22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

జిల్లాలో పోటీకి సిద్ధం అవుతున్న జనసేన

రేపటి నుండి తిరుపతిలో నాగబాబు ఆధ్వర్యంలో సమీక్షలు
తిరుపతి, GD నెల్లూరు, చిత్తూరు, మదనపల్లిపై దృష్టి
పార్టీ నిర్మాణం, అభ్యర్థులపై చర్చ



ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. పార్టీ నిర్మాణం, అభ్యర్థుల ఎంపిక సీట్ల సర్దబాటుపై దృష్టి పెట్టారు. టిడిపితో పొత్తు నేపథ్యంలో ఏ ఏ స్థానాలు అడగాలి, ఏ స్థానాల కోసం పట్టు పట్టాలి అన్నది అంశం చర్చిస్తున్నారు. తగిన అభ్యర్థి ఎంపికకు కసరత్తులు చేస్తున్నారు. ఈ అంశాలను మరింత నిర్మాణాత్మకంగా చర్చించడానికి శని, ఆదివారం రెండురోజుల పాటు జనసేన రాష్ట్ర నేత నాగబాబు తిరుపతిలో సమావేశాలు నిర్వహిస్తారు. శనివారం తిరుపతి,శ్రీకాళహస్తి, సత్యవేడు, జి డి నెల్లూరు,చంద్రగిరి, పీలేరు నియోజక వర్గాల నాయకులతో చర్చిస్తారు. ఆదివారం చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లె నేతలతో సమావేశం నిర్వహిస్తారు. 

ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు స్థానాలకు తగ్గకుండా పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. జిల్లాల పున్విభజన తరువాత జిల్లాలోని 14 నియోజక వర్గాలు మూడు జిల్లాలో కలిశాయి. వాటి ప్రకారం పొత్తులో భాగంగా జిల్లాకు ఒక స్థానం అడగాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. మూడు నియోజక వర్గాలలో మూడు సామాజిక వర్గాల అభ్యర్ధులు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. తిరుపతి జిల్లాలో తిరుపతి స్థానం మీద దృష్టి పట్టారు. ఇక్కడ 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన చదలవాడ కృష్ణమూర్తికి 12315 ఓట్లు వచ్చాయి. పైగా ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బలిజ  సామాజిక వర్గానికి చెందిన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్, సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఈ జిల్లాకు చెందిన శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని నియోజక వర్గం ఇంచార్జి వినుత ఆశిస్తున్నారు. 

చిత్తూరు జిల్లలోని జి డి నెల్లూరు రిజర్వడు నియోజక వర్గం కోసం పట్టు పట్టే అవకాశం ఉంది. జిల్లాలో ఈ నియోజక వర్గం ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ బాగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పైగా ఇక్కడ టిడిపి వర్గ పోరుతో సతమతం అవుతున్నది. ఈ నేపథ్యంలో యుగంధర్ కు  అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. చిత్తూరు మీద కూడా కొందరు కన్నేసి ఉన్నారు. DK ఆదికేశవులు కుమారుడు DA శ్రీనివాసులు కోసం కొందరు ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఆయన ఏ విషయం ఇంకా తేల్చలేదు. గతంలో తెదేపా పట్టణ అధ్యక్షుడుగా పనిచేసిన చందుకుమార్ పోటీ చేయడానికి ఆశక్తి కనపరస్తున్నారు. తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరు బలజిని జనసేన నేతలు సంప్రత్తించినట్లు సమాచారం. అయితే తాను చివరి నిమిషం వరకు తెదేపా టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తానని అన్నట్లు తెలిసింది.

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి స్థానం కోసం పట్టు పట్టే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన అభ్యర్ధి గంగారపు స్వాతికి 14601 ఓట్లు వచ్చాయి. ఈ సారి ఆమె కానీ ఆమె భర్త గంగారాపు రాందాస్ చౌదరిలో ఒకరిని రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *