25, సెప్టెంబర్ 2023, సోమవారం

చిత్తూరు జిల్లా నుండి కూటమి అగ్రనేతల పోటీ !

కుప్పం నుండి చంద్రబాబు మళ్ళి పోటీ 
శ్రీవారి పాదాల చెంతనుండి పవన్ కళ్యాణ్ 
ఇరువురి గెలుపు లాంచనమే అంటున్న నేతలు  
జిల్లాలో అన్ని స్థానాలు గెలువడమే లక్ష్యం 
కూటమి నేతల్లో ఆనందోత్సాహాలు




ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి ఇద్దరు కూటమి పార్టీ అధినేతలు పోటీ చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ పర్యాయం కూడా కుప్పం నుండి పోటీ చేయనున్నారు. అలాగే తిరుపతి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటి చేయనున్నారు. తిరుపతిలో పర్యటించిన  కొణిదల నాగబాబు పరోక్షంగా తెలిపారు. ఇద్దరు అగ్రనాయకులు చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేయనుండడంతో కూటమిలో ఆనందోత్సాహాలు వెల్లులిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో జిల్లా మొత్తం గెలుస్తారన్న ఆశాభావం నేతల్లో కనిపిస్తోంది. రెట్టించిన ఉత్సాహంతో కూటమి కార్యకర్తలు ఎన్నికలకు సిద్దమవుతున్నారు.

కుప్పం నియోజకవర్గం నుంచి 1989లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు పోటీ చేశారు. ఇప్పటివరకు ఏడుసార్లు కుప్పం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే ఈ పర్యాయం చంద్రబాబు ఎలాగైనా ఓడించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులు గెలిపించుకున్నారు. వైసీపీ నుంచి బిసి సామాజి వర్గానికి చెందిన భరత్ ను ఎమ్మెల్సీ చేశారు. ఆయనే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయననే కప్పం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కూడా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు కాకముందు కుప్పంలో చంద్రబాబు నాయుడుకు కొంత ప్రతికూల పరిస్థితుల్లో కనిపించాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం, జనసేన మద్దతు ప్రకటించడంతో చంద్రబాబు నాయుడు గ్రాప్ పెరిగింది. అక్కడ రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విజయం లాంచనమే అవుతుందని కార్యకర్తలు అంటున్నారు.

తిరుపతి నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి గట్టిపట్టు ఉంది. అక్కడినుండి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన చదలవాడ కృష్ణమూర్తికి 12 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.ఇక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ విజయానికి డోకా ఉండదని ఇరు పార్టీ నేతలు భావిస్తున్నారు. నియోజకవర్గంలో టిడిపి జనసేనలకు ఉన్న పట్టు కారణంగా పవన్ కళ్యాణ్ విజయం కూడా లాంచనమేనని భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 గాను 13 స్థానాలను అధికార వైసీపీ పార్టీ కైవసం చేసుకుంది. కుప్పంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గెలుపొందారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో తెలుగుదేశం జనసేన కూటమికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన ఇద్దరు కూటమి అధినేతలు చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేయనుండడంతో ఈ పర్యాయం ఫలితాలు రివర్స్ అవుతాయని పరిశీలకులు భావిస్తున్నారు. జనసేన పార్టీ తిరుపతితో పాటు చిత్తూరు, గంగాధర్ నెల్లూరు, మదనపల్లి స్థానాలను ఆశిస్తోంది. అక్కడ పోటీ చేయడానికి అభ్యర్థులను సిద్ధం చేసుకుంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు. నాలుగు నియోజకవర్గాలు జనసేనకు పోను పది నియోజకవర్గాలలో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను దాదాపుగా పార్టీ ఖరారు చేసింది. 

మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఒకటి రెండు చోట్ల తెదేపా అభ్యర్థుల మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా గెలుపు గుర్రాలను ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీ ఆచితూచి రంగంలోకి దించే అవకాశం ఉంది. వరుసగా మూడు పర్యాయాలు ఓడిపోయిన నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టిని సారించే అవకాశం ఉంది. జిల్లాపై ఎలాగైనా పట్టు సాధించాలని తెలుగుదేశం, జనసేన నాయకులు గట్టి పట్టుదలతో ఉన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *