బాబు అరెస్టుతో ఉలిక్కిపడ్డ చిత్తూరు జిల్లా
తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో చిత్తూరు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నిబంధనలు పాటించకుండా చంద్రబాబు నాయుడు అరెస్టు వార్తలు జిల్లా ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. చంద్రబాబు అరెస్టును వివిధ పార్టీల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించారు. నిరసనలు వ్యక్తం చేశారు. ముందస్తు జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లాలో ఆర్టీసీ బస్సులు తిరగలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు సంయమనం పాటించారు. అధినేత ఆదేశాల మేరకు శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేశారు. రాజకీయాలలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండిన నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయగడాన్ని నిరసిస్తున్నారు. 73 సంవత్సరాల వయసు ఉన్న చంద్రబాబు నాయుడును ఉదయం ఆరు గంటలకే అరెస్టు చేయడం, 10 గంటల పాటు ఏకధాటిక ప్రయాణం చేసి విజయవాడ తీసుకెళ్లడం, మధ్యలో తిండి తిప్పలు కూడా ఇవ్వకపోవడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యము వలే తిరిగి వస్తారని, సింహ గర్జన చేస్తారని తెదేపా నాయకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఇది నాంది వాచకమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని పేర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనలకు భారీ సంఖ్యలో ప్రజలు తలలి రావడం, లోకేష్ పర్యటనలకు జనాలు పోటెత్తడంతో రానున్న ఎన్నికలలో గెలవలేమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ధర్మం చంద్రబాబు వైపు ఉందనీ, అయనకు అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నారు.
చిత్తూరులో దొరబాబు, కాజూర్ బాలాజీ, మోహన్ రాజ్, జాఫర్ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. వారు ఉదయం ముంచి ఎవ్వరు చెప్పిన మంచి నీరు కూడా తీసుకోకుండా నిరసన తెలియచేస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్ ను హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్టుతో అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పూతలపట్టు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కలికిరి మురళీమోహన్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గం కర్వేటినగరం పట్టణంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై ఇంచార్జి Dr VM థామస్ శాంతియుత నిరసనలు తెలియచేశారు.
అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రగిలిపోయారు. మదనపల్లెలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులోభాగంగా స్థానిక టమోటా మార్కెట్ యార్డ్ ఎదుట మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తనయులు చాణక్యతేజ, యశస్విరాజ్ లు కార్యకర్తలతో కలిసి నిరసన చేస్తుండగా వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఇందులో 21 మందిపై ప్రివెంటివ్ కేసులు నమోదు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అరుణ్ తేజ్ కార్యకర్తలతో కలసి సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
అలాగే మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ కార్యకర్తలతో కలసి బెంగళూరు బస్టాండ్ లో నిరసన చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అలాగే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దుకాణదారులు ఇతర వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి బంద్ పాటించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. దీంతో మదనపల్లెలో నిర్వహించిన బంద్ ప్రశాంతం, పాక్షికంగా సాగింది.