6, సెప్టెంబర్ 2023, బుధవారం

చిత్తూరు టిడిపిలో ఒక శకుని, ఒక శల్యుడు !?


                           


చిత్తూరు జిల్లాలో ఇద్దరు కోవర్టుల వల్ల టిడిపి ప్రతిష్ట దిగజారి పోతోందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుర్తించారు. తన స్వంత జిల్లాలో పార్టీ చతికిల పడటానికి గల కారణాలను ఆయన గుర్తించారు. ముఖ్యమైన పార్టీ నేతలు, రాబిన్ శర్మ బృందం నివేదికలు తెప్పించారు. తాను నమ్మిన కొందరు పార్టీకి తీరని ద్రోహం చేశారని తెలుసుకున్నారు. టిడిపి ప్రారంభించిన తరువాత 1983లో జరిగిన ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 15 స్థానాలలో  టిడిపికి 14 స్థానాలు వచ్చాయి. అలాగే 1994 లో కూడా పార్టీ 14 చోట్ల విజయం నమోదు చేసుకున్నది. అయితే తరువాత రాను రాను ఐదారు స్థానాలకు పరిమితం అయ్యింది. 2014 ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలలో టిడిపికి ఆరు స్థానాలు వచ్చాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి  వచ్చినప్పటికి స్వంత జిల్లాలో సీట్లు తగ్గాయి. 14 ఏళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన తరువాత జిల్లాలో  చంద్రబాబు ఒక్కరే గెలిచారు. మిగిలిన 13 చోట్ల వైసిపి అభ్యర్ధులు గెలవడం గమనార్హం. దీనిని ఆసరాగా తీసుకుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చంద్రబాబును చులకన చేసి మాట్లాడుతున్నారు. స్వంత జిల్లాలో చంద్రబాబు నాయకత్వంలో ఒక సారి కూడా మెజారిటీ సీట్లు రాలేదని ఎద్దేవా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కూడా కుప్పంలో ఓడిస్తామని సవాలు విసురుతున్నారు. 


ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీ దిగజారడం కారణాలను విశ్లేషించారు. సీనియర్ నాయకుడు ఒకరు  శకుని పాత్ర పోషిస్తున్నారని పసిగట్టారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఆయన, మిగిలిన నాయకులను అణచివేసి పార్టీకి దూరం చేస్తున్నారని తెలుసుకున్నారు. ఆయన నిర్వాకం వల్లనే మాజీ రాజ్యసభ సభ్యురాలు ఎన్ పి దుర్గ, మాజీ లోక్ సభ సభ్యుడు ఎన్ పి చెంగల్రాయ నాయుడు కుటుంబాలు పార్టీకి దూరం అయ్యాయి. మాజీ ఎమ్మెల్యే సి కె బాబు పార్టీకి దగ్గర కాలేక పోతున్నారు.  జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గీర్వాణి, ఆమె భర్త చంద్రప్రకాష్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇంకా పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పార్టీకి దూర దూరంగా ఉన్నారు. 


అలాగే మరొక కీలక నేత శల్య సారధ్యం వహిస్తున్నారని చంద్రబాబు గుర్తించారు. ఆయన నిర్వాకం వల్లనే పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు దెబ్బ తిన్నాయని తెలుసుకున్నారు. ఆయన వల్ల మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి పార్టీ క్రియాశీల కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. జి డి నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజక వర్గాలలో వర్గ పోరు మొదలయ్యింది. ఆయనతో పొసగక పోవడం వల్ల రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అస్త్ర సన్యాసం చేశారు. టివి డిబేట్లలో కూడా పాల్గొనడం లేదు. అలాగే రాష్ట్ర కార్యదర్శి సందీప్ చౌదరి పార్టీకి దూరం అయ్యారు. 


లోకేష్ పాదయాత్ర సందర్భంలో కూడా జన సేకరణ పేలవంగా జరిగింది. అప్పుడే లోకేష్ సమావేశం ఏర్పాటు చేసి ఈ నాయకులను మందలించినట్లు సమాచారం. ఈ ఇద్దరు నేతలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డితో  లావాదేవీలు ఉన్నాయన్న విషయం కూడా చంద్రబాబు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేసిస్తున్నట్టు తెలిసింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *