16, సెప్టెంబర్ 2023, శనివారం

ఫుల్ జోష్ లో తెలుగు తమ్ముళ్లు


తెలుగు తమ్ముళ్లు మంచి జోష్ మీద ఉన్నారు. జనసేన, తెదేపా పొత్తు ఖరారు కావడంతో తెదేపా నాయకుల, కార్యకర్తల ఆనందానికి అవధులు లేదు. రానున్న ఎన్నికలలో గెలుపు 100 శాతం తమదే అన్న ధీమా వ్యక్తం అవుతోంది. ఆరు నూరైన మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగు పెడుతారన్న ఆనందోత్సాహాలతో పార్టీలు చేసుకుంటున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ కలవడంతో తమ విజయాన్ని దేవుడు కూడా ఆపలేడన్న ధీమాకు పార్టీ క్యాడర్ వచ్చేసింది. ఇక ఎన్నికలు రావడంమే తరువాయి అని ఎదురుచూస్తున్నారు. అధికారాన్ని చేపట్టిన తర్వాత ఎవరెవరి మీద కక్ష తీర్చుకొవాలో జాబితాలు సిద్ధం చేసుకుంటున్నారు. అధికారుల ముందర అప్పుడే దర్పం ఒలకబోస్తున్నారు. ఎప్పటికైనా తీరు మరకుంటే, భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. అసెంబ్లీ టిక్కెట్ల కోసం కలుగులోని నాయకులు కూడా క్యూ కడుతున్నారు.


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా తయారు అయ్యాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు ఉంటుందని ప్రకటించిన్నప్పటి నుంచి రెండు పార్టీలలో జోష్ కనిపిస్తోంది. బిజెపి కూడా కలసి వస్తుందన్న విశ్వాసం కనిపిస్తోంది. దీనితో ఊరూరా టిడిపి జనసేన నాయకులు, కార్యకర్తలు ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకుంటున్నారు. టిడిపి చేపట్టిన  రిలే నిరాహార దీక్షల్లో కొందరు జనసేన నేతలు పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారు. తిరుపతిలో టిడిపి ఇంచార్జి సుగుణమ్మ, జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మదనపల్లిలో రామదాసు చౌదరి నేతృత్వంలో ఒకడుగు ముందుకు వేసి ఒకరి కండువాలు ఒకరు మార్చుకున్నారు. జి డి నెల్లూరు నియోజక వర్గంలో జనసేన ఇంచార్జి పోన్న యుగంధర్ టిడిపి ఇంచార్జి డాక్టర్ థామస్ పక్కన కూర్చుని నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. ఇలా ప్రతి చోట ఇరు పార్టీల కార్యకర్తలు చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. 

రెండు పార్టీలు కలవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పూర్వ వైభవం సాధిస్తామని టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జన సేన విడిగా పోటీ చేయడం వల్ల రాష్ట్రంలో టిడిపి ఓడిపోయిందని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రం అధికారం పోగా చంద్రబాబు స్వంత జిల్లాలో ఆయన తప్ప మిగిలిన అన్ని స్థానాలలో ఓటమి పాలయ్యారు. 1983,1994 ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న 15 స్థానాలలో టిడిపి 14 స్థానాలు దక్కించుకున్నది. తరువాత జరిగిన ఎన్నికల్లో కూడా ఆటు ఇటుగా  టిడిపికి సగం సీట్లు వచ్చాయి. 2014 లో జిల్లాలో టిడిపికి ఆరు, వైసిపికి 8 స్థానాలు వచ్చాయి. అయితే 2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు గెలవగా మిగిలిన 13 చోట్ల వైసిపి అభ్యర్ధులు విజయం సాధించారు. ఇప్పుడు జనసేన కలవడంతో జిల్లాలో అన్ని  స్థానాల్లో విజయం సాధిస్తామని టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *