30, సెప్టెంబర్ 2023, శనివారం

ఆరోపణలతో ముగిసిన పాలక మండలి పదవీకాలం !?

అభివృద్ధి కి పెద్దపీట వేసిన పాలక మండలి
అయినా, తప్పని విమర్శలు, ఆరోపణలు, వివాదాలు 
భారీగా అవినీతి ఆరోపణలు 
పదవీకాలం పొడగింపుకు విజయవాడలో పైరవీలు



ఆరోపణలు, వివాదాలు, విమర్శల నడుమ కాణిపాక వరసిద్ధి  వినాయక స్వామి వారి దేవస్థానం పాలకమండలి పదవీకాలం నేటితో ముగిసింది. రెండు సంవత్సరాల పదవి కాలంలో  అభివృద్ధి, వివాదాలు సమపాలల్లో అమలు చేశారనే వాదనను స్థానిక ఉభయ దారులు, భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పనుల్లో  పాలక మండలి సభ్యులు అవినీతి అక్రమాలకు తెరలేపారనే అపవాదును ముటకట్టుకుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా చైర్మన్ స్థాయి వ్యక్తులపై భారీగా అవినీతి ఆరోపణలు రావడం దురదృష్టకరం. అవినీతి ఆరోపణలపై పాలకమండలిని, చైర్మన్ స్థాయి వ్యక్తులను ఉభయదారులు  సత్యప్రమాణానికి పిలవడం మాయని మచ్చ. తాను అందచేసిన విరాళాలను రెండు సంవత్సరాలుగా స్వాహా చేశారని చిత్తూరు చెందిన ఒక విరాళదాత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోక పోవడంతో  పాలకవర్గం నిజాయితిపైన అనుమానాలను రేకెత్తించింది. ప్రధానంగా మునుపెన్నడూ లేని విధంగా తీర్మానాలు చేయడం.. ఉద్దేశపూర్వకంగా.. కక్షపూరిత చర్యలకు పాల్పడినట్లు ఒకవైపు ఆరోపణలు ఉన్నప్పటికీ... నచ్చిన వారిని అందలమెక్కిచ్చేలా వ్యవహార శైలి నడిచిందని మరోవైపు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 

రెండు సంవత్సరాల కాలంలో దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులపైనే కాకుండా, అర్చకుల పైన సైతం కొరడా జలిపించి వారిని ఇంటికి పరిమితం చేశారనే వాదనలు మరోవైపు వినిపిస్తున్నాయి. వంశపారంపర్యంగా ఆలయం ఏర్పడినప్పటి నుంచి పూజలు చేస్తున్న వారిని సైతం కుయుక్తులు పన్ని ఇంటి దారి పట్టించేలా చేశారని అంటున్నారు.  మత్తు పదార్థాలకు బానిసగా మారిన వ్యక్తులను సైతం అందలమెక్కించారనే వాదనలు  స్థానికంగా బలంగా వినిపించాయి. విరాళాలు స్వాహా చేశారని ఒకరిపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేశారు. చిత్తూరు చెందిన ఒక విరాళదాత తమ విరాళాలను రెండు సంవత్సరాలుగా స్వాహా చేశారని  అధికారికంగా ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై చర్యలు తీసుకోక పోవడం పాలకవర్గానికి మచ్చలా మిగిలింది. చర్యలు తీసుకోక పోగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పజెప్పి పదోన్నతి కల్పించడం వివాదాస్పదంగా మారింది. స్వామివారి ఆలయం వద్ద జరిగే కోట్ల రూపాయల టెండర్లు, కుంభాభిషేక అభిషేక సమయంలో  స్వామి వారి పేరుతో అక్రమ విరాళాలు  సైతం స్వాహా చేశారని ఆరోపణలు వచ్చాయి. 

అభివృద్ధి పనుల్లో   పాలక మండలి సభ్యులు అవినీతి అక్రమాలకు తెరలేపి 10 నుంచి 12 శాతం వరకు కమీషన్లు పొందారనే వాదనలు బలంగా వినిపించాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా పాలకమండలి, చైర్మన్ స్థాయి వ్యక్తులపై భారీగా అవినీతి ఆరోపణలు రావడం ఇదే ప్రథమం. దీనికి తోడు సదురు కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ శాఖను నిర్వీర్యం చేసేలా  దేవస్థానం వద్ద చేసిన అభివృద్ధి పనులు నాసిరకంగా ఉన్నాయంటూ ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ చర్యలు లేవు. అలాంటి వారిని కొమ్ము కాసే విధంగా పాలకమండలి వ్యవహరించిందని స్థానికుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. లక్షల రూపాయల కమీషన్ మేర తీసుకొని నాసిరకపు పనులను  ప్రోత్సహించారనేది ఉభాయదరుల ఆరోపణ. వీటన్నిటి పైన కూడా స్థానిక  ఉభయదారుల వ్యవస్థ  సత్య ప్రమాణానికి పాలకమండలిని, చైర్మన్ స్థాయి వ్యక్తులను పిలవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. అభివృద్ధి పనులపై ఏసీబీ అధికారుల విచారణ, శ్వేత పత్రం విడుదల చేయాలని స్థానికులు  డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 

ఏదేమైనప్పటికీ రెండు సంవత్సరాల కాల వ్యవధిలో వివాదాల నిర్ణయాలు, అవినీతి అక్రమాలతో ప్రస్తుత పాలకమండలి అప్రతిష్ట ను మూట కట్టుకుందని స్థానిక ప్రజలు, ఉభయ దారులు, భక్తులు తెలియజేస్తున్నారు. మరోవైపు పాలకమండలి మరో రెండు సంవత్సరాల పాటు కొనసాగించాలని జిల్లా మంత్రివర్యులను సైతం ప్రస్తుత పాలకమండలి విన్నవించింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో  ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మిగిలిన దేవాలయాల్లో సైతం పదవీ కాలాలను పొడిగించాల్సి వస్తుందని... ఇది వ్యతిరేక ఓట్లకు నాంది పలుకుతుందనే ఆలోచనలో అధిష్టానం అవకాశం ఇవ్వడం లేదనే వాదనలు మరోవైపు ఉన్నాయి. ఏదేమనప్పటికీ కాణిపాక దేవస్థానం  రెండు సంవత్సరాల పదవి కాలం  నేటితో ముగిసింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *