27, ఏప్రిల్ 2024, శనివారం

హ్యాట్రిక్ ఓటమిలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి


కొత్త అభ్యర్థులతో ఎన్నికల బరిలోకి

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

చిత్తూరు జిల్లాలో వరుసగా మూడుసార్లు తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైన నియోజకవర్గాల మీద తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ నియోజకవర్గాలలో పాత అభ్యర్థులను కాదని కొత్త అభ్యర్థులను రంగం మీదకు తీసుకొని వచ్చారు. పాత అభ్యర్థులను పక్కన పెట్టారు. గెలుపే ధ్యేయంగా కొత్త అభ్యర్థులను బరిలోకి దించి రానున్న ఎన్నికలను ఎదుర్కొననున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన కొత్త ప్రయోగం సత్ఫలితాలు ఇస్తుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశాభవాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చిత్తూరు పార్లమెంటు పరిధిలో గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పుంగనూరు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ వరుసగా మూడు పర్యాయాలు ఓటమిపాలైంది. ఈ మూడు నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు కొత్త అభ్యర్థులను రంగంలోకి తీసుకుని వచ్చారు. 

కొత్తగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఏర్పాటైన తర్వాత ఈ నియోజకవర్గ నుంచి ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కార్వేటినగరం, గంగాధర నెల్లూరు, పాలసముద్రం, పెనుమూరు, వెదురుకుప్పం, శ్రీరంగరాజపురం మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆర్ గాంధీ పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి గుమ్మడి కుతహలమ్మ పోటీ చేశారు. ఆమె 10,826 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికలలో మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ తెలుగుదేశం పార్టీలో చేరి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుత ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పోటీ చేశారు. కుతూహలమ్మ మీద నారాయణస్వామి 20,565 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో మాజీ మంత్రి గుమ్మడి కుతూహాలమ్మ తనయుడు హరికృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయగా, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో కూడా నారాయణస్వామి 45,594 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. దీంతో కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాలని తెలుగుదేశం పార్టీ భావించింది. చెన్నైలో వైద్యునిగా పేరు తెచ్చుకున్న వెదురుకుప్పంకు చెందిన ఎం వి థామస్ ని తమ అభ్యర్థిగా రంగంలోకి తీసుకొని వచ్చారు. ఎం వి థామస్ సంతాన సాఫల్య కేంద్రాన్ని నిర్వహిస్తూ ఆర్థికంగా బాగా ఉన్నారు. ఆర్థిక పరిపుష్టి కలిగిన వ్యక్తికి కావడంతో గెలుపు సులభమని భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆశించినట్లు ఎం వి థామస్ ఈ ఎన్నికలలో ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఈ సారి ఎన్నికల బరిలో వైసిపి తరపున ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి ఉన్నారు.

 
పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఒకసారి కూడా విజయం సాధించలేదు. ఈ నియోజకవర్గంలో ఐరాల, పూతలపట్టు, తవణంపల్లి, బంగారుపాలెం, యాదమరి మండలాలు ఉన్నాయి. పూతలపట్టు నియోజకవర్గంలో 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పి రవి విజయం సాధించగా, 2014 ఎన్నికలలో ఎం. సునీల్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా, 2019 ఎన్నికల్లో ఎమ్మెస్ బాబు వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2009, 2014, 2019 ఎన్నికలలో మూడు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లలిత కుమారి పోటీ చేశారు. మూడుసార్లు ఆమె ఓటమిపాలయ్యారు. 2009 ఎన్నికలలో 951 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆమె 2014 ఎన్నికలలో 902 ఓట్ల తేడాతో మళ్ళీ ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నికలలో 29, 163 ఓట్ల తేడాతో లలిత కుమారి ఓటమిపాలయ్యారు. ఎన్నికల అనంతరం ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో పూతలపట్టు మండలానికి చెందిన పాత్రికేయుడు కలికిరి మురళీమోహన్ ను తెలుగుదేశం పార్టీ తెర మీదకి తీసుకు వచ్చింది. పాత్రికేయుడిగా తిరుపతిలో పని చేస్తున్న ఆయనను నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించింది. ఆయన నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి, ప్రచార కార్యక్రమాలలో దూసుకుపోతున్నారు. రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ సారి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వైసిపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 

 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పుంగనూరు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ వరుసగా పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నియోజకవర్గంలో సదం, సోమల, చౌడేపల్లి, పుంగనూరు, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలు వస్తాయి. ఈ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ఒక పర్యాయం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, మరో రెండు పర్యాయాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఘన విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికలలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వెంకటరమణ రాజును తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. 2009 ఎన్నికలలో 40,727 ఓట్ల తేడాతో రాజు ఓడిపోగా, 2014 ఎన్నికలలో 31,731 ఓట్ల తేడాతో మరోసారి ఓటమి చనిచూశారు. దీంతో 2019 ఎన్నికలలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరదలు అనిషారెడ్డిని తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా రంగంలోకి దించింది. ఆమె 42,710 ఓట్ల తేడాతో పెద్దిరెడ్డి మీద ఓటమిపాలయ్యారు. దీంతో కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాలని పులిచెర్ల మండలానికి చెందిన చల్లా రామచంద్రారెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. చల్లామచంద్రారెడ్డి ఒకసారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు. ఆయన టిడిపి బోర్డు సభ్యుడుగా కూడా పనిచేశారు. కొత్త అభ్యర్థి అయితే నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఉంటాయన్న భావంతో చల్లా రామచంద్రారెడ్డిని ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దించారు. ఆయన పోరాటపటమితో ముందుకు పోతున్నారు. ఈ సారి కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పోటీలో ఉన్నారు. 

ఈ మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య పోటీగా హోరాహోరుగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్తగా రంగంలోకి దించిన ముగ్గురు అభ్యర్థుల భవితవ్యం మరో నెల రోజుల్లో తేలనుంది. చంద్రబాబు కొత్త ప్రయోగం ఫలిస్తుందా, లేదా  అని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *