్ద మస్టర్ వేయాలని, సమాన పనికి సమాన వేతనం 26 వేల రూపాయలు అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు పి. మునిరాజా, సిఐటియు నాయకులు పి. బుజ్జి, పి చిన్న ఆర్. మల్లికార్జున రావు, డి. పార్థసారధి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.