14, సెప్టెంబర్ 2023, గురువారం

జిల్లా తెదేపాలో ఆ ఒక్క మగాడు ఎక్కడ?


తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మంత్రులు రోజూ అవాకులు, చవాకులు పేలుతున్నారు. బాబును  కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. బాబు అరెస్టు నేపధ్యంలో  సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు జీవితాంతం జైల్లోనే ఉంటారని పరిహాసం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని హేళన చేస్తున్నారు.  అయినా తెలుగుదేశం పార్టీలో  నాయకులు ఎవరూ వారికీ ధీటుగా  స్పందించడం లేదు. మంత్రి పెద్దిరెడ్డి, రోజా, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిలకు దీటుగా సమాధానం చెప్పడం లేదు. విమర్శలు చేయడం లేదు. ఉహించని విధంగా జిల్లాలో విచిత్రమైన పరిస్థితిలు నెలకొన్నాయి. అంగళ్లు, పుంగనూరు కేసులలో జిల్లాలో ముఖ్యమైన నాయకులు అమరనాధ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డిలు అజ్ఞాతంలో ఉన్నారు. వారికి ఇంకా బెయిల్ రాలేదు. మిగిలిన వారు వారి నియోజకవర్గాలకు మాత్రం పరిమితం అవుతున్నారు. ఆందోళనలు, దీక్షలు నిర్వహిస్తున్నారు తప్ప మంతుల విమర్శలను తిప్పికొట్టడం లేదు. జిల్లాలో ఉన్న రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కూడా తమకు ఎందుకులే అన్నట్టు ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారు. ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ, తాముకూడ ఆందోళన కార్యక్రమాలలో ఉన్నామని, ఫోటోలు తీసి అధిష్టానానికి పంపుతున్నారు. జిల్లాలో నిజమైన నాయకత్వం కొరవడిందని, జిల్లా తెలుగుదేశం పార్టీని ఏకతాటి పైన నడిపే నాయకత్వం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు ఆరంభం మాత్రమే. చంద్రబాబుపై ఇంకా పలు కేసులు పెడతామని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు  భయం అంటే ఏమిటో తెలిసి వచ్చింది అన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన రోజు మరో మంత్రి ఆర్ కె రోజా టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబును అవినీతి చక్రవర్తిగా అభివర్ణించారు. లోకేష్ కు జైలు తప్పదని హెచ్చరించారు. చంద్రబాబుకు జీవితాంతం జైలు తప్పదని ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామి జోస్యం చెపుతున్నారు. చంద్రబాబు అవినీతిలో పుట్టి పెరిగారు అంటూ హేళన చేస్తున్నారు. చంద్రబాబు స్వంత జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఆయనపై ప్రతి రోజూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు.అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబును ఈ సారి కుప్పంలో ఓడిస్తామని సవాళ్లు విసురుతున్నారు.



జిల్లా మంత్రులు ఇతర నేతలు చంద్రబాబును అవినీతి పరుడు అంటూ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే ఒక్క మగాడు  టిడిపిలో కనిపించడం లేదు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధుల అవినీతి, అక్రమాలపై నోరు మెదపడం లేదు. సమావేశాలు, వాట్సప్ గ్రూపుల్లో పోటోలు, నిరాహార దీక్షలకు పరిమితం అయ్యారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కుప్పం నియోజక వర్గం భాధ్యత చూస్తున్న ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు జి నరసింహ యాదవ్ కేవలం సభలు సమావేశాలకు పరిమితం అయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి. రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజక వర్గం టిడిపి ఇంచార్జి గాలి భాను ప్రకాష్ ఆమెపై విమర్శల దాడి చేయలేక పోతున్నారు. ఆయన తండ్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు నిరంతరం మీడియాలో ప్రత్యర్ధులను చీల్చి చెండాడి నిద్రపట్టకుండా చేసే వారు. 


ఉప ముఖ్య మంత్రి నారాయణ ఎమ్మెల్యేగా ఉన్న జి డి నెల్లూరు నియోజక వర్గం ఇంచార్జి డాక్టర్ థామస్ చుట్టపు చూపుగా నియోజక వర్గానికి వచ్చి పోతున్నారు. స్వామిపై విమర్శలు చేయడానికి భయపడుతున్నారు. అయితే ఆ నియోజక వర్గం జనసేన ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ మాత్రం స్వామిపై వీరోచితంగా పోరాడుతున్నారు. అదే నియోజక వర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి కందకు లేని దురద కత్తికి ఎందుకు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పెద్దిరెడ్డి నియోజక వర్గమైన పుంగనూరు టిడిపి ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి కేసుల్లో అరెస్టయి కడప జైలులో ఉన్నారు. అక్కడి ఇంచార్జి దంపూరి భాస్కర్ పెద్దిరెడ్డి పేరు ఎత్తే స్థితిలో లేరు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి అమరనాద రెడ్డి అంగళ్లు, పుంగనూరు కేసులకు భయపడి అజ్ఞాతంలో ఉన్నారు. బయటి నుంచి మీడియాకు  ప్రకటనలు పంపే అవకాశం ఉన్నప్పటికీ భయపడుతున్నారు. 


పుంగనూరు, అంగల్లు సంఘటనల్లో 500 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. ఇందులో 177 మంది అరెస్టు అయ్యారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. తాజాగా పీలేరు నియోజక వర్గానికి చెందిన 169 మందిని కేసుల్లో చేర్చినట్లు తెలిసింది. నిరసన దీక్షలు చేపట్టిన వారిపై కూడా హత్యానేరం మోపి జైళ్లకు పంపుతున్నారు. శ్రీకాళహస్తిలో 16 మంది, తిరుపతిలో నలుగురు రిమాండ్ లో ఉన్నారు. కుప్పంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ ను ఏ1 ముద్దాయిగా పేర్కొంటూ 34 మంది మిద కేసులు పెట్టారు. నలుగురిని అరెస్టు చేసి జైలుకు పంపారు. చిత్తూరులో కాజూరు బాలాజీ, కాజూరు రాజేష్ తో సహా 6 మంది మీద కేసు నమోదు చేశారు. పూతలపట్టు నియోజకవర్గంలో ఇన్ చార్జీ మురళీమోహన్ సహా 14 మంది మీద 5 కేసులు పెట్టారు. బందు రోజు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో టిడిపి నేతలు నోరు తెరవాలన్నా, బయటికి రావాలన్నా భయపడుతున్నారు. కార్యకర్తలకు భరోసా కల్పించవలసిన అగ్ర నాయకులలో కొందరు భయం వల్ల విమర్శలు చేయలేక పోతున్నారు. కొందరు వైకపా నేతలతో లాలూచీ పడ్డారని అంటున్నారు. చంద్రబాబు స్వంత జిల్లాలోనే పార్టీ పరిస్తితి ఇంత దారుణంగా ఉండటం పట్ల పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు.


NOTE

👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న CONTACT  US ద్వారా తెలియచేయగలరు. 

👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.

👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.

👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.

👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *