జి డి నెల్లూరులో హ్యాట్రిక్ వైపు వైసిపి అడుగులు
ఒక్కటి అయిన సమ్మతి, అసమ్మతి నేతలు
హరికృష్ణ చేరికతో పెరిగిన వైసిపి బలం
ఎంపి మిధున్ రెడ్డి ఆధ్యర్యంలో పక్కా వ్యూహం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో వైసిపి హ్యాట్రిక్ వైపు అడుగులు వేస్తోంది. పునర్విభజన తరువాత ఏర్పడిన నియోజక వర్గంలో మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో ఒక కాంగ్రెస్, రెండు సార్లు వైసిపి అభ్యర్థులు గెలిచారు. 2009 లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ టిడిపి అభ్యర్థి ఆర్ గాంధీపై 10,826 ఓట్ల మెజారిటీ సాధించారు. 2014 లో వైసిపి అభ్యర్థి కలత్తూరు నారాయణ స్వామి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన కుతూహలమ్మ పై 20,565 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019లో వైసిపి అభ్యర్థి నారాయణ స్వామి టిడిపి అభ్యర్ధి డాక్టర్ హరికృష్ణ పై 45,594 ఓట్ల మెజారిటీ సాధించారు. అంటే వైసిపి అభ్యర్థి వరుసగా రెండు సార్లు గెలిచారు. ఈ ఎన్నికల్లో కూడా వైసిపి అభ్యర్థి గెలిస్తే పార్టీ హ్యాట్రిక్ విజయం స్వంత చేసుకుంటుంది. గత ఎన్నికలు, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే వైసిపికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో వేపంజేరి పేరుతో ఉన్న ఈ నియోజక వర్గంలో 1983, 1994 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు గెలిచారు. 1985,1989, 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్టుపై కుతూహలమ్మ గెలిచారు. ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన కుతూహలమ్మ 2014లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. ఆమె కుమారుడు 2019 ఎన్నికల్లో రెట్టింపు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో నియోజక వర్గంలోని అన్ని మండలాలలో టిడిపి కంటే వైసిపి అభ్యర్థికి మెజారిటీ వచ్చింది. జి డి నెల్లూరులో 14265, వెదురుకుప్పం 12512, ఎస్ ఆర్ పురం 5924, కె. నగరం 5675, పెనుమూరు 5211, పాల సముద్రం 2188, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 179 ఓట్లు మెజారిటీ వచ్చింది. వైసిపికి మొత్తం 45,594 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక్కడ వైసిపి అభ్యర్థి గెలుపు కోసం ఆమె తండ్రి ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి, ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి ఇతర స్థానిక నాయకులు గట్టిగా పనిచేస్తున్నారు. రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నియోజక వర్గంపై ప్రత్యెక దృష్టి పెట్టారు. గత ఎన్నికల టిడిపి అభ్యర్థి హరికృష్ణ ఇటీవల జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన ప్రభావంతో టిడిపి లోని కొందరు లోపాయికారి మద్దతు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా టిడిపి అభ్యర్థి డాక్టర్ వి ఎం థామస్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఆయనకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టిబాబు నాయుడు పెద్దదిక్కుగా ఉన్నారు. అయితే అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్, మాజీ కార్య నిర్వాహక కార్యదర్శి ఆముదాల శ్రీహరి, రాష్ట్ర సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి ఎన్ మునిచంద్రా రెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రమేష్ బాబు, బిఎస్పీ అభ్యర్థిగా భాస్కర్, సమాజ్ వాది పార్టీ నుంచి గుణశేఖర్, జనసంఘ్ నుంచి రామ్ రాజ్ బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా కరుణశ్రీ, పద్మనాభం, మధు, రాము, దేవరాజ్ పోటీలో ఉన్నారు. ప్రధానంగా వైసిపి, టిడిపి అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. నియోజక వర్గంలో ఉన్న వర్గాలు, గత ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే వైసిపి అభ్యర్థికే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. అయితే టిడిపి అభ్యర్ధి గెలుస్తామన్న నమ్మకంతో పోటీ పడుతున్నారు.