బాబుకు బెయిలు మరింత ఆలస్యం .. !?
జైలు నుండి తొందరగా బయటపడాలని ఆరాటం
బాబుపై మరిన్ని కేసులకు జగన్ వ్యూహం
లోకేష్, పవన్ అరెస్టుకు రంగం సిద్దం
ప్రత్యామ్యాయ ఏర్పాట్లపై ఇరుపార్టీల కసరత్తు
రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు.. ఆయన జీవితంలోనే అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేసుల మీద కేసులు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఇప్పటికే 17 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారాయన. స్కిల్ స్కామ్ కేసు నుంచి ఎలా బయటపడాలా అని.. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలపట్టుకుంటున్నారు. కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లతో ఈ కేసు ముందుకెళ్తుంటే.. మరికొన్ని కేసులు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. ఆ కేసులకు సంబంధించిన పలు పిటిషన్లు రేపు విచారణకు రాబోతున్నాయి. వాటిల్లో చంద్రబాబుకు ఊరట దక్కుతుందని తెదేపా నాయకులూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే చంద్రబాబుపై వీలైనన్ని ఎక్కువ కేసులు మోపి ఎన్నికల వరకు జైలులోనే ఉంచాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ ను, అధికారుల విధులకు ఆటంకం కలుగచేసినందుకు పవన్ కళ్యాణ్ ను అరెస్టు చేస్తారని ఉహిస్తున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా లోకేష్ ను మంగళవారం CID అధికారులు చేర్చారు. ఈ మేరకు ACB కోర్టులో మేమో దాఖలు చేశారు. అరెస్టులు జరిగితే ప్రత్యామ్యాయ ఏర్పాట్ల గురించి ఇరుపార్టీల నేతలు ఆలోచిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో చంద్రబాబు వేసిన అన్ని పిటిషన్లలోనూ ఆయనకు ప్రతికూలంగా తీర్పు వచ్చింది. దీంతో సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేస్తున్నారాయన. ఇదిలా ఉంటే మరికొన్ని కేసులను తిరగదోడే పనిలో ఉన్నారు సీఐడీ అధికారులు. విజయవాడ ఏసీబీ కోర్టులోనూ విచారణ ఇవాళ జరిగే పరిస్ధితి లేదు. ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి జస్టిస్ హిమబిందు ఇవాళ ఒక్కరోజు సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ, బెయిల్ కోరుతూ ఆయన లాయర్లు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడనుంది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ, ఏపీ ఫైబర్ నెట్ అక్రమాల కేసుల్లోనూ సీఐడీ చంద్రబాబు పీటీ వారెంట్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపైనా విచారణ వాయిదా పడినట్లే భావిస్తున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారనీ.. ఈ వ్యవహారంలో ఆయన పాత్ర నేరుగా ఉందని సీఐడీ అంటోంది. దీనికి సంబంధించి గతంలో నమోదైన కేసుల్లో విచారణ జరపాలంటూ ఇప్పటికే పీటీ వారెంట్ దాఖలు చేసింది సీఐడీ. అటు ఫైబర్ గ్రిడ్‌లోనూ అవకతవకలపైనా బాబును ఎంక్వైరీ చేయాలంటూ పీటీ వారెంట్ దాఖలైంది. ఈ రెండు పిటిషన్లపై ఏసీబీ కోర్ట్ విచారణ జరపనుంది. ఇక చంద్రబాబుకు బెయిల్ పిటిషన్ పైనా ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.
సుప్రీం కోర్టులో కూడా చంద్రబాబుకు తక్షణం ఉరట వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. చంద్రబాబు మీద కేసును కొట్టివేయాలని సుప్రేం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లో బాబు పాత్ర ఉందని సీఐడీ వాదిస్తుంటే.. రాజకీయ కక్షలో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారని పిటి వారెంట్ పేరుతో కస్టోడియల్ ఎంక్వైరీకి ఇవ్వొద్దంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. మరోవైపు సుప్రీం కోర్టులోనూ కీలక విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాలు చేస్తూ.. రిజిస్ట్రీలో పిటిషన్ కాపీని చంద్రబాబు తరపు లాయర్లు అందజేశారు.
ఇది కూడా రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ భేటీ కాబోతోంది. ఈ నేపథ్యంలో మిగతా కేసుల్ని రిజిస్ట్రీ ఇవాళ లిస్ట్ చేయలేదు. అయితే చంద్రబాబు కేసుపై అత్యవసర విచారణ కోరుతూ ఆయన లాయర్లు సీజేఐకి ఓ మెమో సమర్పించారు. దీంతో సీజేఐ ధర్మాసనం దీనిపై ఓ నిర్ణయం తీసుకోనుంది. అయితే ఇవాళ్టికి ఇవాళ విచారణ జరిపి నిర్ణయం ప్రకటించే అవకాశాలు లేకపోవడంతో చంద్రబాబుకు వెయిటింగ్ తప్పేలా లేదు.
మరోవైపు ఎల్లుండి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగకపోతే అక్టోబర్ 3వ తేదీ వరకూ ఎదురుచూడక తప్పదు. దీంతో చంద్రబాబు లాయర్లు సీజేఐని కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో రేపైనా చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో విచారణకు వస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. అప్పటివరకూ ఈ ఉత్కంఠ తప్పదు. దీంతో ఆయా పిటిషన్లపై ఎలాంటి తీర్పు రాబోతుందని తెలుగు రాష్ట్రాలలోని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.