జిల్లా తెదేపాలో మారుతున్న రాజకీయం !
కులాల సమీకరణాలతో మారనున్న అభ్యర్థులు
ఇన్ చార్జీలు కొందరికి నో ఛాన్స్
అనీషా రెడ్డి, ప్రవీణ్ కుమార్ లకు మల్లీ అవకాశం?
తనను కుప్పంలో ఓడిస్తామని అంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన తమ్ముడు ద్వారకనాద రెడ్డిని కట్టడి చేయాలని భావిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న 14 నియోజక వర్గాలలో మూడు స్థానాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు. మిగిలిన 11 స్థానాలలో రెడ్లకు ఐదు, కమ్మ సామాజిక వర్గానికి నాలుగు, బలిజ బిసిలకు ఒక్కో స్థానం ఇవ్వాలని భావిస్తున్నారు. ఒక వేళ జనసేనకు రెండు స్థానాలు ఇవ్వవలసి వస్తే వారు పోటీ పెట్టే అభ్యర్థులను బట్టి టిడిపిలో సామాజిక వర్గాల టికెట్ల కేటాయింపులో చిన్న మార్పులు ఉండవచ్చును.
ఇప్పుడు పార్టీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం మేరకు పెద్దిరెడ్డి ద్వారక నాధ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లె నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిని రంగంలో దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పట్ల వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. మదనపల్లి జనసేనకు కేటాయిస్తారని తెలిసింది. ఇక్కడ రామదాసు చౌదరి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారని భావిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు, పీలేరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పలమనేరులో అమరనాద రెడ్డి పోటి ఖాయంగా తెలుస్తున్నది. పుంగనూరులో ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డికి పుంగనూరు గొడవల తరువాత టిక్కెట్టు కష్టమే అంటున్నారు. ఆయన స్థానంలో తిరిగి అనీషా రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. రామచంద్ర యాదవ్ తో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కాదన లేము అంటున్నారు.
చిత్తూరులో బలిజ సామాజిక వర్గానికి చెందిన కాజూరు బాలాజీ, కటారి హేమలత డి ఎ శ్రీనివాసులు, కమ్మ సామాజిక వర్గం నుంచి జగన్ మోహన్ నాయుడు, చంద్రప్రకాష్, NP జయప్రకాశ్, పులివర్తి నాని పేర్లు వినిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుండి మాజీ MLA CK బాబు టిక్కెట్టును ఆశిస్తున్నారు. పూతలపట్టు ఇంచార్జి డాక్టర్ మురళీ మోహన్, జి డి నెల్లూరు ఇంచార్జి డాక్టర్ థామస్, సత్యవేడు ఇంచార్జి హెలెన్ పట్ల అసమ్మతి వినిపిస్తోంది. పుతలపట్టుకు అనగల్లు మునిరత్నం, సప్తగిరి ప్రసాద్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గంగాధరనెల్లూరు నియోజక వర్గానికి పాలసముద్రం మాజీ MPP, ZPTC రాజేంద్రన్, వెదురుకుప్పం మండలానికి చెందిన గ్యాస్ రవి పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సత్యవేడు నియోజక వర్గంలో ఇన్ చార్జీ కోసం ముడుపులు చేతులు మారిన తరువాత అభ్యర్థి విషయంలో మార్పు వచ్చినట్లు సమాచారం. JD రాజశేఖర్ పేరు పరిశీనలోకి వచ్చినట్లు తెలిసింది.
శ్రీకాళహస్తిలో ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు మధ్య పోటీ నెలకొన్నది. అక్కడి పరిస్థితి క్రమంగా SCV నాయుడు అనుకూలంగా మారుతున్నట్లు తెలుస్తోంది. నగరిలో ఇప్పటి వరకు ఇంచార్జి గాలి భాను ప్రకాష్ పేరు వినిపిస్తున్నది.అయితే అక్కడ అతని కంటే రాజు, రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థి అయితే మంచిదని కొందరు అంటున్నారు. చంద్రగిరిలో పులివర్తి నాని పేరు వినిపిస్తోంది. అయితే రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఇక్కడ అవకాశం కల్పించమని చంద్రబాబును కోరారు. ఇక్కడ వీలుకాక పోతే నగరిలో పోటీకి సిద్ధపడుతున్నారు. తిరుపతిలో ఇంచార్జి సుగుణమ్మ పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ పోటీ పడుతున్నారు. అయితే ఈ స్థానం కోసం జనసేన పట్టు పడుతున్నట్టు తెలిసింది. జనసేన టిక్కెట్టు కోసం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, నియోజక వర్గం ఇంచార్జి కిరణ్ రాయల్ ప్రయత్నం చేస్తున్నారు.
శ్రీకాళహస్తిలో ఎస్సీవీ నాయుడుకు టిక్కెట్టు ఇస్తే చంద్రగిరి రెడ్డికి ఇస్తారని అంటున్నారు. అలాగే చిత్తూరు కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే నగరిలో రాజుకు అవకాశం దక్కే అవకాశం ఉంది. తిరుపతిలో టిడిపి అయినా జనసేన అయినా బలిజ సామాజిక వర్గానికే అవకాశం ఉంటుంది. కులాల వారిగా చూస్తే కుప్పం, చిత్తూరు, చంద్రగిరి, మదనపల్లె, నగరి, శ్రీకాళహస్తి నియోజక వర్గాలలో నాలుగు కమ్మ సామాజిక వర్గానికి దక్కే అవకాశాలు ఉన్నాయి. పీలేరు, పలమనేరు, పుంగనూరు, తంబళ్లపల్లె, శ్రీకాళహస్తి, నగరిలో ఐదు చోట్ల రెడ్లకు అవకాశం ఉంటుంది. తంబళ్లపల్లె, నగరిలో ఒకటి బీసీకి, చిత్తూరు, తిరుపతిలో ఒకటి బలిజ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని నియోజక వర్గాలకు రెండు మూడు పేర్లు పరిశీలిస్తున్నారు.