పెద్దిరెడ్డి ప్రతిష్ఠ పెరిగింది.. చంద్రబాబు పట్టు సడలింది..,
పుంగనూరు, అంగళ్లు సంఘటనల వల్ల జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి ప్రతిష్ట పెరిగింది. మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు జారింది. అనుకోకుండా జరిగిన రాళ్ల దాడులు వైకాపాకు కలసి రాగా, టిడిపి నేతలను కలచి వేస్తున్నాయి. జిల్లాలో పెద్దిరెడ్డి నాయకునిగా ప్రశంసలు పొందుతున్నారు. ఆయన చేతికి మట్టి అంటకుండా కాగల కార్యం గంధర్వులు చేసినట్టు పోలీసుల టిడిపి నేతలపై కేసులు పెట్టారు. 45 ఏళ్ల విశేష రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మాటలు ఉత్తర ప్రగల్బాలుగా మిగిలాయి. పెద్దిరెడ్డి అంతు కథ తెలుస్తానన్న చంద్రబాబు పత్తా లేకుండా పోయారు. వ్యూహం లేని అవేశం వల్ల వెయ్యిమంది టిడిపి కీలక నేతలు, కార్యకర్తలు భార్యా పిల్లలను వదిలి అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు.
గత నెల నాలుగున చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగల్లు, పుంగనూరులో హింసాత్మక సంఘటనలు జరిగాయి. వైసిపి కార్యకర్తలు చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి అరాచకాలు సృష్టించారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే టిడిపి నాయకులు, కార్యకర్తలు తమపై కక్ష కట్టి దాడులు చేశారని పోలీసులు 500 మందిపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీసులను చంపి లబ్ధి పొందాలని చంద్రబాబు, పుంగనూరు ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి ఇతరులు కలసి కుట్ర పన్ని హత్యా ప్రయత్నం చేశారని కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 110 మందిని అరెస్టు చేసి జైళ్లకు పంపారు. సోమవారం చల్లా రామచంద్రా రెడ్డితో పాటు లొంగిపోయిన 66 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నాని, మరొక నాయకునికి మాత్రం హై కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిలు ఇచ్చింది. చంద్రబాబు బెయిలు పిటిషన్ ను మదనపల్లి జిల్లా కోర్టు తిరస్కరించింది. అలాగే మాజీ మంత్రి అమరనాద రెడ్డి ఇతర నాయకుల బెయిలు పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఇంకా 324 మంది పరారీలో ఉన్నారు. చంద్రబాబు ఒక్కరే బహిరంగంగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని టిడిపి శ్రేణుల్లో ఒక విధమైన నైరాశ్యం నెలకొన్నది.
పెద్దిరెడ్డి అంటే భయం, భయం
ఇదిలా ఉండగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేరు ఎత్తడానికి కూడా జిల్లా నేతలు భయపడు తున్నారు. ఆయన పోలీసులపై ఒత్తిడి తెచ్చి తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించారని విమర్శలు చేయడానికి ఒక నాయకుడు కూడా సాహసం చేయడం లేదు. సోమవారం చల్లా బాబు లొంగిపోయిన సందర్భంగా పుంగనూరు వచ్చిన బడా నేతలు కూడా పెద్దిరెడ్డిపై విమర్శలు సాహసించలేదు. మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మరో పొలిట్ బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంటు అద్యక్షుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి పోలీసులపై ఆరోపణలు చేశారు తప్ప పెద్దిరెడ్డిపై ఘాటైన విమర్శలు చేయలేదు. ఏదో మాట వరసకు అన్నట్టు పెద్దిరెడ్డికి ఇలాంటివి తగవని చెప్పి వదిలి వేశారు. తిరుపతి ఇంచార్జి సుగుణమ్మ జగన్ అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శ చేసి వదిలేసింది. జాతీయ అధికార ప్రతినిధి మాల్యాద్రి మూడు రోజుల పాటు మదనపల్లిలో ఉన్నప్పటికీ పెద్దిరెడ్డిపై చిన్న విమర్శ కూడా చేయలేదు. రహస్యంగా ఒక పూట కేలవాతిలోని అనీషా రెడ్డి, ఆమె భర్తను కలసి వెళ్ళి పోయారు. మిగిలిన వారు ఎవరు విమర్శలు చేయలేక పోయారు. కొంత మంది నాయకులు భయపడి పుంగనూరు రాలేదని తెలిసింది. రామచంద్రా రెడ్డి అధికారం, గత చరిత్ర తెలిసిన వారందరూ ఆయన పేరు ఎత్తడానికి భయపడుతున్నారు. లోకేష్ పాదయాత్ర సమయంలో పుంగనూరు రావడానికి భయపడి పులిచర్ల మీదుగా వెళ్లి పోయారని, ఇక మేము ఎంత అంటూ ఒక సీనియర్ నాయకుడు వ్యఖ్యానించడం గమనార్హం.
చల్లా బాబుకు భయమే
ఇదిలా ఉండగా చల్లా రామచంద్రా రెడ్డి కూడా పెద్దిరెడ్డిని విమర్శించే సాహసం చేయలేక పోయారు. ఆయన పోలీసులకు లొంగిపోయిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తాను లొంగిపోయానని చెప్పారు. తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు తప్ప పెద్దిరెడ్డిపై ఎలాంటి విమర్శ, సవాలు చేయలేదు. నెల రోజులుగా పరారీలో ఉన్న ఆయన విధిలేక లొంగిపోయారు. ఆయనపై ఏడు కేసులు ఉండగా నాలుగింటికి షరతులతో కూడిన బెయిలు వచ్చింది. మిగిలిన మూడింటికి బెయిలు రాకపోవడంతో గత్యంతరం లేక లొంగిపోయారు.
అలిగిన అధికార ప్రతినిధి :
జిల్లాలో వైసిపి మంత్రులపై ఒంటికాలిపై విమర్శలు చేసే రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి గత కొద్ది రోజులుగా కొందరు నేతలపై అలిగి అస్త్ర సన్యాసం చేసినట్టు సమాచారం. జిల్లాకు చెందిన ఒక వర్గం నాయకులు తనకు అనవసరంగా అవరోధాలు సృష్టిస్తున్నారని ఆయన మిత్రుల వద్ద చెప్పినట్టు సమాచారం. పార్టీ కేంద్ర కార్యాలయంలో కొందరు కూడా కొందరు నాయకులు మీడియాలో తన ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నాలు చేశారని ఆయన చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆయన పూర్తిగా టివి డిబేట్లలో పాల్గొనడం మానేశారు. ఇటీవల పెద్దిరెడ్డిపై విమర్శలు చేయమని పార్టీ పెద్దలు చెప్పినా ఆయన తిరస్కరించినట్టు ప్రచారంలో ఉంది. సోమవారం పుంగనూరు వెళ్లినప్పటికి మీడియాకు దూరంగా ఉన్నారు.
NOTE
👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న Contact information for Chittoor News ద్వారా తెలియచేయగలరు.
👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.
👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.
👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.
👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.