పెద్దిరెడ్డి భాధితులకు ఏదీ భరోసా ?
చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన సందర్భంగా అంగళ్లు, పుంగనూరు గొడవల్లో ఎదురొడ్డి నిలబడ్డ తెలుగుదేశం పార్టీ వీర సైనికులకు భరోసా కరువయ్యింది. పుంగనూరులో, అంగళ్లలో గొడవలు జరిగి నెలరోజులు దాటుతోంది. ఇంతవరకు రాష్ట్రస్థాయి నాయకులు ఎవరు ఈ నియోజకవర్గాలలో పర్యటించలేదు. YCP నాయకుల దాడిలో గాయపడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులను పరామర్శించిన పాపానపోలేదు. వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించలేదు. గత నెల నాలుగో తారీఖున అంగళ్లు, పుంగనూరు వద్ద నారా చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగిన విషయం పాఠకులకు విదితమే. ఈ సంఘటనలో వందలాది మంది తెలుగుదేశం పార్టీ వీర సైనికులు పార్టీకి అండగా నిలబడ్డారు. దెబ్బలు తిన్నారు. రక్తం చిందించారు. రక్త గాయాలతో ఆస్పత్రిలో చేరారు. తిరిగి పోలీసులు వారి మీదనే కేసులు బనాయించారు. ఇప్పటికీ వందమందికి పైగా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి జైళ్ళకు తరలించారు. మిగిలిన వారు చెట్టుకొకరు, పుట్టకొకరుగా పారిపోయారు. నెలరోజుల నుంచి కార్యకర్తలు అజ్ఞాతవాసంలో ఉంటున్నారు. వారి కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గాలలో పార్టీ అగ్రనేతలు పర్యటించడానికి కూడా భయపడుతున్నారని తెదేపా కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీ కోసం నిలబడ్డ తమను ఇలాగేనా ఆదుకునేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము నెల రోజులకు పైగా కుటుంబసభ్యులను వదిలి ఎక్కడో తలదాచుకుంటున్నామని, మా కుటుంబ సభ్యులకు భరోసా ఏదని ప్రశ్నిస్తున్నారు. నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించాలని కోరుతున్నారు. లేకుంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని, ఫలితంగా ఈ ప్రభావం రానున్న ఎన్నికలలో పార్టీ విజయవకాశాల మీద పడుతుందని అంటున్నారు.
బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ శుక్రవారం నుంచి రాష్ట్రంలో 45 రోజుల పర్యటన ప్రారంభించారు. అయితే పుంగనూరు ఇతర కేసుల్లో ఇరుక్కున్న అమాయక కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకుడే కరువయ్యాడు అంటూ పరువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు నాలుగవ తేదీన చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చిన నేపథ్యంలో తలెత్తిన సంఘటనలు అందరికీ తెలుసు. పోలీసులపై కుట్రపన్ని, టిడిపి నాయకులు, కార్యకర్తలు దాడులు చేశారని పోలీసుల కేసులు పెట్టారు. చంద్రబాబు సహా 500 మందిని వివిధ కేసుల్లో నిందితులుగా చేర్చారు. 100 మంది పైగా అరెస్టై జైళ్లలో ఉన్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. వీరితో పాటు కేసులకు భయపడి మరో 500 మంది ఊర్లు వదలి పారి పోయారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానీకి ముందస్తు బెయిలు వచ్చినా నెలరోజులు జిల్లాలో ప్రవేశించరాదు. చల్లా రామచంద్రా రెడ్డికి నాలుకు కేసుల్లో ఊరట లభించింది. అయితే మరో మూడు కేసుల్లో బెయిలు రాలేదు. ఈ నేపథ్యంలో పుంగనూరు బాధితులను పరామర్శించి భరోసా కల్పించే దిక్కు లేదని కార్యకర్తలు అంటున్నారు. నెల తరువాత మాల్యాద్రి ఇతర నాయకులు వచ్చి కంటి తుడుపు చర్యలు చేపట్టారని అంటున్నారు. పరిశీలకులు దంపూరి భాస్కర్ ( పుంగనూరు), సూరా సుధాకర్ రెడ్డి ( పీలేరు), రెడ్డివారి గురువా రెడ్డి ( తంబళ్లపల్లె) బాధితులను గుర్తించడంలో సహకరించారు.ఇప్పటి వరకు ఒక్క నాయకుడు కూడా పుంగనూరు వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై విమర్శ చేసిన దాఖలాలు లేవు. మాల్యాద్రి కూడా పుంగనూరు రావడానికి భయపడి మదనపల్లెలో సమావేశం పెట్టడం విమర్శలకు తావిస్తోంది.
తమ్ముళ్ళకు ఆర్థిక భరోసా!
ఎట్టకేలకు పుంగనూరు, అంగల్లు దాడుల కేసుల్లో ఇరుకున్న బాధితుల సహాయం కోసం టిడిపి నేతలు రంగంలోకి దిగారు. జాతీయ అధికార ప్రతినిధి, నాలెడ్జి కమిటీ చైర్మన్ మాల్యాద్రి నేతృత్వంలో బాధితులను గుర్తించి సహాయం అందిస్తున్నారు. ఆయన గత రెండు రోజులుగా మదనపల్లెలో రాష్ట్ర, ఉమ్మడి జిల్లా నాయకులతో చర్చలు జరిపి కేసుల్లో ఉన్న కుటుంబాల వివరాలు సేకరిస్తున్నారు. పుంగనూరు, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లె నియోజక వర్గాల పార్టీ ఇంచార్జిలు, ముఖ్యమైన నేతలను కలసి బాధితుల జాబితా తయారు చేస్తున్నారు. మొదటి విడతలో వివిధ కేసుల్లో పేర్లు ఉన్న 500 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. నేరుగా వారి అకౌంట్లో డబ్బు వేస్తున్నట్టు తెలిసింది. రెండవ విడతలో కేసులకు భయపడి గ్రామాలు వదిలి వెళ్లి పోయినా వారిని గుర్తించి తగిన ఆర్థిక సాయం అందిస్తారని తెలిసింది.
చల్లాకు చెల్లు చీటీ
పుంగనూరు నియోజక వర్గం ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి (బాబు)ను ఇంచార్జి పదవి నుంచి తొలగిస్తారని సమాచారం. చంద్రబాబు ఆయన పట్ల అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు.ఈ నేపథ్యంలో సొమల సురేష్ (బలిజ), అనీషా రెడ్డి లలో ఒకరికి ఇంచార్జి పదవి రావచ్చు అంటున్నారు.
NOTE
👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న Contact information for Chittoor News ద్వారా తెలియచేయగలరు.
👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.
👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.
👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.
👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.