17, సెప్టెంబర్ 2023, ఆదివారం

డిల్లీ పెద్దల కనుసన్నల్లోనే బాబు అరెస్టు జరిగిందా?

చంద్రబాబు అరెస్టుపై స్పందించని కేంద్ర పెద్దలు 

బాసటగా నిలుస్తున్న INDIA కూటమి నేతలు  

బాబుకు మద్దతు ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు 


తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టులో  కేంద్ర పెద్దల పాత్ర ఉందని దేశం పార్టీలో, రాష్ట్ర ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  జాతీయ స్థాయి నాయకుడు అరెస్టు అయితే ఇంతవరకు భారతీయ జనతా పార్టీ తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తొలుతా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించినా, తర్వాత నోరు మెదపలేదు. కేంద్ర పెద్దల ఆదేశాలతోనే  పురందేశ్వరి మౌనం వహించారని సమాచారం. అలాగే తెదేపా, జనసేన బందులో కూడా భారతీయ జనతా పార్టీ పాల్గొనలేదు. పైగా  తాము బందుకు దూరం అంటూ,  ఎవరు బందులో ఎవరూ పాల్గొనకూడదంటూ పురందేశ్వరి ఒక ప్రకటన విడుదల  చేశారు. తెలంగాణలోని బిజెపి నాయకులు కిషన్ రెడ్డి, ఈటెల రాజేంద్ర మాత్రం చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఈ తతంగమంతా చూస్తున్న ప్రజలకు కేంద్ర బిజెపి అగ్ర నేతల కనుసన్నల్లోనే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందని అనుమానాలు వస్తున్నాయి.




NDA ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఎన్డీఏ కూటమి నుంచి వెలుపలకు వచ్చింది. రాష్ట్రమంతటా ఆత్మగౌరవ సభలు పెట్టి బిజెపి పెద్దలను తెలుగుదేశం పార్టీ నాయకులు దుమ్మెత్తి పోశారు. బిజెపి నేతలను వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. ఒక అడుగు ముందుకు వెళ్లి తల్లి, పెళ్ళాంను పట్టించుకోని  నాయకుడు దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని ప్రశ్నించారు. అమిత్ షా తిరుపతి పర్యటనకు వస్తే తెదేపా  నేతలు అమిత్ షా వాహనం మీద దాడి చేశారు. రాళ్ల దువ్వారు. హోం మంత్రి హోదాలో అమిత్ షాకు గోర అవమానం జరిగింది. ఇది చాలదు అన్నట్లు NDAకు వ్యతిరేకంగా UPA కూటమిలో చేరారు. ప్రతిపక్షాలను ఏకం చేయడానికి కృషి చేశారు. వీటిని  దృష్టిలో పెట్టుకున్న BJP  నేతలు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్ కు అండగా నిలచారు. జగన్ అవసరం బిజెపికి ఉండటం, బిజెపి అవసరం జగన్ కు ఉండటంతో చంద్రబాబుకు శత్రువు కాబట్టి వీళ్ళిద్దరూ తేలిగ్గా కలిసి పోయారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడును, తెదేపాను రాజకీయంగా పతనం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ కు  దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ  నామరూపాలు లేకుండా పోవాలని అన్నట్టు సమాచారం. అందుకు అవసరం అయిన సహాయ సహకారాలు కేంద్రం నుంచి ఎల్లప్పుడూ ఉంటాయని అభయ హస్తం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీలోని విలేకరుల సమావేశం పెట్టి చంద్రబాబు అవినీతిని వెలికి తీస్తామని, చంద్రబాబును జైలుకు పంపుతామని జగన్ ప్రకటించారు. జగన్ చెప్పిందే తడవుగా మంత్రులతో ఒక కమిటీని కూడా వేశారు. చంద్రబాబు అవినీతి గురించి జల్లెడ పట్టారు. సాంకేతికంగా చంద్రబాబు ఎక్కడ దొరకలేదు. అయితే మాజీ మంత్రులను, తెలుగుదేశం పార్టీ నాయకులను చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు జగన్ కు ఒక వరంలా మారింది. డిల్లీ పెద్దల కళ్ళలో ఆనందం చూడటానికే  ఈ కేసులో నిబంధనలు పాటించకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసినట్లు  ప్రజలు భావిస్తున్నారు.




చంద్రబాబు అరెస్ట్ లో ఢిల్లీ పెద్దల పాత్ర కూడా ఉన్నందుకే మాట్లాడడం లేదని టిడిపి సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అనుమానం వ్యక్తం చేశారు.  ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు బిజెపి పెద్దలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై కేంద్ర పెద్దలు ఎందుకు మౌనం పాటిస్తున్నారని,  రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారి పనిచేస్తున్నా, ఎందుకు స్పందించడం లేదని అయ్యన్న నిలదీశారు. ఏపీలో ఏం జరిగినా  మీరు పట్టించుకోరా అంటూ ఆయన ప్రశ్నించారు. కేంద్ర బిజెపి పెద్దల సహకారంతోనే చంద్రబాబు అరెస్టు జరిగిందని, లేకపోతే జగన్ అంతటి సాహసానికి ఒడిగట్టరనే అనుమానం టిడిపిలో కలుగుతుంది. ఇప్పటికే బిజెపితో పొత్తు కోసం టిడిపి ప్రయత్నించి విఫలమైంది. వచ్చే ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన కూటమిగా వెళ్లి వైసిపిని ఎదుర్కోవాలనే ప్రతిపాదనను టిడిపి అధినేత చంద్రబాబు కేంద్ర బిజెపి పెద్దల వద్ద ప్రస్తావించినా, వారి నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో కేంద్రం పాత్ర పై టీడీపీ అనుమానంతో ఉంది. 


అయితే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై బీజేపీ వ్యతిరేక కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా స్వరం పెంచుతున్నాయి. ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. మొదట కమ్యూనిస్టులు, కాంగ్రెస్ స్ధానిక నేతలు ఖండన ప్రకటనలు చేయగా, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ బహిరంగ ప్రకటనతో ఇండియా కూటమి వ్యూహానికి పదును పెట్టారు. ఎలాంటి విచారణ లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం అక్రమమంటూ ప్రకటించారు.  ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ట్రెండ్‌గా మారిందని చంద్రబాబును ట్యాగ్ చేస్తూ యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా బాబు బీజేపీకి దూరంగా జరగాలని సూచించారు. ఇవన్నీ గమనిస్తే బీజేపీతో స్నేహం కోసం ప్రయత్నిస్తున్న బాబును తమవైపు లాగేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి చురుగ్గా పావులు కదువుతున్నట్లే కనిపిస్తోంది. 


ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఆయన మిత్రుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. నారా లోకేశ్ కు రజనీకాంత్ ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనోనిబ్బరంతో ఉండాలని లోకేశ్ కు ధైర్యం చెప్పారు. తన మిత్రుడు చంద్రబాబు పోరాటయోధుడుగా పేర్కొన్నారు.  త్వరలోనే ఆయన జైలు నుంచి బయటకు వస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు రక్ష అని రజనీకాంత్ చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసిన వారికి పుట్టగతులు ఉండవంటూ సినీ నిర్మాత అశ్వినీదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు  వీడియోను విడుదల చేశారు. ఈ దేశానికి గొప్ప ప్రధాని, స్పీకర్‌తోపాటు గొప్ప రాష్ట్రపతిని అందించిన ఘనత చంద్రబాబుదని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేకపోయిన దుర్మార్గకరంగా అరెస్టు చేసి లేనిపోని విమర్శలు చేస్తున్నారని, వారెవరికి పుట్టగతులు ఉండవని అన్నారు. చంద్రబాబుపై తప్పుడు అబాండాలు వేసి జైలుకు పంపించిన వారికి త్వరలో గుణపాఠం తప్పదని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 175 సీట్లకు 160 సీట్లను గెలుచుకొని మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అశ్వనీదత్ దీమా వ్యక్తం చేశారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *